టమోటా - రూ.200
ABN, First Publish Date - 2023-08-02T00:52:14+05:30
టమోటా ద్విశతకం బాదింది. ఎప్పుడూ లేనివిధంగా రిటైల్‌మార్కెట్‌లో కేజీ రూ.200కు చేరింది.
గుంటూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): టమోటా ద్విశతకం బాదింది. ఎప్పుడూ లేనివిధంగా రిటైల్‌మార్కెట్‌లో కేజీ రూ.200కు చేరింది. మదనపల్లె, బెంగళూరు నుంచి జిల్లాకు వచ్చే టమోటాల దిగుమతి తగ్గిపోవడం, అక్కడి మార్కెట్‌లలోనే ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఇక్కడ కొరత ఏర్పడింది. నాణ్యత తక్కువగా ఉన్న టమోటాలు కేజీ రూ.160కి విక్రయిస్తున్నారు. నల్ల మచ్చలున్నవి అయితే కేజీ రూ.140 చెబుతున్నారు. దీంతో చాలా ఇళ్లల్లో టమోటా వంటింటికి దూరమైంది. 10 రోజుల క్రితం వరకు మదనపల్లె మార్కెట్‌లో టమోటాలు కొనుగోలు చేసి రైతుబజార్లకు తీసుకొచ్చి ఒక్కో వినియోగదారుడికి కేజీ రూ.50 చొప్పున పంపిణీ చేసి కాస్తంత ఆర్థికంగా ఉపశమనం కలిగించిన మార్కెటింగ్ శాఖ ఇప్పుడు చేతులెత్తేసింది. అంత ధర పెట్టి తెచ్చి సబ్సిడీపై ఇవ్వడం సాధ్యం కాదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గత శనివారం నుంచే రైతుబజార్లలో టమోటాల విక్రయాలు నిలిచాయి. మళ్లీ మదనపల్లె నుంచి లోడు ఎప్పుడు తెప్పిస్తారని రైతుబజార్ల ఎస్టేట్ అధికారులను వినియోగదారులు ప్రశ్నిస్తుండగా వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు.
కాగా జిల్లా వ్యాప్తంగా బియ్యం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. రెండు వారాల క్రితం వరకు నంద్యాల సోనా బియ్యం 25 కేజీలు రూ.1450 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.1,750కి చేరింది. బీపీటీ, నకరికల్లు వంటి రకాల బియ్యం ధరలు కూడా బాగా పెరిగాయి. నకరికల్లు బియ్యం గతంలో రూ.1,100కు లభ్యమయ్యేవి. ఇప్పుడు అవి కూడా రూ.1,350కి చేరాయి. రైతుబజార్లలో సబ్సిడీపై రెండు రకాల బియ్యం అందుబాటులో ఉంచుతున్నప్పటికీ అవి మిక్సింగ్ రకాలుగా ఉన్నాయని వాటిని కొనుగోలు చేసిన ప్రజలు చెబుతున్నారు. విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిపేసిన ప్రస్తుత తరుణంలో వాటి ధరలు తగ్గాల్సిందిపోయి పెరుగుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మార్కెట్లపై కొరవడిన నియంత్రణ
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో మార్కెట్లపై అధికార యంత్రాంగానికి పూర్తిగా నియంత్రణ కొరవడింది. గతంలో పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్‌మిల్లులు, బియ్యం దుకాణాలపై దాడులు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కోశానా కనిపించడం లేదు. ఇటీవల జాయింట్ కలెక్టర్ రాజకుమారి వ్యాపారస్థులతో సమావేశం ఏర్పాటు చేసి బియ్యం ధరలు తగ్గించాలని ఆదేశించారు. రైతుబజార్లలో తగ్గించిన ధరలతో బియ్యం అందుబాటులో ఉంచాలన్నారు. అయితే అవి ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితి. దీంతో ప్రజలు బియ్యం దుకాణాలను తప్పక ఆశ్రయించాల్సి వస్తోంది.
Updated Date - 2023-08-02T00:52:14+05:30 IST