Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్
ABN, First Publish Date - 2023-07-21T02:29:56+05:30
వలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
సచివాలయాల శాఖకు సర్కారు అనుమతి
జనసేనానిపై కేసు నమోదుకు ఆదేశాలు
వలంటీర్లపై నిరాధార ఆరోపణలు
చేశారంటూ ఉత్తర్వుల్లో వెల్లడి
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : వలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖకు అనుమతి ఇచ్చింది. గురువారం ఈ మేరకు జీవో నం.16ను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. పవన్ కల్యాణ్ ఈ నెల తొమ్మిదో తేదీన ఏలూరులో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లను ఉద్దేశించి ఆయన నిరాధార ఆరోపణలు చేశారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ‘‘మహిళలపై వలంటీర్ల వల!... రాష్ట్రంలో 29వేల మంది అతివలు అదృశ్యం’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో, ‘‘మహిళల అదృశ్యానికి వలంటీర్లే కారణం’’ అనే శీర్షికన ఈనాడులో 10న పవన్ వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. ఎన్‌సీఆర్‌డీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, అందుకు వలంటీర్ల వ్యవస్థే కారణమని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలిస్తామని చెప్పి ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ వ్యతిరేక శక్తులకు వలంటీర్లు చేరవేశారని, దాని ఆధారంగా మహిళల అక్రమ రవాణా సాగుతోందన్నారు. 29వేల మంది మహిళలు అదృశ్యమైతే అందులో 14వేల మంది ఆచూకీ మాత్రమే పోలీసులకు దొరికిందన్న పవన్ వ్యాఖ్యలు ఎలకా్ట్రనిక్, ప్రింట్ మీడియాలో వచ్చా’’యని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్....నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వలంటీర్ల వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతీశారని, పేద మహిళల్లో అభద్రతా భావం పెంచారని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకుగాను పవన్ కల్యాణ్‌పై సీఆర్‌పీసీ 199(4)(బి), 1973 కింద సంబంధిత కోర్టులో కేసు నమోదు చేసేందుకు గ్రామ/ వార్డు సచివాలయశాఖకు సర్కారు అనుమతి ఇచ్చింది. .
సెక్షన్ 199(4)(బి) అంటే...
ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధిత కోర్టులో కేసును నమోదు చేసేందుకు ఈ సెక్షన్ అనుమతి ఇస్తుంది. ఇది పూర్తిగా బెయిలబుల్ సెక్షన్. ఈ కేసులో వెంటనే బెయిల్ వస్తుంది. ఆరోపణలకు తగిన పూర్తి ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పిస్తే గరిష్ఠంగా రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో శిక్షలు పడే శాతం తక్కువే. సాధారణంగా జరిమానాలతోనే న్యాయమూర్తులు ఈ కేసులను ముగిస్తారు.
Updated Date - 2023-07-21T02:29:56+05:30 IST