AP HIGH COURT: చంద్రబాబుపై కేసు రాజకీయ కక్షతోనే
ABN, First Publish Date - 2023-07-21T03:07:24+05:30
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో గురువారం తుది విచారణ ప్రారంభమైంది.
మాజీ మంత్రి నారాయణపై కూడా
అసైన్డ్ రైతుల ప్రయోజనాల కోసమే జీవో 41
జారీ చేసిన ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యే ఆళ్ల ఫిర్యాదు
నష్టపోయామని రైతులెవరూ ఫిర్యాదు చేయలేదు
పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కేసు చెల్లుబాటు కాదు
హైకోర్టులో సీనియర్ న్యాయవాది వాదనలు
రాజధాని భూముల కేసు విచారణ నేటికి వాయిదా
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో గురువారం తుది విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. అసైన్డ్ రైతులకు రాజధాని నిర్మాణ ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 41 వల్ల ఎవరు నష్టపోయారనే వివరాలను ఫిర్యాదులో పేర్కొనలేదని తెలిపారు. 2016లో ఈ జీవో జారీ చేస్తే, ఐదేళ్ల తరువాత ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని, ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయామని ఎస్సీ, ఎస్టీ రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదు చేసిన కేసు చెల్లుబాటు కాదన్నారు. ‘‘భూసమీకరణను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు న్యాయపరమైన చిక్కులు లేకుండా వేగంగా రాజధాని నిర్మాణం చేసేందుకు అప్పటి ప్రభుత్వం జీవో 41 జారీ చేసింది. జీవో వల్ల అసైన్డ్ పట్టాదారులు నష్టపోయినా, పరిహారం దక్కదని భావించి థర్డ్ పార్టీకి భూములను విక్రయించినా, బాధిత అసైన్డ్ రైతులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించవచ్చు.
అసైన్డ్ చట్టనిబంధనల మేరకు వాటిని వెనక్కి తీసుకొనే అధికారం కలెక్టర్‌కు ఉంది. జీవో వల్ల బాధితుడు కాని అధికార పార్టీ ఎమ్మెల్యే సీఐడీకి ఫిర్యాదు చేశారు. జీవో జారీకి అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. వాటిని రెవెన్యూ, పురపాలక శాఖల ఉన్నతాధికారులు పరిశీలించి అసైన్డ్ రైతులకు ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీ చేశారు. జీవో ఇచ్చే ముందు న్యాయశాఖ కార్యదర్శి, ఏజీ సలహా సైతం తీసుకున్నారు. నిబంధనలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయని ఉన్నతాధికారులు నోట్ ఫైల్‌లో ఎలాంటి అభ్యంతరాలూ పేర్కొనలేదు. జీవో జారీ చేసిన 32 రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి దానిని ర్యాటిఫై చేశారు. పిటిషనర్ల ఒత్తిడితోనే జీవో ఇచ్చారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. జీవో చట్టనిబంధనలకు విరుద్ధంగా ఉంటే ప్రతిపాదనలు పెట్టిన, జీవో జారీలో భాగస్వాములైన అధికారులను కేసులో నిందితులుగా చేర్చాల్సి ఉంటుంది.
అయితే సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 18 నిబంధనలు రూపొందించేందుకు అధికారులకు అధికారాలు కల్పిస్తుంది. దానిని అనుసరించే జీవో 41 తీసుకొచ్చారు. దానికి నేరపూరిత చర్యను ఆపాదించడం సరికాదు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం రాజధాని నిర్మాణంలో భాగంగా వ్యక్తి, అధికారి, ప్రభుత్వం, అథారిటీ తీసుకొనే చర్యలపై ప్రాసిక్యూట్ చేయకుండా నిషేధం ఉంది. చట్టవిరుద్ధంగా గత ప్రభుత్వం జీవో 41 తీసుకొచ్చిందని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయలేదు. పాక్షిక సవరణ చేసి 2019 డిసెంబరులో జీవో 316 తీసుకొచ్చింది. అనర్హులకు రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించారని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంతో పిటిషనర్లకు సంబంధం లేదు.
భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతుల టైటిల్ విషయంలో కాంపిటెంట్ అథారిటీ సంతృప్తి చెందితేనేవారికి ఎల్‌పీఎస్ ప్రయోజనాలు కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో ఉండే అసైన్డ్ భూములను ఇతరులకు చట్టబద్ధంగా బదిలీ చేయడం వీలుపడదు. న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు పరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 41వల్ల ఎవరు నష్టపోయారనే విషయంలో సీఐడీ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి వివరాలూ వెల్లడికాలేదు. పిటిషనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం నేరవిచారణ ప్రక్రియను అపహాస్యం చేయడమే’’ అని వాదించారు. సీనియర్ న్యాయవాది వాదనల కొనసాగింపు కోసం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ గురువారం వెల్లడించారు.
Updated Date - 2023-07-21T03:07:24+05:30 IST