జగన్ పెద్ద డ్రామా మాస్టర్
ABN, First Publish Date - 2023-04-16T03:15:48+05:30
జగన్ పెద్ద డ్రామా మాస్టార్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
బాబాయి హత్యపై పెద్ద డ్రామా
కోడికత్తి అంటూ మరో డ్రామా
ఇది జగనాసుర రక్తచరిత్ర
బీసీలపై 25 వేల అక్రమ కేసులు
దళితులపైనా దమనకాండ: లోకేశ్
యువగళం 71వ రోజు 14.7 కి.మీ. నడక
కర్నూలు, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): జగన్ పెద్ద డ్రామా మాస్టార్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకుంటాడని, కానీ, ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 71వ రోజు(శనివారం) నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం కలచట్ల నుంచి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం రాంపల్లి వరకు 14.7 కి.మీలు కొనసాగింది. ఇప్పటికి మొత్తం 917.6 కి.మీలు లోకేశ్ నడిచారు. పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు సారథ్యంలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనంతో రహదారులు జనవారధులయ్యాయి. రాంపల్లి క్రాస్ వద్ద నిర్వహించిన సభలో లోకేశ్ మాట్లాడుతూ ‘జగన్ గొప్ప డ్రామా ఆర్టిస్టు. ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది. బాబాయి హత్య గురించి పెద్ద డ్రామా వేశారు. ముందు గుండెపోటు అన్నారు. తర్వాత నారాసుర రక్తచరిత్ర అన్నారు. ఆ తర్వాత కూతురు, అల్లుడు కలిసి చంపేశారన్నారు. ఆస్తి తగాదాలని మరోసారి అన్నారు. రెండో పెళ్లి వల్లనే హత్య జరిగిందంటున్నారు. సునీల్ యాదవ్ తల్లిపై కన్నేశాడు కాబట్టే మర్డర్ చేశాడంటూ కథ అల్లుతున్నారు. ఫైనల్‌గా తేలిందేంటీ? అరెస్టు అయిన ఉదయ్ కుమార్ అవినా్‌షరెడ్డి అనుచరుడేనని. ఇప్పుడు చెప్పండి జగన్..
హూ కిల్డ్ బాబాయి? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. ఇది జగనాసుర రక్తచరిత్ర. కోడికత్తి అంటూ మరో డ్రామా ఆడితే.. అది జగన్ అల్లిన కథే అని ఎన్‌ఐఏ నిగ్గు తేల్చింది. యువగళం పాదయాత్రతో తాడేపల్లి ప్యాలేస్ షేక్ అయింది. సింహం సింగిల్‌గా వస్తుందని అన్నవాడు.. నన్ను అడ్డుకోడానికి వేయి మంది పోలీసులను పంపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలేసరికి జగన్‌కు భయం పట్టుకుంది. ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకునే దుస్థితికి దిగజారిపోయాడు. భారతి రెడ్డికి చాలెంజ్ చేశాను. సౌండ్ లేదు. తాడేపల్లె ప్యాలేస్ ఫేక్ గ్యాంగ్ మొత్తం అడ్డంగా బుక్ అయింది. అమ్మా భారతి రెడ్డి దళితులకు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు’ అని లోకేశ్ ప్రశ్నించారు. ‘రాయలసీమ, పత్తికొండ రెడ్డి సోదరులు ఒక్కసారి ఆలోచించండి. జగన్‌ను గెలిపించుకోవడం కోసం ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు మీకు గౌరవం ఉందా? కేవలం పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప మిగిలిన రెడ్లు ఎవరైనా బాగు పడ్డారా?’ అని ప్రశ్నించారు. బీసీలపై రాష్ట్రవ్యాప్తంగా 25వేల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, దళితులపైనా దమనకాండ సాగుతోందన్నారు. పాదయాత్రలో టీడీపీ పత్తికొండ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు, జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పింఛను పీకేసిన ఆరులక్షల మందితో సెల్ఫీ దిగు
‘దేశంలోనే రూ.510 కోట్లతో రిచ్ సీఎం జగన్మోహన్‌రెడ్డి గారూ.. నిరుపేద వితంతువుకు భరోసా ఇచ్చే పింఛను తీసేసి ఏమి మూటకట్టుకుంటున్నారు? ప్రతి ఇంటికి మేలు చేశామని, ఆ ఇంటి వారితో సెల్ఫీ దిగుతానని గొప్పగా చెప్పావు కదా.. పింఛన్ తీసేసిన ఆరు లక్షల మందితో సెల్ఫీ దిగు’ అని లోకేశ్ విమర్శించారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తున్నామని శభా్‌షపురం గ్రామస్థులు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌కు దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధ లేదని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లు ఇస్తామని, హౌసింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చారు.
దేశ రక్షకుడు ఆస్పత్రిలో.. నేరస్థుడు బయట
ధర్మవరంలో ఏ రాజ్యాంగం నడుస్తోంది?
అనంతపురం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆర్మీ జవాన్ సమరసింహారెడ్డిని పొలాల్లోకి లాక్కెళ్లి ఎముకలు విరిగేలా కొట్టిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ఓ ప్రకటనలో లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ‘దేశ రక్షకుడు ఆస్పత్రిలో.. నేరస్థుడు బయట. అంబేడ్కర్ బతికుంటే ఇలాంటి దుర్మార్గుల కోసం మరో రాజ్యాంగం రాసేవారేమో. పోలీసులు సాధారణ కేసులుపెట్టడం దారుణం. ధర్మవరంలో ఏ రాజ్యాంగం నడుస్తోందో ఈ ఘటన అద్దం పడుతోంది’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-04-16T03:15:48+05:30 IST