ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేషన్‌పై పర్యవేక్షణ నిల్‌!

ABN, First Publish Date - 2023-10-07T03:28:23+05:30

రేషన్‌ పంపిణీలో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన పైలట్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. ఇంటింటికీ రేషన్‌ సరుకులను సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి,

ఎండీయూ వాహనాలకు సీసీ కెమెరాలేవీ?

బియ్యం బస్తాలపై కానరాని క్యూఆర్‌ కోడ్‌

లొకేషన్‌ మ్యాపింగ్‌ కోసం ప్రత్యేక యాప్‌

జీపీఎస్‌ ట్రాకింగ్‌తో ఇంటింటికీ సరుకులు

సర్కారు ఉత్తర్వులు పట్టని అధికారులు

ఏడాదిగా పట్టాలెక్కని పైలట్‌ ప్రాజెక్టులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ పంపిణీలో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన పైలట్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. ఇంటింటికీ రేషన్‌ సరుకులను సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరు నుంచి జీపీఎస్‌ సిస్టమ్‌ ద్వారా నిరంతరం ట్రాకింగ్‌ చేయాలని సర్కారు భావించింది. రేషన్‌ వాహనాలు వెళ్లే లొకేషన్లను మ్యాపింగ్‌ చేసేందుకు ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి పక్కాగా మానిటరింగ్‌ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రేషన్‌ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ సెక్యూరిటీ సీల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మార్గదర్శకాలతో రేషన్‌ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు గతేడాది డిసెంబరు 1నుంచే పైలట్‌ ప్రాజెక్టులను అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చెప్పారు. దాదాపు ఏడాది గడిచిపోతున్నా ఆ ప్రాజెక్టులు ఇంతవరకు పట్టాలెక్కలేదు. దీంతో రేషన్‌ మాఫియా యథావిధిగా రెచ్చిపోతూనే ఉంది.

జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన జగన్‌ ప్రభుత్వం నాసిరకం ముతక బియ్యాన్నే ఇస్తుండటంతో ఎక్కువమంది కార్డుదారులు వాటిని తీసుకోవడం లేదు. ప్రభుత్వం కిలో రూ.36కు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఉచితంగానే ఇస్తున్నా.. వాటిని తినడానికి ఇష్టపడని వారు ఆ బియ్యాన్ని తిరిగి ఎండీయూ ఆపరేటర్లకే అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఎండీయూ ఆపరేటర్లు కార్డుదారుల నుంచి కిలో రూ.7చొప్పున కొనుగోలు చేసి.. వాటిని ప్రైవేటు వ్యాపారులకు, రైసు మిల్లర్లకు, స్మగ్లర్లకు కిలో రూ.15కు అమ్ముకుంటూ రెట్టింపు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విధంగా మిల్లులకు చేరుతున్న రేషన్‌ బియ్యాన్ని తిరిగి పాలిష్‌ చేయించి మళ్లీ బహిరంగ మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేరుతో కిలో రూ.40 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న తతంగమే. గత ప్రభుత్వ హయాంలో కూడా చౌక డిపోల డీలర్లు రేషన్‌ బియ్యాన్ని కార్డుదారుల నుంచి కిలోల లెక్కన సేకరించి చాటుమాటుగా ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రేషన్‌ సరుకులను ఇంటింటికీ అందజేస్తామంటూ కొత్తగా తీసుకువచ్చిన ఎండీయూ వాహనాల్లోనే రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లాభసాటి వ్యాపారంగా మారిపోయిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి, కొన్నిచోట్ల సివిల్‌ సప్లయిస్‌, ఎఫ్‌ఐసీఐ బఫర్‌ గోడౌన్ల నుంచి కూడా ఏకంగా టన్నులు కొద్దీ రేషన్‌ బియ్యాన్ని రకరకాల మార్గాల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. పోర్టుల ద్వారా విదేశాలకు రేషన్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఒత్తిళ్లతోనే పైలట్‌ ప్రాజెక్టుకు బ్రేకులు

ఎండీయూ ఆపరేటర్లు రేషన్‌ సరుకులు ఇంటింటికీ తీసుకువెళ్లకుండా వీధి చివరనే వాహనాలను నిలిపి అక్కడే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో కూడా రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థ సక్రమంగా లేదని తేలింది. దీంతో రేషన్‌ అక్రమాలను అరికట్టేందుకు పక్కాగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను సూచిస్తూ సీఎంవో అధికారులు ఏడాది క్రితమే సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ మండలానికి ఒక ఎండీయూ వాహనానికి సీసీ కెమెరాను ఏర్పాటు చేసి రేషన్‌ అక్రమాలను అరికట్టేందుకు పైలట్‌ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టారు. వాటికి లొకేషన్‌ మ్యాపింగ్‌ చేసి వలంటీర్లు, వీఆర్‌వోల పర్యవేక్షణలో ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జేసీలు, కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎండీయూ వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో మాత్రమే ఐదారు ఇళ్లకు మించకుండా ఒకచోట రేషన్‌ సరకులు పంపిణీ చేసేలా సడలింపునిచ్చారు. ఇకనుంచి రేషన్‌ పంపిణీ ఇంటింటికీ పక్కాగా జరిగేలా ప్రతి ఎండీయూ వాహనానికి జీపీఎస్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వాటి కదలికలను ట్రాకింగ్‌ చేయడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ చెప్పారు. ఏడాది దాటుతున్నా ఆ ప్రాజెక్టు ఇంకా అమలు కానేలేదు. అధికార పార్టీ నాయకులు, రేషన్‌ మాఫియా నుంచి వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

టెండర్ల దశ దాటని క్యూఆర్‌ కోడ్‌ ప్రతిపాదనలు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్‌ కోడ్‌తో సెక్యూరిటీ సీల్‌ను ముద్రించడం ద్వారా పక్కాగా ట్రాకింగ్‌ చేసి అక్రమాలను అడ్డుకోవాలని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు నిర్ణయించారు. తొలుత 6 జిల్లాల్లో (ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి) పైలట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. అయితే క్యూఆర్‌కోడ్‌ సెక్యూరిటీ సీల్‌ ముద్రణ కోసం ఇప్పటికి రెండుసార్లు టెండర్లు ఆహ్వానించారు. అయినా ఈ పైలట్‌ ప్రాజెక్టు ఏడాదిగా పట్టాలెక్కడం లేదు. అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-10-07T03:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising