కోర్టుకు రావడానికి నామోషీ ఎందుకు?
ABN, First Publish Date - 2023-01-06T03:29:48+05:30
కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడం అధికారులకు అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది.
కోర్టు ముందు హాజరైతే న్యాయమూర్తి ఉరి తీయరుగా?
హాజరుకు ఆదేశించగానే అప్పీల్ వేయడం అలవాటైంది
పత్రికల్లో వార్తలు వస్తాయని భయపడుతున్నట్టుంది
సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం: ధర్మాసనం
విద్యుత్ శాఖ అధికారుల అప్పీల్ కొట్టివేత
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన వెంటనే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయడం అధికారులకు అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు నామోషీగా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించింది. కోర్టు ముందు హాజరైతే న్యాయమూర్తి ఉరి తీయరు కదా అని వ్యాఖ్యానించింది. అలా ఉరి తీసే అధికారం తమకు లేదని పేర్కొంది. కోర్టు ముందు హాజరైతే పత్రికల్లో వార్తలు వస్తాయనే కారణంతో, వాటి నుంచి తప్పించుకొనేందుకు అధికారులు అప్పీళ్లు వేస్తున్నట్లు కనబడుతోందని అభిప్రాయపడింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడం, కోర్టు ఉత్తర్వుల కాపీ తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగులు న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు తమముందు హాజరుకావాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు ధర్మాసనం నిరాకరించింది. కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ విద్యుత్‌శాఖ అధికారులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.
విద్యుత్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో సీపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వీఎల్ గణపతి గ్రానైట్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్... కంపెనీపై పలువురు ఉద్యోగులు, కార్మికులు ఆధారపడి ఉన్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గతేడాది డిసెంబరు 16న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాజ్యం జనవరి 3న మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... సీపీడీసీఎల్ అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదన్నారు. కోర్టు ఉత్తర్వుల కాపీని తీసుకోకపోవడమే కాకుండా న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలను పిటిషనర్ రికార్డు చేశారని, వివరాలను సీడీ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. ఆ సీడీలోని వివరాలను న్యాయమూర్తి ఓపెన్ కోర్టులో వినిపించారు. అధికారులు, పిటిషనర్ మధ్య జరిగిన సంభాషణ విన్న తరువాత కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 6న న్యాయస్థానం ముందు హాజరు కావాలని విద్యుత్‌శాఖ ముఖ్యకార్యదర్శి, సీపీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ, చీమకుర్తి ఎస్‌ఈ, ఈఈలను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు వేసిన అప్పీల్ గురువారం విచారణకు వచ్చింది. అధికారుల తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలుకు తమకు గడువు ఉందని తెలిపారు. ముఖ్యకార్యదర్శికి సంబంధం లేకున్నా వ్యక్తిగత హాజరుకు ఆదేశించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
Updated Date - 2023-01-06T03:29:50+05:30 IST