వారబందీతో.. వెతలు
ABN, First Publish Date - 2023-01-18T00:00:13+05:30
సాగునీరు పుష్కలంగా ఉంది. అయినా పంటలకు సక్రమంగా నీరందకు ఎండుముఖం పడుతున్నాయి. మొత్తం మీద వారబందీ రైతులకు వెతలు తెస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటి సరఫరాకు వారబందీ విధించారు. కాల్వకు ఎగువ భాగంలో కొంతమంది రైతుల పరిస్థితి బాగానే ఉన్నా దిగువనున్న భూముల్లో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు.
పిడుగురాళ్ల, దాచేపల్లి, జనవరి 17: సాగునీరు పుష్కలంగా ఉంది. అయినా పంటలకు సక్రమంగా నీరందకు ఎండుముఖం పడుతున్నాయి. మొత్తం మీద వారబందీ రైతులకు వెతలు తెస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటి సరఫరాకు వారబందీ విధించారు. కాల్వకు ఎగువ భాగంలో కొంతమంది రైతుల పరిస్థితి బాగానే ఉన్నా దిగువనున్న భూముల్లో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. సాగునీటి కోసం రైతులు పగలు, రాత్రి కాల్వకట్టలపైనే నిద్రిస్తున్నారు. వారబందీతో వస్తున్న నీటిసరఫరాతో రైతులు అయోమయంలో పడుతున్నారు. పల్నాడు ప్రాంతంలోని ఆకురాజుపల్లె, తంగెడ మేజర్ కాల్వలకు వారబందీ విధానాన్ని నీటిపారుదల శాఖ గత వారం నుంచి అమలు చేస్తోంది. ఐదు రోజులు నీటిసరఫరా వదిలి మరో ఐదు రోజులు నిలిపివేస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకురాజుపల్లె మేజర్ కాలువలో 23, 24 మైనర్ల వరకు నీటిసరఫరా బాగానే ఉంది. అక్కడి నుంచి దిగువ ప్రాంతంలో మాచవరం, తురకపాలెం, మోర్జంపాడు గ్రామాల్లో సాగులో ఉన్న పత్తి, మిర్చి, వరితో పాటు బెండ, మొక్కజొన్న పంటలకు నీటితడులు అవసరం. ఆకురాజుపల్లె, తంగెడ మేజర్లకు కొంత దూరం వరకు నీటికి ఇబ్బంది లేదు. దిగువ భాగంలో సాగులో ఉన్న పలు పంటలకు వారానికి ఒక నీటితడి అవసరం ఉంది. అయితే వారబందీతో పంటలు బెట్టకు వచ్చే పరిస్థితి ఉంది. ఆకురాజుపల్లె మేజర్‌కు ఆంజనేయస్వామి గుడి పైభాగంలో కాలువలో నాచు, గడ్డి ఇతరాత్ర లేకుండా బాగానే ఉంది. గుంటూరు-మాచర్ల రహదారికి ఆంజనేయస్వామి గుడి దిగువ భాగం నుంచి ఆకురాజుపల్లె మేజర్‌లో గడ్డి, నాచు, జమ్ము పేరుకుపోయి ఉంది. చూసేవారికి ఇది మేజర్ కాలువేనా అన్న అనుమానం కలిగేలా దుస్థితి ఉంది. గుంటూరు బ్రాంచి కెనాల్‌కు నీటి సరఫరా పుష్కలంగా ఉన్నా వారబందీ విధానం ఏమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మేజర్ కాలువలకు వారబందీతో వచ్చే నీటిని మేజర్, మైనర్ కాలువల పరిధిలోని రైతులు ఎక్కడికక్కడ పట్టాలు అడ్డుపెట్టి మళ్లించుకుంటున్నారు. దీంతో రైతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ముందుగా నా పొలం తడుపుకోవాలంటే.. నా పొలం బెట్టకు వచ్చింది.. ముందు నా పొలమే తడవాలంటూ రైతులు మధ్య వాగ్వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్న ఘటనలున్నాయి.
వడబడిపోతోన్న మిర్చి
దాచేపల్లి మండలంలోని తంగెడ మేజర్ పరిధిలోని మాదినపాడు, సారంగిపల్లి అగ్రహారం గ్రామాల పరిధిలో సాగునీరు అందక మిర్చి పంట వడబడిపోతుంది. వారాబందీతో తంగెడ మేజర్‌కు నాలుగు రోజులు, చెన్నాయిపాలెం మేజర్‌కు మూడు రోజులు సాగు నీరు అందిస్తున్నారు. చెన్నాయిపాలెం మేజర్ పరిధిలోని రైతులు తమ వైపునకు వచ్చే కాలువకు ఉన్న డాబులను పగలకొట్టారు. దీంతో తంగెడ మేజరుకు వచ్చే సాగునీరులో అధికం చెన్నాయపాలెం మేజర్‌కు వెళ్లిపోతుందని మాదినపాడు, అగ్రహారం రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మిర్చిపంట పూత, కాయ దశలో ఉండడంతో సాగునీరు తప్పనిసరిగా అవసరం ఉంది. పంటలు కళ్ల ముందే ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ దశలో సాగునీరు అందక పంట కళ్ల ముందు ఎండుముఖం పడుతుండటంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మూడేళ్లుగా వరుసగా నష్టాలు ఎదురయ్యాయని ఈ ఏడాది అయినా గట్టెక్కతామని భావిస్తున్న తరుణంలో రైతులకు సాగునీటి వెతలు ఎదురయ్యాయి.
ఏప్రిల్ వరకు అందించాలి
11 ఎకరాల్లో పత్తి, మిర్చి, కంది సాగుచేశా. పంట చేతికందాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు అందాలి. వారబందీని ఎత్తివేసి అన్ని రకాల పంటలకు సాగునీరు అందించాలి. రాత్రిపూట మేజర్ల వద్ద పడిగాపులు పడి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుంది. - రాయుడుసాంబశివరావు, రైతు, పిడుగురాళ్ల
===============================================
Updated Date - 2023-01-18T00:00:21+05:30 IST