ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇన్‌చార్జ్‌ల రాజ్యం!

ABN, First Publish Date - 2023-08-22T02:35:20+05:30

ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో కళకళలాడిన దేవదాయ శాఖలో... రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ మారిపోయింది.

దేవదాయ శాఖలో వారికే పెద్దపీట

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టని వైనం

27 ఏళ్లుగా డీసీ పోస్టుల భర్తీనే లేదు

పదేళ్లుగా ఏసీలకు పదోన్నతుల్లేవ్‌

8 డీసీ పోస్టులకు ముగ్గురే రెగ్యులర్‌ అధికారులు

ఆర్జేసీ పోస్టుల్లోనూ సేమ్‌ సీన్‌..

11 పోస్టులకు నలుగురే రెగ్యులర్‌

వేధిస్తున్న సిబ్బంది కొరత.. భారీగా ఖాళీలు

ఇతర శాఖల ఉద్యోగులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్‌ ఉద్యోగులతో కళకళలాడిన దేవదాయ శాఖలో... రాష్ట్ర విభజన తర్వాత సీన్‌ మారిపోయింది. శాఖలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ మొత్తం ఇన్‌చార్జ్‌లతోనే నింపేస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టులు ఉన్నా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టడం లేదు. పదోన్నతులు కూడా కల్పించకుండా కాలయాపన చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్‌ పోస్టుల విషయంలో అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దేవదాయ శాఖలో ఎనిమిది డీసీ పోస్టులు ఉంటాయి. ఇందులో ఆరు పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన రెండు పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలి. అయితే కొన్నేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అయితే మరీ దారుణం. 27 ఏళ్లుగా డీసీ పోస్టులను భర్తీనే చేయడం లేదు. చివరి సారిగా 1996లో భర్తీ చేశారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తాజాగా డీసీలుగా నియమితులైన ఇద్దరు అధికారులు రిటైర్‌మెంట్‌ దగ్గరకు వచ్చేశారు. అయినా కొత్త వారికి చాన్స్‌ ఇవ్వలేదు.

నిలిచిపోయిన పదోన్నతులు

దేవదాయ శాఖలో ఏసీలకు డీసీలుగా పదోన్నతులు కల్పించడంలో సీనియారిటీ సమస్యలు ఉన్నాయి. 2013-14 నుంచి ఏసీలకు సీనియారిటీ నిర్ణయించడానికి దేవదాయ శాఖ తలలు పట్టుకుంటోంది. కొంతమంది ఏసీలు కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 8 మంది డిప్యూటీ కమిషనర్లు ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అందులో ఒకరు అక్రమంగా డీసీగా పదోన్నతి పొందారు. విశాఖపట్నంలో ఉన్న కనకమహాలక్ష్మీ దేవస్థానం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, మహానంది, కసాపురం ఆలయాల్లో డీసీ కేడర్‌ అధికారులతో భర్తీ చేయాలి. వాటితో పాటు దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక డీసీ విధులు నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం కాకినాడ ఆలయం, ప్రధాన కార్యాలయంలో రెగ్యులర్‌ డీసీలు విధులు నిర్వహిస్తున్నారు. మరొక డీసీ తిరుపతి ఇన్‌చార్జ్‌ ఆర్జేసీగా, శ్రీకాళహస్తి ఆలయం ఇన్‌చార్జ్‌ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల ఇన్‌చార్జిలే నడిపిస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం దేవదాయ శాఖకు ఎప్పుడో లేఖ రాసింది. అయినా ఆ శాఖ అధికారులు రెగ్యులర్‌ డీసీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం లేదు. అసలు డీసీ పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు అవకాశం ఉందా అన్న డైలమాలో ఉన్నారు. ఇన్‌చార్జ్‌లను నియమించడం వల్ల కొంతమంది భారీ ఎత్తున జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దేవదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఇన్‌చార్జ్‌లకే పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది.

ఆర్జేసీల కొరత..

దేవదాయ శాఖను వేధిస్తున్న ప్రధాన సమస్య ఆర్జేసీల కొరత. కొన్నేళ్లుగా ఈ సమస్య ఉన్నా పరిష్కారానికి ఒక్క కమిషనర్‌ కూడా ప్రయత్నం చేయలేదు. శాఖలో 11 ఆర్జేసీ పోస్టులు ఉన్నాయి. డీసీ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయడంతో పాటు ఏసీలకు డీసీలుగా పదోన్నతులు కల్పిస్తే, ఆ తర్వాత రెండేళ్లకు వారికి ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. దేవదాయ శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్జేసీ పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం దేవదాయ శాఖలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి, త్రినాథ్‌రావు, చంద్రశేఖర్‌ అజాద్‌లు మాత్రమే రెగ్యులర్‌ ఆర్జేసీలుగా ఉన్నారు. మిగిలిన ఏడు ఆర్జేసీ పోస్టుల భర్తీకి ఇతర శాఖల అధికారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకుని ఇన్‌చార్జ్‌ ఈవోలు, డీసీలు, ఆర్జేసీలుగా నియమిస్తున్నారు. దేవదాయ శాఖ కమిషనరేట్‌ నిర్లక్ష్యం కారణంగా శాఖలోని కీలకమైన పోస్టులను ఇన్‌చార్జ్‌లతో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా డీసీ పోస్టుల భర్తీ, పదోన్నతులపై దృష్టి పెట్టాలన్న సూచనలు వస్తున్నాయి.

Updated Date - 2023-08-22T02:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising