ఏడాది.. అభివృద్ధి జాడేది?
ABN, First Publish Date - 2023-04-03T23:37:28+05:30
జిల్లా ఏర్పడితే అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది.. ఎన్నెన్నో ప్రత్యేక సదుపాయాలు, వసతులు, నిధులు వస్తాయని సంబరపడ్డ జిల్లా ప్రజలకు ఏడాది దాటినా అనుకున్నంత అభివృద్ధి జరగక నిరాశే మిగిలింది.
అద్దె భవనాల్లోనే కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంపు కార్యాలయాలు
నిధులు లేవు.. మౌలిక వసతులు కరవు
ఇబ్బందుల్లో ఉద్యోగులు
శంకుస్థాపనలకే అభివృద్ధి కార్యక్రమాలు పరిమితం
ఇదీ కొత్తగా ఏర్పడ్డ అన్నమయ్య జిల్లా దుస్థితి
ఇల్లు అలకగానే.. పండగ అయిపోదు.. ఇది తెలుగునాట బాగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి.. ప్రస్తుతం ఈ నానుడి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. కచ్చితంగా సంవత్సరం కిందట రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పడితే అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది.. ఎన్నెన్నో ప్రత్యేక సదుపాయాలు, వసతులు, నిధులు వస్తాయని సంబరపడ్డ జిల్లా ప్రజలకు ఏడాది దాటినా అనుకున్నంత అభివృద్ధి జరగక నిరాశే మిగిలింది. కలెక్టరేట్‌లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న స్వీపర్లకు మూడు నెలలుగా, కలెక్టరేట్ సెక్యూరిటీ గార్డులకు ఆరు నెలలుగా జీతాలు రాలేదు. కొన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు సరైన సదుపాయాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు కొత్త జిల్లాపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరుస్తుందో..
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడినపుడు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. అప్పట్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేశారు. తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా కడప-చిత్తూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. అదే రోడ్డుకు ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో జిల్లా అధికారులు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కోసం సుమారు 70 ఎకరాల్లో స్థల సేకరణ కూడా పూర్తి చేశారు. వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు ప్రారంభిస్తారని ప్రకటించినా.. ఇప్పటికీ కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. అప్పట్లో అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిన పలు శాఖల కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలు సంవత్సరమైనా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయం, స్ర్తీ శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం, సివిల్‌సప్లై ఎండీ కార్యాలయం, జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయం వంటివి ఇంకా అద్దె గదుల్లోనే నడుస్తున్నాయి.
ఉద్యోగుల బాధలు.. దేవుడికెరుక ?
కొత్త జిల్లాలో పలు శాఖల ఉద్యోగులు కనీస మౌలిక వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్‌లో ముఖ్య కార్యాలయంగా చెప్పుకునే ముఖ్య ప్రణాళికా కార్యాలయంలో ఐదుమంది ఉద్యోగులకు గానూ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కంప్యూటర్లు, ప్రింటర్లు లేవు. ముగ్గురు అటెండర్లకు గానూ ఒకరే ఉన్నారు.
- సర్వే ఏడీ కార్యాలయంలో అన్ని వసతులు ఉన్నాయి. అయితే సంబేపల్లె, చిన్నమండెం మండలాలకు సర్వేయర్లు లేరు. సచివాలయ సిబ్బందితోనే పనిచేయిస్తున్నారు. ఖజానా కార్యాలయంలో ఐదుమంది అటెండర్లు ఉండాల్సి ఉండగా.. ఒకరే ఉన్నారు. జిల్లా గ్రామ సచివాలయ వలంటీర్ కార్యాలయంలో ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్‌లు ఉండాలి. అయితే వాళ్లు లేకపోవడంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేయించుకుంటున్నారు.
- కలెక్టరేట్ అడ్మినిస్ర్టేషన్ కార్యాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే బడ్జెట్ లేదు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లకు మూడు నెలలు, సెక్యూరిటీ గార్డులకు ఆరు నెలల నుంచి జీతాలు రాలేదు.
- జిల్లా ఆడిట్ కార్యాలయంలో 27 మంది సిబ్బందికి గానూ 22 మంది ఉన్నారు. రికార్డు రూము లేదు. బడ్జెట్ లేదు. ఈ కార్యాలయానికి మూడు గదులు, ఒక రికార్డు గది ఉండాలి. కావాల్సినన్ని గదులు లేకపోవడంతో ఆరుమంది అసిస్టెంట్ ఆడిట్ అధికారులు ఒకే గదిలో కూర్చుని పనిచేయాల్సి వస్తోంది.
- పర్యాటక శాఖలో టైపిస్టు, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, అటెండర్ ఉండాలి. అయితే పర్యాటకశాఖ ఏడీ, టైపిస్టు మాత్రమే ఉన్నారు.
- జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులకు గానూ.. ఐదుమంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి పంచాయతీ సెక్రటరీల ద్వారా పనులు చేయించుకుంటున్నారు. గతంలో విద్యార్థుల వసతిగృహంగా ఉన్న భవనాన్ని ఈ కార్యాలయానికి కేటాయించారు. దీంతో గతంలో విద్యార్థుల డైనింగ్ హాల్‌లోనే ఈ కార్యాలయం నడుస్తోంది.
- బీసీ సంక్షేమశాఖాధికారికి ప్రభుత్వ వాహనం లేదు. ఉద్యానవన శాఖ కార్యాలయంలో 12 మంది హెచ్‌వోలకు గానూ 8 మంది ఉన్నారు. పది మంది కార్యాలయం సిబ్బందికి గానూ 6 మంది ఉన్నారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఒక అటెండర్‌ను ఇచ్చారు.
- జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి గానూ ఐదు మంది ఉన్నారు. ఇక్కడ సరైన కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు లేవు. ఇంటర్నెట్ లేదు. ప్రింటర్ లేదు. మహిళలకు మరుగుదొడ్లు లేవు. పంచాయతీరాజ్ ఎస్‌ఈకి ప్రభుత్వ వాహనం లేదు. ముగ్గురు అంటెండర్లకు గానూ ఒకరు ఉన్నారు.
- ఆర్‌డబ్య్లుఎస్ ఎస్‌ఈ కార్యాలయంలో ముగ్గురు ఏఈలకు గానూ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఆర్టీవో కార్యాలయంలో కంప్యూటర్లు, ప్రింటర్ లేవు. కుర్చీలు లేవు. డ్రైవింగ్ ట్రాక్ సరిగా లేదు. ఒకే గదిలో ఏవో, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డీస్పాచ్ సెక్షన్ అధికారి కూర్చుంటున్నారు. ఇద్దరు ఎంవీఐలు ఒకే గదిలో కూర్చుంటున్నారు. చాలా చిన్న గదిలో ఎల్‌ఎల్‌ఆర్ ట్రైనింగ్ చేయాల్సి వస్తోంది.
- డీఆర్‌డీఏ పీడీ కార్యాలయంలో అటెండర్లు లేరు. కంప్యూటర్లు, ప్రింటర్లు లేవు. ఇంటర్నెట్ సౌకర్యం లేదు.
- డీఎంహెచ్‌వో కార్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. డాక్టర్లతో సమావేశం పెట్టుకోవాలన్నా మీటింగ్ హాల్ లేదు. కుర్చీలు లేవు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని సిబ్బంది సొంత డబ్బుతో ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయానికి 14 గదులు కావాల్సి ఉండగా 9 ఉన్నాయి. సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో 12 మంది సిబ్బందికి గానూ పది మంది ఉన్నారు.
- గృహ నిర్మాణ శాఖ జిల్లా కార్యాలయంలో 17 మంది ఉద్యోగులకు గానూ 6 మంది ఉన్నారు. జిల్లాలో దాదాపు 30 వేల పైచిలుకు ఇళ్లకు ఏప్రిల్ 14వ తేదీ గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లా అంతటా 71,161 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా చాలీచాలని సిబ్బందితో సర్దుకుపోతున్నారు.
- విద్యుత్ శాఖ రాయచోటి సబ్ డివిజన్‌లో 12 మందికి గానూ 6 మంది జేఈలు మాత్రమే ఉన్నారు. చాలా సబ్ డివిజన్లలో జూనియర్ ఇంజనీర్లతో పని చేయిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఈకి అడ్మినిస్ర్టేషన్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ అనుమతులు లేవు. జిల్లాలో మిగతా డివిజన్లలో కూడా అరకొర సిబ్బందితోనే సర్దుకుపోతున్నారు. భూగర్భగనుల శాఖలో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. ఇక్కడ కూడా సిబ్బంది కొరత ఉంది. అధికారికి ప్రభుత్వ వాహనం లేదు. సమాచార శాఖకు కెమెరా లేదు. కెమెరా మెన్ లేరు.
విషపురుగులతో సహజీవనం
రాజంపేట మార్గంలోని మైనార్టీ ఐటీఐ భవనాలల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ జిల్లా ఇంజనీరింగ్ కార్యాలయాలతో పాటు వ్యవసాయ, హార్టికల్చర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయం, ఆర్‌డబ్య్లుఎస్ ఎస్‌ఈ కార్యాలయం, ఏపీఎంఐపీ, జిల్లా పంచాయతీ కార్యాలయం, మత్య్సశాఖ, జిల్లా స్పోర్ట్స్ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, సహకార సొసైటీ కార్యాలయం, డీఆర్‌డీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేవు. తాగునీళ్లు లేవు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రింగురోడ్డు వద్ద నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. చుట్టూ ప్రహరీగోడ లేకపోవడం.. చుట్టూ పొలాలు ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి పాములు, తేళ్లు వంటి విషపురుగులు వస్తున్నాయి. ఈ కార్యాలయాల వద్ద బస్టాప్ కూడా లేదు. దీంతో బస్సులు నిలపక ఉద్యోగులు.. (ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు) చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యాలయాల సముదాయంలో పనిచేసే సుమారు 35 మంది ఉద్యోగులు ప్రతిరోజూ కడప నుంచి ఒక ప్రైవేటు బస్సులో వచ్చిపోతున్నారు. ఇక్కడ పలు కార్యాలయాల వద్ద ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలచి ఉన్నాయి. కొత్త జిల్లాలో పలు శాఖలకు కార్యాలయాలు కేటాయించినా.. ఇప్పటికీ కొన్ని శాఖలు ఇక్కడికి రాకుండా.. కడప నుంచే పరిపాలన సాగిస్తున్నాయి.
అభివృద్ధి పనులెక్కడ ?
కొత్త జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జోరుగా సాగడం లేదనే అభిప్రాయం నెలకొని ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పలు అభివృద్ధి పనులు ఆర్భాటంగా మొదలై అర్ధాంతరంగా ఆగిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో క్రికెట్ స్టేడియం, పార్కులు, శిల్పారామం వంటివి కేవలం శంకుస్థాపనలతోనే సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
Updated Date - 2023-04-03T23:37:28+05:30 IST