బానిసలుగా కాదు.. ఉద్యోగులుగా గుర్తించండి
ABN, First Publish Date - 2023-03-05T23:59:01+05:30
ఎనర్జీ సెక్రటరీలను బానిసలుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉంచి ఏకపాలనకు ఉత్తర్వులు ఇవ్వాలని గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంజునాధ్‌లు డిమాండ్ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
రాయచోటి టౌన్, మార్చి 5: ఎనర్జీ సెక్రటరీలను బానిసలుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉంచి ఏకపాలనకు ఉత్తర్వులు ఇవ్వాలని గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంజునాధ్‌లు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని సీఆర్‌రెడ్డి డిగ్రీ కాలేజ్‌లో ఆ సంఘం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎల్‌యం గ్రేడ్-2లు గ్రామ, వార్డు సచివాలయ, విద్యుత్ అధికారుల మధ్య నలిగిపోతూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బయోమెట్రిక్‌ను ఆఫీస్ పనివేళల్లో కచ్చితంగా వేయాలని హుకుం జారీ చేయడమే కాకుండా కొన్నిచోట్ల మేము చెప్పిన పనినే చేయాలని కూడా ఎంపీడీవోలు ఆదేశిస్తున్నారని, లేదంటే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు విద్యుత్ అధికారులు మేము జీతాలు చెల్లిస్తున్నాము, కాబట్టి మేము చెప్పిన పనే చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని, ఇలా రెండు శాఖల మధ్య జేఎల్‌యం గ్రేడ్-2లు పనిఒత్తిడితో నగిలిపోతున్నారన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను జేఎల్‌ఎం గ్రేడ్-2లకు చెల్లించి విద్యుత్ సంస్థ సర్వీస్ రూల్ ప్రకారం 24 గంటలు పనిచేయించుకోవడం ద్వారా జేఎల్‌ఎం గ్రేడ్-2లు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 100 మందికిపైగా జేఎల్‌ఎం గ్రేడ్-2లు మరణించారని, 200 మందికిపైగా అంగవైకల్యం చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎనర్జీ సెక్రటరీలను బాధ్యులుగా చేసి సస్పెండ్ చేస్తూ, బాధ్యులైన వారికి మాత్రం మెమోతో సరిపెట్టి జేఎల్‌యం గ్రేడ్-2లను బలి పశువులను చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. జిల్లా కార్మిక నాయకుడు సాంబశివయ్య మాట్లాడుతూ జేఎల్‌ఎం గ్రేడ్-2లను విద్యుత్ సంస్థల పర్యవేక్షణలో కాకుండా గ్రామ, వార్డు సచివాలయ పర్యవేక్షణలో ఉండేటట్లు ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర కోశాధికారి సుధీర్‌బాబు, కడప జిల్లా అధ్యక్షుడు కృపాకర్, కోశాధికారి శ్యామ్, అన్నమయ్య జిల్లా నాయకులు రెడ్డిరాజు, రమణరాజు, దర్బార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T23:59:01+05:30 IST