ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి
ABN, First Publish Date - 2023-02-21T23:02:22+05:30
జిల్లాలోని అధికారులందరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ ్ట(ఎంసీసీ) నిబంధనలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), ఫిబ్రవరి 21: జిల్లాలోని అధికారులందరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ ్ట(ఎంసీసీ) నిబంధనలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యానర్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి పోస్టర్లు ఉండకూడదన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను, సూచనలను తప్పక పాటించాలన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. మార్చి 13వ తేదీ జరగనున్న ఎన్నికల కోసం జిల్లాలోని పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులు ఉండేటట్లు చూడాలన్నారు. బ్యాలెట్ బాక్సులు అవసరం మేరకు సిద్ధంగా ఉంచుకుని పోలింగ్ మెటీరియల్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయ నేతలు ప్రవర్తించకూడదన్నారు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదని, మసీదులు, చర్చిలు దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధమన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం చేయకూడదన్నారు. జిల్లాలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్‌ఖాన్, డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-21T23:02:23+05:30 IST