వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారం
ABN, First Publish Date - 2023-03-07T23:27:44+05:30
రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించి తద్వారా రాష్ట్రంలోని వక్ఫ్ భూములను పరిరక్షించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
ఇస్లామిక్ బ్యాంక్‌తోనే ముస్లింల ఆర్థిక స్వావలంబన
కేరళ తరహాలో గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక బోర్డు
అధికారం లేని పదవితో నిస్సహాయ స్థితిలో ఉప ముఖ్యమంత్రి
ముస్లింలతో ముఖాముఖిలో నారా లోకేశ్
కలికిరి/పీలేరు, మార్చి 7: రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పించి తద్వారా రాష్ట్రంలోని వక్ఫ్ భూములను పరిరక్షించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి ఉపయోగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్రలో భాగంగా కలికిరిలో మంగళవారం ఆయన ముస్లింలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తేనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సాధ్యమవుతుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంకును స్థాపించడమే కాకుండా స్వయం సహాయక సంఘాల తరహాలో ఆ బ్యాంకును సమర్థవంతంగా నడుపుతామన్నారు. స్థానికంగా ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి కోసం కేరళ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని, విదేశాలకు వెళ్లిన వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆ బోర్డు ద్వారా పరిష్కరిస్తామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని ముస్లింలపై అనేక అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. మూడు రాజధానుల బిల్లును ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపినందుకు మండలి చైర్మన్ షరీ్‌ఫపై సాక్షాత్తు మంత్రులు దాడికి యత్నిస్తే ఆయన పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల్లో మోసపోయినట్లు మరోమారు మోసపోకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ముస్తఫా హజరత్: ముస్లింలకు నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్ కల్పిస్తారా? ముస్లింల అభివృద్ధికి ఏయే కార్యక్రమాలు చేపడతారు?
నారా లోకేశ్: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది టీడీపీ మాత్రమే. గత ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోకపోవడంతో మేం 2014లో అధికారంలోకి వచ్చాక కాసింత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చంద్రబాబు ఆ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుని రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు వరకు పోరాడుతున్నారు. 2019లో మేం అధికారం కోల్పోయిన కొత్తలో కూడా ఆ అంశంపై సుప్రీంకోర్టులో వాయిదా ఉంటే పార్టీ తరపున లాయర్లను పంపి కేసు వాదించారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఆ కేసు కోసం కనీసం లాయర్లను కూడా పంపలేదు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగించి ముస్లింలకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం.
వేంపల్లె అబ్దుల్ ఖాదర్ (ప్రముఖ కవి): రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తే బాగుంటుంది. ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారా?
నారా లోకేశ్: అద్భుతమైన ఆలోచన అది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తాం. జ్యుడీషియల్ అధికారాల వల్ల వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకునే వారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు కలుగుతుంది. తద్వారా వక్ఫ్ ఆస్తుల్ని కాపాడుకోవచ్చు. ఈ అంశాన్ని మా మ్యానిఫెస్టోలో కూడా పెడతాం.
పర్వీన్ సబీహా : ఇక్కడ ఉపాధి లేక మాలో చాలా మంది గల్ఫ్‌కు వెళుతున్నారు. ఒక్కోసారి అక్కడ కూడా సమస్యలు ఎదురై ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం మీరు ఏం చేస్తారు?
నారా లోకేశ్: ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో యువత, మహిళలు గల్ఫ్ దేశాలకు వెళుతున్న మాట నిజం. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి కోసం 2014-2019 మధ్య ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థను విజయవంతంగా నడిపాం. సరైన పత్రాలు లేక గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న అనేక మందిని ఆ సంస్థ ద్వారా స్వగ్రామాలకు రప్పించాం. అయితే ఈ ప్రభుత్వం ఆ సంస్థను మూసివేసింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కేరళ తరహాలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. తద్వారా మోసాలను అరికడతాం.
ఎస్‌కే జిలానీ: ముస్లింలలో చాలా మంది డీఎస్సీ కోసం ఎదురుచూసి నిరుత్సాహపడిపోతున్నారు. మీరు అధికారంలోకి వస్తే డీఎస్సీ నిర్వహిస్తారా?
నారా లోకేశ్: గతంలో ప్రత్యేకంగా ఉర్దూ డీఎస్సీ నిర్వహించిన ఘనత టీడీపీది. సాధారణ డీఎస్సీతో పాటు మరోమారు ఉర్దూ డీఎస్సీ నిర్వహించి ముస్లిం యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఇస్లామిక్ బ్యాంకు ద్వారా ఎటువంటి షరతులు, ష్యూరిటీలు అవసరం లేని రుణాలు అందిస్తాం. స్టార్ట్‌పలను ప్రోత్సహించి ముస్లిం యువత కేవలం ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయికి వచ్చేలా అన్ని చర్యలూ తీసుకుంటాం.
కరీముల్లా: ముస్లింల హజ్ యాత్రకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు?
నారా లోకేశ్: ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైన హజ్ యాత్ర చేయాలనుకుంటాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది హజ్ యాత్ర చేయలేకపోతున్నారని చంద్రబాబు ఉచిత హజ్ యాత్ర పథకం తీసుకువచ్చారు. దాంతో కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. విజయవాడలోని హజ్ హౌస్‌ను మేము నిర్మిస్తే వైసీపీ వారు తమ ఘనతగా చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని హజ్‌హౌస్ అసంపూర్తిగా ఉంటే పట్టించుకోవడం లేదు. అయితే హజ్ యాత్ర పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి పూర్తిగా మరిచిపోయారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పునరుద్ధరిస్తాం.
అమీర్: గుజరాత్ తరహాలో యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఏమైనా ఇవ్వగలరా? దూదేకులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయగలరా?
నారా లోకేశ్: పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతున్న తరుణమిది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేకుండా కేవలం మూడు, నాలుగు నెలల్లో అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లో వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ నాయకుల వేధింపులు, బ్యాంకుల షరతులు కారణంగా చాలా మందికి స్టాండప్ రుణాలు అందడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్తిగా సరళీకృత విధానాలు తెచ్చి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. దూదేకుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్పప్పటికీ దానికి నిధులు లేక చతికిలపడిపోయింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రూ.40 కోట్లు దూదేకుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. తిరిగి అధికారంలోకి వస్తే తప్పక నిధులు కేటాయిస్తాం.
ఉపముఖ్యమంత్రి, కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నట్లు!
-నారా లోకేశ్
ముస్లింలతో ముఖాముఖి సందర్భంగా నారా లోకేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. రాష్ట్రంలోని ముస్లింలపై వరుస దాడులు జరుగుతున్నా ఉపముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. పవర్ లేని పోస్టులో ఆయన నిస్సహాయుడిగా మిగిలిపోయారని, ముఖ్యమంత్రి జగన్ ఆయనకు పేపర్, పెన్ ఇచ్చారేగానీ పెన్నులో ఇంకు లేకుండా చేసేశారని ఎద్దేవా చేశారు. నంద్యాల అబ్దుల్ సలామ్ ఘటన తరువాత కఠిన చర్యలు తీసుకుని ఉంటే అక్రమార్కులకు భయం పుట్టేదన్నారు. ఎమ్మిగనూరుకు చెందిన హాజీరాబీ అనే యువతిని అత్యాచారం చేసి చంపేసినా పట్టించుకోలేదని, ఆ ఘటన జరిగి ఏడాదిన్నర అవుతున్నా ఆమె తల్లికి ఇంతవరకు పోస్టుమార్టం నివేదిక అందలేన్నారు. మసీదు భూముల కోసం పోరాడుతుంటే నరసరావుపేటలో ఓ ముస్లిం యువకుడిని నడిరోడ్డులో హత్య చేసినా ఉపముఖ్యమంత్రి చలించలేదన్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తన పొరుగునే ఉన్న పలమనేరు నియోజకవర్గంలో జరిగిన మిస్బా ఘటనపై స్పందించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలు ఏకపక్షంగా జగన్ వెంట నడిచారని, వచ్చే ఎన్నికల్లోనైనా రాష్ట్రంలోనూ, పీలేరులోనూ టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు ముస్లింలు ఆయనకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-07T23:27:44+05:30 IST