కోటప్పకొండ తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు
ABN, First Publish Date - 2023-01-25T00:45:27+05:30
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో ఫిబ్రవరి 18న జరిగే తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్
కోటప్పకొండ(నరసరావుపేట), జనవరి 24: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో ఫిబ్రవరి 18న జరిగే తిరునాళ్లకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లపై కోటప్పకొండలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామిని దర్శించుకునే విధంగా వసతులు కల్పిస్తామన్నారు. 10 లక్షల మందికి పైగా భక్తులు తిరనాళ్లకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాగునీరు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఉచిత, శీఘ్ర, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్ల విజయవంతానికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభల తరలింపు రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. భక్తులు కొండకు తరలివచ్చే విధంగా రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తిరునాళ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టామని ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ప్రభల తరలింపు, భక్తులు కొండకు వచ్చే విధంగా ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా ప్రణాళికను రూపొందించామన్నారు. పమిడిమర్రు రోడ్డు మీదగా వాహనాల వెళ్లే విధంగా వన్‌వేను అమలు చేయాలని నిర్ణయించామన్నారు. కొండకు ఉన్న ఆరు రహదారులలో ట్రాఫిక్ స్తంభించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, చోరీలు జరగకుండా బందోబస్తు నిర్వహించనున్నామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేటాయించిన పనులను అధికారులు గడువులోపు పూర్తి చేయాలన్నారు. సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేవిధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 2.50 లక్షలు లడ్డూలు, అరిశ ప్రసాదం తయారు చేస్తున్నామని ఈవో వేమూరి గోపి తెలిపారు. తిరునాళ్లకు నరసరావుపేట, చిలకలూరిపేట తదితర డిపోల నుంచి దాదాపు 470 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు సదరు అధికారులు తెలిపారు. సమావేశంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మల్రాజు రామకృష్ణ కొండలరావు, అదనపు ఎస్పీ బింఽధుమాధవ్ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-25T00:45:32+05:30 IST