భూ రక్ష కాదు.. భూ భక్ష..!
ABN, First Publish Date - 2023-08-22T23:23:56+05:30
మండలంలోని నిడివెలగల రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ శాఖ వారు ఇటీవల భూముల రీసర్వే నిర్వహించారు. ఈ సర్వే చేసేందుకు రైతుల నుంచి అనుమతి తీసుకోకపోగా.. ఎలాంటి సమాచారం లేకుండా వారిపాటికి వారు రైతుల పొలాలను సర్వే పూర్తి చేశారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై రైతుల గగ్గోలు
రైతుల అనుమతి లేకుండా రీ సర్వే
పట్టా భూముల్లో భారీగా కోత
రెవెన్యూ కార్యాలయానికి రైతుల పరుగులు
సీఎం సొంత నియోజకవర్గంలో భూరక్ష తీరు ఇదీ
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం భూరక్ష పథకం పేరుతో భూములు రీసర్వే చేస్తోంది. వైఎస్ జగన్ ఫొటోతో కొత్త పట్టాదారు పుస్తకాలు ఇస్తోంది. పట్టాదారు పుస్తకంపైన జగన్ ఫొటో వేసేందుకు ఉన్న శ్రద్ధ రీసర్వేలో చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో రీసర్వేతో ప్రతి రైతూ ఎంతోకొంత భూమి కోల్పోయారు. కొందరికి 66 సెంట్లు తగ్గిపోయింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం కింద నిర్వహిస్తున్న రీ సర్వే తమ కొంప ముంచుతోందని, ఇది భూ భక్ష పథకంగా మారిందని పలువురు రైతులు లబోదిబోమంటున్నారు.
సింహాద్రిపురం, ఆగస్టు 22: మండలంలోని నిడివెలగల రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ శాఖ వారు ఇటీవల భూముల రీసర్వే నిర్వహించారు. ఈ సర్వే చేసేందుకు రైతుల నుంచి అనుమతి తీసుకోకపోగా.. ఎలాంటి సమాచారం లేకుండా వారిపాటికి వారు రైతుల పొలాలను సర్వే పూర్తి చేశారు. సీఎం జగన్ ఫొటోలతో జగనన్న భూ హక్కు పత్రం, భూయాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం పేరుతో పుస్తకాలు సిద్ధం చేశారు. రీసర్వేలో తమ భూములు తగ్గిపోయాయని తెలుసుకున్న రైతులు ఈ పుస్తకాలను తీసుకోకుండా అభ్యంతరం చెప్పారు. అయినా సరే.. మగవారు ఇళ్లలో లేని సమయంలో రెవెన్యూ అధికారులు వీఆర్‌ఏల చేత పట్టాదారు పుస్తకాలు పంపించి ఆయా రైతుల కుటుంబాలకు అందజేశారు. దీంతో పలువురు రైతులు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు సోమవారం తహసీల్దార్ మహబూబ్‌బాషాను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అనుభవంలో ఉండి, పాత పట్టాదార్ పుస్తకంలో ఉన్న భూములను రీ సర్వే పేరుతో తగ్గించేసి కొత్త పుస్తకాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తమ భూములు తమకు దక్కకుంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సర్వేలో తప్పిదాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని అన్నారు.
రీసర్వే బాధితులు ఎందరో..
రీ సర్వేలో పలువురు రైతులు భూములు కోల్పోయారు. దీంతో బాధితులంతా ఆందోళన చెందుతున్నారు. పట్టా నెంబరు 109 సర్వే నెంబరు 337-2లో పి.రాజశేఖర్‌రెడ్డి 29సెంట్లు, పట్టా నెంబరు 312 సర్వే నెంబరు 332-1లో పి.రమాదేవి 38 సెంట్లు, పట్టా నెంబరు 224 సర్వే నెంబరు 322-3లో పి.సూర్య ప్రతాప్‌రెడ్డి 30 సెంట్లు కోల్పోయారు. అలాగే పట్టా నెంబరు 150లో సర్వే నెంబరు 316-పిలో టి.ప్రభంజన్‌రెడ్డి 66 సెంట్లు, 337-2 సర్వే నెంబరులో కె.చంద్రకళ, కుమారుడు నాగేశ్వర్‌రెడ్డిలు 23 సెంట్లు భూమిని రీ సర్వేలో కోల్పోయారు. ఇలాంటి బాధితులు మండలంలో చాలామంది ఉన్నారు.
అన్ని గ్రామాల్లో ఇదే సమస్య..
మండలంలోని జంగంరెడ్డిపల్లి, తెలికి, నిడివెలగల, హిమకుంట్ల, సింహాద్రిపురం రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. అన్ని గ్రామాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. రీ సర్వేతో ప్రతి రైతూ ఎంతో కొంత భూమిని కోల్పోయారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ పనులు వదులుకుని తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ పట్టాదారు పాసు పుస్తకంలో తగ్గిన పొలం మీ పక్కవారి పొలంలో నమోదైంది. వారిపై కోర్టుకు వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భూములు అధిక ధరలు ఉండటంతో ఒక్క సెంటు కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి రీ సర్వే సక్రమంగా చేయాలని లేదా రీ సర్వే ఆపివేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.
రీ సర్వేలో 66 సెంట్లు కోల్పోయాను
రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వేతో నా సొంత పట్టా భూమిలో 66 సెంట్లు కోల్పో యాను. నిడివెల గల రెవెన్యూ పొలంలో పట్టా నెంబరు 150 సర్వే నెంబరు 316-పిలో నాకు 2.85 ఎకరాల పొలం ఉంది. రీ సర్వే అనంతరం 2.19 ఎకరాలు ఉన్నట్లు కొత్త పట్టాదారు పుస్తకం ఇచ్చారు. మునుపటి లాగా 2.85 ఎకరాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- టి.ప్రభంజన్‌రెడ్డి, రైతు, అగ్రహారం గ్రామం, సింహాద్రిపురం మండలం
రీ సర్వేతో అన్యాయం జరిగింది
నాకు నిడివెలగల రెవెన్యూ పొలంలో పట్టా నెంబరు 161 సర్వే నెంబరు 329-1లో 5.64 ఎకరాల పొలం ఉంది. రీ సర్వే చేసిన అనంతరం రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా 5.08 ఎకరాల పొలం ఉన్నట్లు కొత్త పట్టాదారు పాసు పుస్తకం తెచ్చి ఇచ్చారు. రీ సర్వేతో అన్యాయం జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
- సి.జయరామిరెడ్డి, రైతు, అగ్రహారం గ్రామం, సింహాద్రిపురం మండలం
రైతులకు న్యాయం చేస్తాం
అప్పట్లో బ్రిటిష్ వారి హయాంలో గొలుసులతో కొలతలు వేశారు. ప్రస్తుతం మనం వేసే కొలతలకు తేడా వస్తోంది. కానీ రైతులు నష్టపోకుండా మళ్లీ సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తాం. రైతులు ఆందోళన పడాల్సిన అవసరంలేదు.
- మహబూబ్ బాషా, తహసీల్దార్, సింహాద్రిపురం మండలం
Updated Date - 2023-08-22T23:23:56+05:30 IST