ఖైదీలకు ఉపాధి కల్పనకు చర్యలు
ABN, First Publish Date - 2023-03-25T00:13:26+05:30
రాష్ట్రంలో జైళ్లలో ఉండే ఖైదీల సంక్షేమానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ హసన్ రేజా తెలిపారు.
సత్తెనపల్లి, మార్చి 24: రాష్ట్రంలో జైళ్లలో ఉండే ఖైదీల సంక్షేమానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ హసన్ రేజా తెలిపారు. పట్టణంలోని సబ్‌జైలు ఆవరణలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెచ్‌పీసీఎల్ రిటైల్ పెట్రోల్ బంకును బుధవారం ఆయన గుంటూరు డీఐజీ వరప్రసాదుతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శిక్షపడిన వారికి పెట్రోలు బంకులో ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో 16 పెట్రోల్ బంకులను ఇప్పటికే ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 12 పెట్రోల్ బంకులు నిర్మాణాల్లో ఉన్నాయని చెప్పారు. రాజమండ్రి జైలులో 12 ఎకరాల్లో కూరగాయలు పండిస్తూ ఖైదీలు సంవత్సరానికి రూ.30 లక్షలు ఆదాయం తెస్తున్నారన్నారు. జైళ్ల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే వాటిని భర్తీ చేస్తామన్నారు. త్వరలో ఉద్యోగులకు ప్రమోషన్‌లు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. ఒక కోర్టు కేసు వల్ల ఇప్పటివరకు ప్రమోషన్లు ఆగాయని ఆయన తెలిపారు. సత్తెనపల్లి సబ్‌జైలులోని బేరక్‌లను ఆయన పూర్తిగా పరిశీలించారు. సబ్ జైలులో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.9 లక్షలు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. ఆయనతో పాటు స్థానిక సబ్ జైలు అధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ ఆదినారాయణ, రూరల్ ఎస్‌ఐ బాలకృష్ణ, జిల్లాకు చెందిన పలువురు సబ్ జైలు అధికారులు ఉన్నారు.
Updated Date - 2023-03-25T00:13:26+05:30 IST