వైభవంగా ముక్కోటి ఏకాదశి
ABN, First Publish Date - 2023-01-02T23:15:48+05:30
ఏకశిలా నగిరి కోదండరామాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉత్తర ద్వారం గుండా మూలవిరాట్ అయిన సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు.
కోదండరామాలయానికి పోటెత్తిన భక్తులు
ఒంటిమిట్ట, జనవరి 2 : ఏకశిలా నగిరి కోదండరామాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉత్తర ద్వారం గుండా మూలవిరాట్ అయిన సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై సీతారామలక్ష్మణులను ఉంచడంతో ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తారనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున కోదండరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. క్యూలైన్‌లో చలువ పందిళ్లు వేయకపోవడంతో ఎండ వేడిమికి చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. భక్తులు టీటీడీ అధికారులపై ఓ దశలో అసహనం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున అరుపులు కేకలతో రామాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే వీఐపీ దర్శనాలను అధికారులు నిలిపివేసి సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించారు. ముక్కోటి దేవతలు అనుగ్రహం ప్రసాదించాలని పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
గరుడ వాహనంపై కోదండరాముడు
కోదండ రామాలయంలో సీతారామలక్ష్మణులు గరుడ వాహనంపై విహరించారు. ఉదయం 4 గంటల నుంచి రామాలయంలో సీతారామలక్ష్మణులకు అర్చకులు అభిషేకం, ప్రత్యేక పూజలను నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, అనంతరం వేకువజామున 5 గంటలకు గరుడ వాహనంపై సీతారామలక్ష్మణులను ప్రత్యేకంగా అలంకరించి ఉత్తర ద్వారంలో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శింపజేశారు. ఉదయం 9 గంటల వరకు ఉత్తర ద్వారంలో ఉంచిన గరుడ వాహనాన్ని 9 గంటల అనంతరం పురవీధుల్లో గుండా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - 2023-01-02T23:15:49+05:30 IST