నాలుగేళ్లుగా.. నిరాదరణ
ABN, First Publish Date - 2023-04-05T00:32:01+05:30
వేలాది మంది దళిత రైతులకు సాగు నీరు అందించే బృహత్తర పథకం... మన్నవ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నాలుగేళ్లుగా గ్రహణం పట్టింది.
పొన్నూరుటౌన్, ఏప్రిల్ 4: వేలాది మంది దళిత రైతులకు సాగు నీరు అందించే బృహత్తర పథకం... మన్నవ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నాలుగేళ్లుగా గ్రహణం పట్టింది. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో అత్యధిక మంది రైతులు సొంత భూములతోపాటు కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. మన్నవ గ్రామంలో భూగర్భ జలాలు లేకపోవడం, పంట కాలువలకు చివరిగా ఉండటంతో సాగునీటి కోసం ఏటా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుల వెతలను గమనించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సాగు నీటిరంగ నిపుణులను రప్పించి స్థానిక రైతుల వెతల గురించి వివరించారు. మన్నవ గ్రామం నుంచి వెళ్తున్న కొల్లిమర్ల డ్రెయిన్‌ను ఉపయోగించుకుని పంట భూములకు నీరు ఎత్తిపోయడం ద్వారా భూములను సస్యశ్యామలం చేయవచ్చని, ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించాల్సి వస్తుందని సాగునీటి రంగ నిపుణులు తెలిపారు. నరేంద్రకుమార్ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులను సంప్రదించి అప్పటి ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి మన్నవ గ్రామానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు నిధులు సాధించారు. రూ.6.72 కోట్లను లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. గ్రామ సమీపంలోనే కొల్లిమర్ల డ్రెయిన్ ఏడాదిపాటు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ డ్రెయిన్ నీరు వృధాగా సముద్రంలోకి కలుస్తూ ఉంటుంది. ఈ వృధా జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఎత్తిపోసి పంట భూములకు పారించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. గ్రామం వెలుపల పైపులైన్ల నిర్మాణాన్ని చాలావరకు పూర్తి చేశారు. గ్రామ సమీపంలోని స్థలంలో భారీ పంపుహౌస్ నిర్మించారు. 70శాతం వరకు పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తి చేస్తే తమ భూములు సస్యశ్యామలమవుతాయని మన్నవ గ్రామ దళితులు ఆనందించేలోపు సాధారణ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. నాలుగేళ్లుగా మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్‌శాఖ పరిధిలో ఉన్న మన్నవ లిఫ్ట్ ఇరిగేషన్ నిరాదరణకు గురవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కొద్దిపాటి పంపు హౌస్ పనులను మాత్రమే నాలుగేళ్లలో పూర్తి చేయగలిగారు. ఈ పంపు హౌస్ పూర్తయి పథకం ప్రారంభమైతే మన్నవ గ్రామానికి చెందిన 80 శాతం మంది దళిత రైతుల భూములతోపాటు ఇతర చిన్న, సన్నకారు రైతులకు చెందిన 1,740 ఎకరాల భూములు సస్యశ్యామలం అయ్యేవి. ప్రస్తుతం పథక నిర్మాణం చివరి దశలో ఆగిపోవడంతో నాలుగేళ్లుగా రైతులు పంట భూములను తడుపుకొనేందుకు ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. కిలోమీటర్ల మేర పైపులైన్లు పూర్తిచేసుకుని మోటార్లు బిగించడమే తరువాయి పథకం ప్రారంభం కావాల్సి ఉండగా రాజకీయ గ్రహణం కారణంగానే తమ గ్రామానికి, తమ పంట భూములకు ఈ దుస్థితి దాపురించిందని మన్నవ దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం తుది మెరుగులు దిద్దుకుంటే ప్రతి ఏడాది తమ పంట భూములు రెండు పంటలు సాగై తమకు సాగునీటి కష్టాలు దూరమవుతాయని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికార యంత్రాంగం స్పందించి మన్నవ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2023-04-05T00:32:01+05:30 IST