మొక్కుబడిగా.. అంచనా
ABN, First Publish Date - 2023-05-17T23:57:34+05:30
అకాల వర్షాలకు పలు పంటలు వర్షార్పణమయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వర్షాలు తుడిచిపెట్టేశాయి. అకాల నష్టంతో ఆర్థికంగా రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేసింది. కల్లాల్లో తడిచిన పంటలకు పరిహారం అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంది. కల్లాల్లో తడిచిన ధాన్యం, మిరప, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లినా సదరు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది.
నరసరావుపేట, మే 17: అకాల వర్షాలకు పలు పంటలు వర్షార్పణమయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందే సమయంలో వర్షాలు తుడిచిపెట్టేశాయి. అకాల నష్టంతో ఆర్థికంగా రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని గాలికొదిలేసింది. కల్లాల్లో తడిచిన పంటలకు పరిహారం అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంది. కల్లాల్లో తడిచిన ధాన్యం, మిరప, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లినా సదరు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది. పంటలు కోత దశలో ఉండగా మార్చిలో వచ్చిన అకాల వర్షాలు వాటిని దెబ్బతిన్నాయి. ఈ నష్టం నుంచి తేరుకోక మునుపే ఈ నెలలో అకాల వర్షాలు రైతన్నకు కోలుకోకుండా దెబ్బతీశాయి. ఇలా దెబ్బ మీద దెబ్బతో రైతులు విలవిలాడిపోతున్నారు. రైతులకు పాలకుల నుంచి కనీస భరోసా కూడా లభించలేదు. మొక్కజొన్న తడిచి కండెల పూర్తిగా కుళ్లిపోయాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. అయితే జిల్లాల్లో ఒక్క ఎకరంలో కూడా పంట నష్టం జరగలేదని వ్యవసాయ శాఖ తేల్చేసింది. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న నూర్పిడికి ముందే తడిచి నేలవాలింది. కండెలోనే మొక్కజొన్న మొలకెత్తింది. నూర్పిడికి ముందే పంట తడవడంతో జరిగిన నష్టాన్ని గుర్తించి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవసాయ శాఖ ప్రభుత్వం చెప్పినట్టుగా నష్టం లెక్కలు వేయడం గమనార్హం. ప్రాథమిక అంచనా కంటే పంటల నష్టం ఎక్కడైనా పెరుగుతుంది. అయితే పల్నాడు జిల్లాలో మాత్రం పంటల నష్టం అంచనా కంటే తగ్గింది. దీనిని చూస్తుంటే అంచనా లెక్కలు మొక్కుబడిగా వేశారని చెప్పవచ్చు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 652.5 ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లింది. 125 ఎకరాల్లో మొక్కజొన్న, 925 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే ప్రకటించిన లెక్కలను చూస్తే కేవలం వరి పంట మాత్రమే 652.5 ఎకరాల్లో దెబ్బతిన్నదని ప్రకటించి జాబితాలను అధికారులు ఆర్బీకేల్లో ప్రకటించారు. వర్షాలు కురిసే సమయంలో 50 శాతం వరి నూర్పిడిలు కూడా జరగలేదు. వరి కంకులు తడిచి నీటిలో నాని ధాన్యం మొలకెత్తింది. సగం పంట తాలుగా మారింది. వరి నష్టాన్ని లెక్కించడంలో వ్యవసాయ శాఖ మమ అన్ని పించిందన్న విమర్శలున్నాయి. ఒక్క ఎకరంలో కూడా మొక్కజొన్న పంట దెబ్బతినలేదని వ్యవసాయ శాఖ ప్రకటించడం గమనార్హం. వ్యవసాయ శాఖ లెక్కలపై రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
వర్షాల సమయంలో కల్లాల్లోనే దిగుబడులు
మార్చి, మే నెలల్లో వర్షాలు కురిసిన సమయంలో మిరప, మొక్కజొన్న, ధాన్యం దిగుబడులు కల్లాల్లో ఉన్నాయి. వర్షాలకు ఆయా పంటలు తడిచి ముద్దయ్యాయి. మేలో కురిసిన వర్షాలకు కల్లాల్లోని ధాన్యం, మొక్కజొన్న మొలకెత్తింది. మిరప తడిచి రంగు మారింది. మిరప తెల్లగా మారడంతో పాటు తాలుకాయ అయ్యింది. జిల్లాలో 16000 క్వింటాళ్ల వరకు మిరప తడిచినట్లు కేత్రస్థాయిలో పనిచేసే అధికారులు తెలిపారు. వందలాది కింటాళ్ల మిరప రంగు మారిందన్న అంచనా. కింటాకు రూ.10 నుంచి 15 వేల వరకు రైతులు నష్టపోయారు. రంగు మారిన మిరపను కొనే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లోనే మొక్కజొన్న తడిచి మొలకలు వచ్చాయి. వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, ధాన్యం పంట మొలక్కెత్తింది. వీటి కొనుగోళ్లు నామమాత్రంగా కూడా జరగకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తడిచిన దిగుబడులను పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వీరి మొర ఆలకించే వారే కరువయ్యారు.
పట్టలు లేకనే..
వర్షాల సమయంలో కల్లాల్లో ఉన్న పంటలను కాపాడుకునేందుకు గత ప్రభుత్వం పట్టలు పంపిణీ చేసింది. ఈ ప్రభుత్వం ఆ ఆలోచనే చేయలేదు. రైతుల వద్ద పట్టలు లేకపోవడంతో వర్షాలు పడినప్పుడు పంట దిగుబడులను తడవకుండా కాపాడుకోలేకపోయారు. దీంతో కల్లాల్లోనే పంట దిగుబడులు పూర్తిగా తడిచిపోయాయి. అయితే ఇలా తడిచిన పంటకు పరిహారం చెల్లించే విషంయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. నూర్పిడిలు జరగని ధాన్యం, మొక్కజొన్న విషయంలో కూడా నష్టం అంచనా తూతూ మంత్రంగానే జరిగిందన్న విమర్శలున్నాయి. మార్చిలో జరిగిన పంట నష్ట పరిహారం ఇంతవరకు అందలేదు. పరిహారం కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Updated Date - 2023-05-17T23:57:34+05:30 IST