NARA LOKESH : జగన్ పాలనలో రెడ్లూ బాధితులే
ABN, First Publish Date - 2023-06-07T03:59:36+05:30
‘జగన్ పాలనలో రెడ్లు బాగుపడి ఉంటారనుకున్నాం. కానీ యువగళం పాదయాత్ర మొదలుపెట్టాక తెలిసింది.
బాగుపడింది పెద్దిరెడ్డి, సజ్జల, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి
ఆది నుంచీ రెడ్లకు అండగా తెలుగుదేశం పార్టీ
2019 ఎన్నికల్లో జగన్ అసత్య ప్రచారాన్ని నమ్మారు
టీడీపీ అధికారంలోకొచ్చాక పేద రెడ్లకు సాయం చేస్తాం
రెడ్డి సామాజిక వర్గంతో ముఖాముఖిలో నారా లోకేశ్
కడప, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘జగన్ పాలనలో రెడ్లు బాగుపడి ఉంటారనుకున్నాం. కానీ యువగళం పాదయాత్ర మొదలుపెట్టాక తెలిసింది. జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్లేనని. రెడ్డి సామాజిక వర్గ ప్రజలు కూడా జగన్ చేతిలో బాధితులుగా మారారు. కేవలం నలుగురు రెడ్లు.. పాపాల పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తప్ప ఏ ఇతర కుటుంబాలకూ న్యాయం జరగలేదు. జగన్ పాలనలో కనీసం రెడ్లకు గౌరవం కూడా దక్కలేదు. మొదటి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. ఆ పార్టీ మాత్రమే వారికి గౌరవం ఇచ్చింది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కడప బిల్టప్ సర్కిల్ వద్ద పుత్తా ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో జిల్లాలోని రెడ్డి సామాజికవర్గ ప్రతినిధులతో లోకశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రెడ్లు లోకేశ్ ఎదుట వారి సమస్యలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుంచీ రెడ్లకు సముచిత గౌరవం ఇచ్చామన్నారు. 2014–19 పాలనలోకూడా పలువురు మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేశారన్నారు. తన వ్యక్తిగత సిబ్బందిలో కూడా రెడ్లు ఉన్నారని, పాదయాత్రకు తాను నమ్మే వాస్తు సిద్ధాంతి జయరామిరెడ్డి ముహూర్తం పెట్టారని లోకేశ్ అన్నారు. రామగోపాల్‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించుకున్నామని గుర్తు చేశారు.
బిల్లులు ఇవ్వకుండా వేధింపులు..
టీడీపీ హయాంలో చేసిన పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తుందని కొందరు లోకేశ్ దృష్టికి తెచ్చారు. దానికి ఆయన బదులిస్తూ... రాయలసీమలో కాంట్రాక్టర్లు రెడ్లేనని, వారిని కూడా జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎం అయిన 12 రోజుల్లోనే తన తమ్ముడు హత్యకు గురయ్యాడని, పిల్లలను ఆదుకోవాలని వేముల మండలానికి చెందిన రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేయగా, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆదుకుంటామన్నారు. తన కొడుకును హత్య చేసి.. ఆస్తి లాక్కునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మునెమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేయగా... దీనికి లోకేశ్ స్పందిస్తూ... మునెమ్మ కుమారుడిని ప్రత్యర్థులు చంపేస్తే పిల్లలను టీడీపీ చదివిస్తోందని, అదీ రెడ్ల పట్ల టీడీపీ చూపుత్ను శ్రద్ధ అన్నారు. చదువుకున్న రెడ్ల యువత రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, వారికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రసాద్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై లోకేశ్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చాక పారిపోయిన పరిశ్రమలను తెచ్చి.. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.
లోకేశ్ యువగళం పాదయాత్రకు కడప గడపలో అపూర్వ స్పందన లభించింది. 118వరోజు యువగళం పాదయాత్ర పుత్తా ఎస్టేట్‌లోని విడిది కేంద్రం నుంచి మంగళవారం సాయంత్రం 5.10 గంటలకు మొదలైంది. ఎస్టేట్ వద్ద పండ్ల గజమాలతో లోకేశ్‌ను సత్కరించారు. లోకేశ్ పాదయాత్రలో సమస్యలు చెప్పుకునేందుకు జనం ముందుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన మీ–సేవా కేంద్రాలను తొలగించిన తమను రోడ్డున పడేశారంటూ కొందరు లోకేశ్‌కు తెలిపారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ మాట తప్పడం మడమ తిప్పడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీసేవ ఉద్యోగుల గతంలో మాదిరిగా ఉపయోగించుకుంటామన్నారు. కొండాయపల్లె, చిన్నచౌకు, బైపాస్ మీదుగా సాగిన పాదయాత్ర ఆర్‌కే నగర్‌లోని రాజరాజేశ్వరి గుడి వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకుంది. మంగళవారం 118వ రోజు 7.4 కి.మీ నడిచారు. ఇప్పటి వరకు 1516.8 కి.మీ. పూర్తయింది.
నేడు రాయలసీమ అభివృద్ధి ప్రణాళిక ప్రకటన
లోకేశ్ 118 రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించారు. యువతకు ఉద్యోగ ఉపాధి, రైతులకు లాభసాటి వ్యవసాయం, కార్మికులు, మహిళలు, వృద్ధులు తదితరులకు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియజేసేలా రాయలసీమ అభివృద్ధిపై ప్రణాళికను బుధవారం లోకేశ్ ప్రకటించనున్నారు. కాగా, బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు.
Updated Date - 2023-06-07T03:59:36+05:30 IST