రేషన్’పై రాజకీయ పడగ
ABN, First Publish Date - 2023-03-07T23:54:24+05:30
పేదల బియ్యం పెద్దలు బొక్కేస్తున్నారు. పేదల కడుపు నింపాల్సిన రేషన్ పెద్దల జేబులు నింపుతుంది. పేదల బియ్యం రూ.లక్షలు కుమ్మరిస్తుంది. దీంతో రేషన్ అక్రమార్కులు మాఫియాలా మారి చెలరేగిపోతున్నారు.
చెలరేగిపోతున్న బియ్యం దొంగలు
వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే రేషన్ దందా
నేతల హెచ్చరికలతో తనిఖీలకు వెళ్లేందుకు వెనుకంజ
బాపట్ల, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పేదల బియ్యం పెద్దలు బొక్కేస్తున్నారు. పేదల కడుపు నింపాల్సిన రేషన్ పెద్దల జేబులు నింపుతుంది. పేదల బియ్యం రూ.లక్షలు కుమ్మరిస్తుంది. దీంతో రేషన్ అక్రమార్కులు మాఫియాలా మారి చెలరేగిపోతున్నారు. పెట్టుబడి లేకుండా జేబులు నిండుతుంది. దీంతో రేషన్ మాఫియాకు రాజకీయ నాయకులు పూర్తిగా అండగా ఉంటున్నారు. ఎక్కడైనా అధికారులు తనిఖీలకు వెళ్లినా.. రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా రాజకీయం రంగప్రవేశం చేస్తుంది. కొందరు నేతలైతే తనిఖీలకు వెళ్లిన అధికారులను బెదిరించేందుకు కూడా వెనుకాడటంలేదు. ఇక రేషన్ మాఫియాకు కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తుంది. ఈ పరిస్థితుల్లో అంగ, అర్థ బలాలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలూ పుష్కలంగా ఉండడంతో బియ్యం దొంగలు చెలరేగిపోతున్నారు. ఫిబ్రవరి 16న భట్టిప్రోలు పరిధిలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టగా అక్కడ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడింది. దాదాపు 150 బస్తాలు పట్టుబడగా కీలక నేత ఫోన్ చేయడంతో అది కాస్తా 55 బస్తాలకే పరిమితమైంది. చెరుకుపల్లిలో ఉండే రెండు మిల్లులకు ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఓ నేత కనుసన్నల్లోనే ఈ రెండు మిల్లులు నడుస్తున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆ మిల్లుకు బియ్యం వెళ్తుందని తెలిసినా అక్కడ తనిఖీలకు వెళ్లేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలో రెండువర్గాలు రేషన్ దందాకు నేతృత్వం వహిస్తుంటే వారికి తెరవెనక సహకారం మొత్తం కీలక నేతదే. వెదుళ్లపల్లి పరిధిలోని మురికుంటపాడు రోడ్డులోని మిల్లు, ఉప్పరపాలెం రోడ్డులోని మిల్లు బాపట్లలోని రేషన్‌మాఫియాకు ప్రధాన అడ్డాగా విరాజిల్లుతున్నాయని సమాచారం. జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 125 దాకా 6ఏ కేసులు నమోదైతే వీటిలో అత్యధికం పర్చూరు నియోజకవర్గంలో పట్టుబడ్డవే కావడం అక్కడ అక్రమార్కులకు నేతాగణం ఏ విధంగా అండగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దందా మొత్తాన్ని ఓ వ్యక్తికి గంపగుత్తగా అప్పగించి వేరేవారిని దానిలోకి ప్రవేశించవద్దని నాయకులు ఆదేశాలు ఇచ్చేస్థాయికి వచ్చారంటే మాఫియాను ఎలా సంఘటితం చేశారో తేటతెల్లమవుతోంది. దాదాపు చీరాలలో కూడా ఇదే స్థాయిలో దందా నడుస్తోంది. ఇటీవల చీరాల పరిధిలో పట్టుకున్న రేషన్ బియ్యం విషయంలో ఏకంగా పౌరసరఫరాలశాఖ అమాత్యుల నుంచే ఫోన్ రావడంతో కంగుతినడం అధికారుల వంతైంది. పైగా చూసీచూడనట్లు పోవాలని ఉచిత సలహా కూడా సదరు అమాత్యుల వారు పారేశారని తెలుస్తోంది. అద్దంకిలో యువనేత అన్నీ తానై ఈ రేషన్ దందాకు నేతృత్వం వహిస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. పర్చూరు నియోజకవర్గం లాంటి కొన్ని చోట్ల తనిఖీలకు వెళ్లాలంటే తమకు రక్షణ కల్పించాలని వేడుకునే స్థాయికి యంత్రాంగం వచ్చిందంటే వీరి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. అధికారపార్టీ నాయకులకు సిబ్బంది కొంతమంది సహకరిస్తుండడం కూడా వారికి కలిసి వస్తోంది.
చర్యలకు అడ్డమే....
రెండునెలల క్రితం మితిమీరుతున్న రేషన్ మాఫియా ఆగడాలకు గట్టి హెచ్చరికలు పంపాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం చీరాలకు చెందిన ఒక వ్యక్తి మీద పీడీయాక్టుకు రంగం సిద్ధం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ సైతం సదరు ఫైల్ మీద సంతకం చేశారని కూడా అప్పట్లో బహిర్గతమైంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీని వెనక కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పనిచేశాయని సమాచారం. కనీసం పీడీయాక్టు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసినా అది ఒక హెచ్చరికలాగా పనిచేసేది. కానీ కోట్ల రూపాయల అక్రమార్జనకు గండిపడుతుందనే భయంతో దానిని ఆదిలోనే నీరుగార్చిన ఘనత పాలకపార్టీ నాయకులకే దక్కుతుంది.
సమాచార లోపం..
రాజకీయ నాయకులకు ఆయా విభాగాల్లోని కొంతమంది సిబ్బంది సహకారం కూడా తోడవడంతో తనిఖీల సమాచారం ముందస్తుగా చేరవేయడం, పై అధికారుల మూమెంట్‌ను నిత్యం సదరు నేతాగణానికి చేర్చడం వారి రోజువారి దినచర్య అవుతోంది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియని ఆత్మరక్షణ స్థితిలోకి అధికారులు వెళ్లిపోతున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయలోపం కూడా మాఫియాకు కలిసి వస్తోంది. విజిలెన్స్, పౌరసరఫరాల విభాగానికి మధ్య సమాచారలోపం కూడా అక్రమార్కులకు వరమౌతోంది. విజిలెన్స్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుగాని , అధికారిని నియమించడం కానీ ఇంతవరకు జరగలేదు. ఇంకా గుంటూరు నుంచే సదరు శాఖ పర్యవేక్షణ చేయడం కూడా ప్రతిబంధకంగా మారింది. కొంతమంది అధికారులు సైతం బియ్యం అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. పాలకపార్టీ నాయకుల అండదండలు అక్రమార్కులకు కొనసాగితే మాఫియాను కట్టడి చేయలేని స్థాయిలో భవిష్యత్ పరిణామాలు ఉండబోతున్నాయి.
Updated Date - 2023-03-07T23:54:24+05:30 IST