రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహం
ABN, First Publish Date - 2023-10-03T02:54:27+05:30
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ‘సత్యమేవ జయతే’ పేరుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయి.
పోలీసులు అడ్డుకున్నా ఆగని నిరసనలు
నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ నిరాహార దీక్షలు
దీక్షలకు జనసేన, వామపక్షాల సంఘీభావం
హైదరాబాద్, బెంగళూరు, విదేశాల్లోనూ దీక్షలు
(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరె్‌స్టను నిరసిస్తూ ‘సత్యమేవ జయతే’ పేరుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ చేపట్టిన ఒక్క రోజు నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయి. దీక్షలకు భారీగా స్పందన లభించింది. కొన్ని చోట్ల దీక్షలకు వస్తున్న టీడీపీ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన దీక్షా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్షలు కొనసాగాయి. చంద్రబాబు జైలులోనే నిరాహార దీక్షకు దిగారు. రాజమండ్రిలోని టీడీపీ క్యాంప్ ఆఫీస్ వద్ద చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర ఇంట్లో లోకేశ్ నిరాహార దీక్ష చేశారు. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరాహార దీక్ష చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నందమూరి కుటుంబసభ్యులు నందమూరి వసుంధర, గారపాటి లోకేశ్వరి, తారకరత్న సతీమణి అలేఖ్య, నారా రోహిత్ తల్లి ఇందిర దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నిరాహార దీక్షకు వచ్చిన నందమూరి సుహాసినిని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. కడపలో దీక్ష చేపట్టిన టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోగా, టీడీపీ నేత ఆర్.శ్రీనివాసరెడ్డి వాగ్వాదానికి దిగారు. కడపలో బలిజ సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సంతపేటలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు, తెనాలి ప్రాంతం కొల్లిపరలో మాజీ మంత్రి ఆలపాటి రాజా దంపతులు, మూల్పూరు గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పశ్చిమలో కోవెలమూడి రవీంద్ర, తూర్పులో పార్టీ ఇన్‌చార్జి నసీర్, రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిరాహార దీక్షలు చేపట్టారు. రేపల్లెలో గాంధీ వేషధారణలో చిన్నారులు సంఘీభావం తెలిపారు. పామర్రులో జలదీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా మదనాపురంలో చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ సోమేశ్వరస్వామి ఆలయంలో హోమాలు జరిపారు. అమరావతి రాజధాని గ్రామాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. బెంగళూరులో టీ డీపీ ఫోరం ఆధ్వర్యంలో సత్యమేమ జయతే అంటూ తెలుగు ప్రజలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. లండన్ పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద తెలుగు ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్నవారిని యూకేలోని భారత రాయబారి దొరైస్వామి, భారత సంతతి ఎంపీ వీరేందశర్మ కలిశారు. అమెరికాలోని డెట్రాయిట్, ఫిలిడెల్ఫీయాలో ఎన్నారై టీడీపీ ప్రతినిధులు ప్రదర్శన జరిపారు. స్కాట్‌ల్యాండ్‌లోని అబర్డీన్ నగరంలో టీడీపీ మద్దతుదారులు పెద్దసంఖ్యలో పాల్గొని చంద్రబాబు అరె్‌స్టను ఖండిస్తూ, సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపారు. కాగా, టీడీపీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఇండియా ట్రెండ్స్‌లో సోమవారం ట్విటర్‌లో నాలుగో స్థానం లభించింది. చంద్రబాబు అక్రమ అరె్‌స్టను ఖండిస్తూ నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు చేపట్టిన నిరాహార దీక్షలపై ట్విటర్‌లో ‘భువనమ్మ దీక్ష’ అనే యాష్ ట్యాగ్‌తో సంఘీభావం తెలుపుతూ వేలాది మంది నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-03T02:54:27+05:30 IST