టిడ్కో ఇళ్లు... సమస్యల లోగిళ్లు
ABN, First Publish Date - 2023-06-26T00:42:13+05:30
ఏ మహూర్తాన ప్రారంభించారో కాని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ పేదలు సొంత ఇంటి కల నేరవేడంలేదు.
ఇళ్లకు రుణభారం
ప్రభుత్వం హడావుడి ఇళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. 360 అడుగుల ఇంటికి రూ.4 లక్షలు, 430 అడుగుల ఇంటికి రూ.4.65 లక్షలను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించింది. ఆ నగదును జమ చేసుకుని ప్రభుత్వం ఇళ్లను పంపిణీ చేసింది. అయితే బ్యాంకులు రుణాలు మంజూరు చేసిననాటి నుంచి లబ్ధిదారులు నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారుల్లో చాలామందికి ఎప్పుడో రుణం మంజూరైంది. అంటే వారు ఇళ్లు పొందకుండానే రుణాలకు వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నివాసయోగ్యంగా ఇళ్లు లేకపోవడంతో లబ్ధిదారులు అనేకమంది వాటిల్లో చేరలేదు. ఫలితంగా ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించుకుంటూ, అదనంగా బ్యాంకు రుణానికి వాయిదాల మొత్తం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండువిధాలా భారం మోయలేకపోతున్నామని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
నాలుగేళ్లు నాన్చి
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లకు తుదిమెరుగులు దిద్ది, మౌలిక సదుపాయాలు కల్పించి పంపిణీ చేయడమే తరువాయి. సరిగ్గా ఆ సమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టిడ్కో ఇళ్ల పంపిణీ 2019లో ఆగిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వం 2023 మే వరకూ ఇళ్లను పంపిణీ చేసే యోచన కూడా చేయలేదు. కట్టిన ఇళ్లు శిథిలమవుతున్నాయని ప్రతిపక్షాలు, లబ్ధిదారులు ఆందోళనలు చేసినా ఆలకించలేదు. ఎన్నికల ఏడాది ప్రారంభం కావడంతో ఒక్కసారిగా టిడ్కో ఇళ్ల పంపిణీ చేపట్టింది. టిడ్కో ఇళ్లకు విద్యుత్, తాగునీరు, రోడ్ల సదుపాయం లేదు. సదుపాయాల కల్పన పనులు చేపట్టి దాదాపు నెలరోజులు కావస్తున్నా పూర్తికాలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతోంది.
నిలిచిపోయిన నిర్మాణాలు
గత ప్రభుత్వ హయాంలో మధ్యలో నిలిచిపోయిన టిడ్కో నిర్మాణాల గురించి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో నాలుగేళ్ల నుంచి ఆయా నిర్మాణాలను గాలికి వదిలేసింది. గతంలోనే సొంత ఇల్లు వస్తుందన్న ఆశతో మున్సిపాల్టీల్లోని లబ్ధిదారులు వాటా నగదు చెల్లించారు. లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించటంతో పేదలు సంబరపడ్డారు. అయితే వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచన చేయడంలేదు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
కరెంటు లేకుండా ఎలా?
నాకు పొన్నూరులోని జీబీసీ రోడ్డు మార్జిన్‌లోని ఏ 2 బ్లాక్‌లో ప్లాట్ నెం ఎఫ్ 2 కేటాయించారు. నెల రోజుల నుంచి విద్యుత్ మీటరు కోసం తిరుగుతున్నాను. ఒకేసారి అన్ని ఫ్లాట్లకు మీటర్లు ఇస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ అధికారులు స్పందించడంలేదు. కరెంటు సౌకర్యం లేకుండా ఇల్లు వచ్చినా లాభం ఏముంది. కరెంటు లేని ఇంట్లో ఎలా ఉండగలుగుతాము. కరెంటు సౌకర్యం కల్పించాలి.
- షేక్ గుల్జార్‌బి, పొన్నూరు
నాలుగేళ్లుగా నాన్చారు.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు స్పందించారు.. హడావుడిగా టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారు. ఆయా ఇళ్లల్లో లబ్ధిదారులు ఉండేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలన్న స్పృహ లేకుండా ఆర్భాటంగా ఇళ్లను అందజేశారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కేంద్రాలు, సీఆర్‌డీఏ పరిధిలో పెద్దఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించింది. కళ్లెదుటగా టిడ్కో ఇళ్లు ఊరిస్తున్నాయి. అద్దె ఇంటి కష్టాలు తీరిపోతాయని ఆశించిన లబ్ధిదారులకు ప్రభుత్వం మారడంతో వారి ఆశలు అడియాశలుగా మారాయి. కట్టిన ఇళ్లు శిథిలమవుతున్నా.. ఇళ్లు ఇవ్వండి మహాప్రభో అని లబ్ధిదారులు వేడుకుంటున్నా.. అదిగో ఇదిగో అంటూ నాలుగేళ్లుగా పాలకులు కాలయాపన చేస్తూవచ్చారు. ఈ పరిస్థితుల్లో రెండు నెలల నుంచి టిడ్కో ఇళ్లకు వైసీపీ పార్టీని పోలిన రంగులు వేసి హడావుడిగా పంపిణీ చేశారు. అయితే అదన్నా సక్రమంగా చేశారా అంటే విద్యుత్, తాగునీరు, డ్రెయినేజి, రోడ్డు లాంటి కనీస సౌకర్యాలు లేకుండా పంపిణీ చేశారు. సౌకర్యాలు లేని ఇళ్లల్లో ఎలా ఉండాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు.
గుంటూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఏ మహూర్తాన ప్రారంభించారో కాని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పట్టణ పేదలు సొంత ఇంటి కల నేరవేడంలేదు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన వేలాది టిడ్కో గృహాలు శిథిలావస్థకు చేరుకుంటున్నా నాలుగేళ్లుగా పాలకుల్లో చలనంలేదు. ఇంటి కోసం అప్పు చేసి చెల్లించిన వాటా ధనానికి వడ్డీ ఒకవైపు.. ఉంటున్న ఇళ్లకు అద్దెలు చెల్లించలేక మరోవైపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నా ఇంతకాలం పాలకులు ఆలకించలేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తి అయిన ఇళ్లను నాలుగేళ్లుగా పక్కన పెట్టి ప్రస్తుతం ఆదరాబాదరాగా పార్టీ రంగులు వేసి హడావుడిగా పంపిణీ చేసింది. టిడ్కో గృహాల పంపిణీని కార్యక్రమాలను అధికార పార్టీ నాయకులు, అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. ఇళ్లయితే పంపిణీ చేశారుగాని లబ్ధిదారులు నివసించడానికి కావాల్సిన కనీస వసతులను కూడా కల్పించలేదు. దాదాపు రెండు నెలల క్రితం నుంచి టిడ్కో ఇళ్ల పంపకం చేపట్టినా వసతుల లేమితో ఇప్పటికీ ఎవరూ ఆ వైపు చూడలేదు. ఇళ్ల పంపిణీ పూర్తయినా, ఇళ్లలో చేరే అవకాశం వచ్చినా జిల్లాలో ఒక్క చోట కూడా లబ్దిదారులు గృహప్రవేశం చేసే సాహసం చేయలేదు. కొందరైతే ఆ ఇళ్లను కూడా చూసేందుకు ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీస వసతులు కల్పించకుండానే ఇళ్ళను ఇచ్చి అధికార యంత్రాంగం చేతులు దులుపుకుందన్న విమర్శలున్నాయి. తాగునీరు సరఫరాను విస్మరించారు. విద్యుత్ వసతి కల్పించలేదు. ఈ వసతులు లేకుండా ఇంట్లో ఎలా ఉండగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు వేగవంతంగా పూర్తి చేసి తమ ఇంటిలో నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నా వీరి మొర ఆలకించే నాధుడే కరువయ్యాడు. అధికారులైతే ఇళ్లు పంపిణీ చేశామని చెబుతున్నారుగానీ, ఒక్క మంగళగిరిలో మినహా ఎక్కడా గృహ ప్రవేశాలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు.
- గుంటూరు పరిధిలోని అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు ఇప్పటికీ ఏ వసతీ లేదు. గుంటూరు జిల్లాలో 18,848 ఇళ్లకు 15,902 హడావుడిగా పంపిణీ చేశారు. వీటిలో ఉచితంగా ఇచ్చే 300 అడుగుల ఇళ్లు 6,784 ఉన్నాయి. వీటిని పూర్తిగా పంపిణీ చేసేశారు. 360 అడుగుల ఇళ్లు 6,880, 430 అడుగుల ఇళ్లు 5,184 ఉన్నాయి. ఇవి బ్యాంకు రుణాలపై ఇచ్చే ఇళ్లు. వీటికి సంబంధించి 9,042 ఇళ్లను పంపిణీ చేయగా, బ్యాంకు రుణాల తిరస్కరణకు గురై పంపకానికి నోచుకోనివి 2,038 ఇళ్లు ఉన్నాయి. రుణాలు లభించక పేదలకు దక్కనివి 908, ఇతర కారణాలతో ఆగిపోయినవి 89 ఇళ్లు ఉన్నాయి. తెనాలిలోని చినరావూరు, పూలేకాలనీ లే అవుట్లలో కూడా వసతులు ఇప్పటికీ కరువే.
- చిలకలూరిపేట చెరువు రోడ్డులో సుమారు 4,500 మందికి తొమ్మిది వందల మంది టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నారు. కనీస వసతులు లేక లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన వారు కూడా ఇళ్లలో నివాసం ఉండాలని అధికారులు కోరుతున్నా ఆసక్తి చూపటం లేదు. చెత్త సేకరణ, తాగునీరు, డ్రెయినేజి, వీధిదీపాలు, రవాణా తదితర సౌకర్యాలు లేవు. దారి మధ్యలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది.
- అమరావతి పరిధిలోని సీఆర్డీఏ పరిధిలో 5,626 టిడ్కో గృహాలను గత టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. అయితే పట్టాలు అందుకున్న వారిలో 10 శాతం మంది కూడా ఆయా ఇళ్లల్లో నివాసం ఉండటం లేదు. మందడంలో సుమారు 490 టిడ్కో గృహాలు ఉంటే కేవలం 10 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి.
- తెనాలి వైకుంఠపురం సమీపంలో నిర్మించిన 850 గృహాల్లో 150 మంది లబ్ధిదారులు నివసిస్తున్నారు. రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. తూర్పు కాల్వ వెంబడి ఉన్న కట్టను బాగు చేసి పక్కా రోడ్డు నిర్మించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే ఆ మార్గంలో నరకమే. ఇక వీధి దీపాలు, తాగునీరు, వాడుక నీటి సమస్య ఉంది. సామాజిక స్థలాలలో పిచ్చి మొక్కలు పెరిగి పాములు బెడద ఎదుర్కొంటున్నారు.
- పొన్నూరులోని నిడుబ్రోలులో 21 ఎకరాల్లో 2368 టిడ్కో గృహాలను నిర్మించారు. నెల క్రితం 1600 మందికి ప్రభుత్వం గృహాలను అందజేసింది. వాటిల్లో 300 ఇళ్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో ఏడుగురు మాత్రమే ఇళ్లలో నివాసం ఉంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అత్యధిక మంది గృహాల్లో నివసించేందుకు ఆసక్తి చూపడంలేదు. విద్యుత్ మీటర్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా అధికారుల నుంచి స్పందన లేదు.
- మంగళగిరిలో ఆటోనగర్, ఐటీ కంపెనీల మధ్య 1728 ఇళ్లను నిర్మించగా కనీస సౌకర్యాలు లేకుండానే పంపిణీ చేశారు. దీంతో ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారు. తాగునీరు సక్రమంగా అందక వేసవిలో ప్రజలు నరకయాతన అనుభవించారు. బ్లాకుల మధ్య పైభాగంలో డోమ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్లలోకి నీళ్లు చేరుతుంది. ఎస్టీపీ ప్లాంటు నుంచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అనధికార డంపింగ్ యార్డుతో కూడా ఇబ్బంది పడుతున్నారు.
- నరసరావుపేటలో 1504 గృహాలకు సుమారు 500 మంది చేత గృహా ప్రవేశాలు చేయించారు. ఇళ్లు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా నివాసం ఉండ లేని దుస్థితిలో లబ్ధిదారులు ఉన్నారు. మునిసిపాల్టీ గుంటూరు రోడ్డులోని ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి టిడ్కో గృహాలకు పైపులైన్ నిర్మించింది. నీటి నిల్వకు ఏర్పాటు చేసిన భూగర్భ ట్యాంక్ నుంచి గృహాలపై నిర్మించిన ట్యాంకులకు నీటి సరఫరా పనులు ముందుకు సాగడంలేదు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు పనులను సాగదీస్తున్నారు.
Updated Date - 2023-06-26T00:42:13+05:30 IST