ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాదికి.. సాధ్యమేనా?

ABN, First Publish Date - 2023-03-05T23:55:15+05:30

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం నవరత్నాల పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. మార్చి 22 ఉగాది పర్వదినం రోజున సామూహిక గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్దేశించింది.

గుంటూరు : కొర్నెపాడు లేఅవుట్‌లో అసలు నిర్మాణమే ప్రారంభం కాని ఇళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నవరత్నాల్లో జగనన్న ఇళ్ల పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే రెండున్నరేళ్లుగా కాలనీల్లో ఇళ్ల పనులకు ఆపసోపాలు పడుతుంది. జగనన్న కాలనీల ద్వారా ఇళ్లు వస్తాయి, నిర్మాణాలు జరుగుతాయని ఎదురు చూసిన పేదలకు అవి అందని ద్రాక్షగా మారింది. కాలనీలు పనులు ప్రారంభించి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పనులు సాగుతున్నాయి. లబ్ధిదారులచేత ఎలాగైనా ఇళ్ల పనులు చేపట్టేలే చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్నా ఫలితం ఉండటంలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు మొగ్గుచూపటంలేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న ఉగాది నాటికి గృహ ప్రవేశాలు గగనంగా ఉంది. పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందంటూ జగనన్న కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన గృహాల్లో 50 శాతం కూడా పూర్తయిన దాఖలాలులేవు.

సమీక్షిస్తున్నా.. సాగదీతే

నవరత్నాలు - పేదలందరికి ఇళ్ల పథకంలో భాగంగా మంజూరు చేసిన ఇళ్లలో కనీసం 20 శాతం వరకు అయినా ఉగాది నాటికి పూర్తి చేసి ఆ రోజున లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. ఇలాంటి లక్ష్యాలు గతంలో అనేకసార్లు పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆచరణలో వైఫల్యం చెందుతూ వాయిదా వేసుకుంటూ వస్తోన్నది. ఇంచుమించు నెలన్నర క్రితమే ఉగాది లక్ష్యాన్ని అన్ని జిల్లాలకు ప్రభుత్వం కేటాయించింది. మరో 16 రోజుల్లో ఉగాది పర్వదినం వస్తుంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన ఇళ్లలో ఇంకా పెండింగ్‌లో అనేకం ఉన్నాయి. లేఅవుట్లలో ఇళ్ల పనులను చూస్తే గడువు నాటికి నిర్మాణాలు పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు అంటున్నారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సమీక్షిస్తున్పప్పటికీ లక్ష్యం అధిగమించే దిశగా ఇళ్ల నిర్మాణాల పురోగతి సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఉగాదికి పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని అనధికారికంగా ఈ నెల 30 వరకు ప్రభుత్వమే పొడిగించినట్లు సమాచారం.

గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం నవరత్నాల పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తోంది. మార్చి 22 ఉగాది పర్వదినం రోజున సామూహిక గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. అయితే ఆ గడువునకు మరో 16 రోజులే ఉంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తే పండగ నాటికి గృహప్రవేశాలయ్యే అవకాశం కనిపించడం లేదు. జగనన్న కాలనీల్లో ఒకవైపు మౌలిక వసతుల లేమి పట్టిపీడిస్తుంటే ఆర్థిక ఇబ్బందులతో పేదలు ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టలేకపోతున్నారు. వారాంతపు సమీక్షలు, మండల ఆఫీసర్ల సందర్శనలు నిత్యం జరుగుతున్నప్పటికీ పనుల్లో అనుకున్నంత వేగం కనబడడం లేదు. ప్రభుత్వం అందించే సాయం అరకొరగా ఉండడంతో పాటు రుణ సదుపాయం విషయంలో బ్యాంకర్ల నుంచి ఆశించిన సహకారం లబ్ధిదారులకు దక్కడంలేదు.

పట్టిపీడిస్తున్న మౌలిక వసతులలేమి..

పనులు వేగంగా జరగకపోవడానికి లేఅవుట్లలో మౌలిక వసతులలేమి ప్రధాన కారణంగా ఉంది. రహదారులు సరిగా లేకపోవడంతో నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని స్థలాల దగ్గరకు చేర్చుకోవాలంటే లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. వర్షం పడితే తటాకాలను తలపించే విధంగా కాలనీలు ఉన్నాయి. లేఅవుట్లలో అంతర్గత రోడ్లు, నీటి వసతి, డ్రెయినేజి, విద్యుత్‌ సౌకర్యం లేక లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడ నివాసం ఉంటున్న వారికి నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేక పోవడంతో సొంత ఇంటిలో లబ్ధిదారులు ఉండటం లేదు. నిధుల కొరతతో విద్యుత్‌ పనుల్లో జాప్యం జరుగుతుందని ఆశాఖ అధికారులు చెప్పకనే చెబుతున్నారు. పూర్తి అయిన ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి కనెక్షన్లతో పాటు అంతర్గత రోడ్లు, కాల్వలు ఏర్పాటు చేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేస్తోన్నా క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు.

ఆర్థిక ఇబ్బందులు...

గతంతో పోలిస్తే ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయం రెట్టింపు అవడం కూడా లబ్ధిదారులకు శాపంగా మారింది. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తుంది. నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగిపోవడంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదు. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు ఆచరణలో అమలు కావడం లేదు. సవాలక్ష కొర్రీలతో బ్యాంకర్లు లబ్ధిదారులకు చుక్కులు చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అనుకున్న స్థాయిలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదు.

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..

ఆర్థిక సమస్యలు, కాలనీల్లో మౌలిక వసతుల లేమికి తోడు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కూడా లబ్ధిదారులకు అదనపు కష్టాలు తెచ్చిపెడుతోంది. జగనన్న లేఅవుట్లకు సంబంధించి వ్యక్తిగత బిల్లుల చెల్లింపులు పెండింగ్‌ ఉన్నాయి. రూ.కోట్లలో సొమ్ము ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవాల్సి ఉందనేది సమాచారం. గృహాలు పూర్తయిన వారికి కూడా పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు కాలేదని వాపోతున్నారు. బిల్లులు వచ్చినా రాకపోయినా ఇళ్లు కట్టుకోవాల్సిందేనని లేకపోతే ఇచ్చిన స్థలాలను వెనక్కు తీసుకుంటామంటూ అధికారులు వలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. అయినా లబ్ధిదారులు మొగ్గుచూపటడంలేదు.

లక్ష్యం గగనమే..

బాపట్ల జిల్లాలో 10,714 గృహాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో ఇప్పటి వరకు 6389 మాత్రమే పూర్తయ్యాయి. అంటే 59.63 శాతం మాత్రమే పురోగతి నమోదైంది. మిగిలిన వాటిలో బేస్‌మెంట్‌ లెవెల్లో 1626 ఇళ్లు ఉండగా, రూఫ్‌ దశలో 1462, కాంక్రీట్‌ దశలో 1237 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అత్యధికంగా బాపట్ల అర్బన్‌లో 1924 ఇళ్లు కాగా తర్వాతి స్థానాల్లో రేపల్లె అర్బన్‌లో 945, మార్టూరు 821 ఉన్నాయి. ఉగాది లక్ష్యం ఇలా ఉండగా జిల్లాలో జగనన్న కాలనీల కింద మొత్తం ఆమోదించిన ఇళ్ల సంఖ్య 31,632గా ఉంది. వీటిలో ఇంకా దాదాపు 1200 వరకు నిర్మాణ పనులు ప్రారంభానికి కూడా నోచుకోనట్లు సమాచారం. ఉగాదికి లక్ష్యం చేరడం అనుమానంగా ఉన్న ప్రస్తుత స్థితిలో ఆమోదించిన మొత్తం ఇళ్లు పూర్తి కావాలంటే నిస్సందేహంగా ఇంకా ఏడాదిపైనే పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని యంత్రాంగమే వ్యక్తం చేస్తోంది.

పల్నాడులో పురోగతి అధోగతి

పల్నాడు జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పురోగతి అధోగతిగా ఉంది. నిధుల కొరత లబ్ధిదారులను వెంటాడుతోంది. సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోతుండంతో వారు అప్పుల పాలవుతున్నారు. 42 రోజులుగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇప్పటికి 11 శాతం మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉగాదికి పెద్ద ఎత్తున గృహ ప్రవేశాలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఆ పరిస్ధితులు జిల్లాలో కనిపించడంలేదు. జిల్లా వ్యాప్తంగా 198 జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో 40,845 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటికి 4459 గృహాల నిర్మాణంపూర్తయినట్టు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఫౌండేషన్‌ దిగువ స్థాయిలో 24,169 గృహాలు, ఫౌండేషన్‌ స్థాయిలో 9,373, శ్లాబ్‌ స్థాయిలో 1350, శ్లాబ్‌ పూర్తయిన స్థాయిలో 1494, పూర్తియిన గృహాలు 4459 ఉన్నాయి. జిల్లాల్లోని మున్సిపాల్టీల పరిధిలో 26448 గృహాల నిర్మాణం చేపట్టగా కేవలం 1929 ఇళ్ల నిర్మాణమే పూర్తైంది. ఉగాది కల్లా సుమారు 7500 ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఆ ప్రకారం ఎక్కడా పనులు జరగడంలేదు. పల్నాడు జిల్లాలో 198 లేఅవుట్లకు 75 లేఅవుట్లలో మాత్రమే విద్యుత్‌ పనులు ప్రారంభించారు. పల్నాడు జిల్లాలో దాదాపు 4459 గృహాల నిర్మాణం పూర్తయినా వాటిలో నివాసం ఉండలేని పరిస్థితి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గుంటూరులో.. కష్టంగా కట్టడాలు

గుంటూరు జిల్లాలో రెండున్నరేళ్ల నుంచి తంటాలు పడుతోంటే ఇప్పటివరకు నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల సంఖ్య 6,792 మాత్రమే. కాగా మరో 16 రోజుల్లో ఉగాది పర్వదినం ఉండగా గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 13,415 ఇళ్లలో ఇంకా పెండింగ్‌లో ఉన్న 6,623 నిర్మాణాలు పూర్తి చేయడం సాధ్యమయ్యే పనేనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో 51 శాతం పురోగతి సాధించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 209 వైఎస్‌ఆర్‌ జనగన్న కాలనీ లేఅవుట్లలో 67,678 ఇళ్లని ప్రభుత్వం మజూరు చేసింది. ఒక్కొక్క గృహానికి రూ.1.80 లక్షల సబ్సిడీతో రూ.1,218 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.39.78 కోట్లు మంజూరు చేశారు. కాగా మొత్తం మంజూరైన వాటిలో నేటికీ 1,879 ఇళ్ల నిర్మాణం ప్రారంభమేకాలేదు. వీటిలో 1,611 జాబితా నుంచి తొలగించారు. బేస్‌మట్టాల కంటే దిగువున 36,462, బేస్‌మట్టాల స్థాయిలో 21,014, రూఫ్‌ దశలో 1,191, శ్లాబు పూర్తి అయిన నిర్మాణాలు 899 ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం మొత్తం పూర్తి అయినవి 6,623కు చేరాయి. ఇవికాకా పీఎంఏవై గ్రామీణ్‌ కింద మరో 3,323 ఇళ్ల నిర్మాణాలను మంజూరు చేశారు. వీటిల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. కేవలం 838 మాత్రమే గ్రౌండింగ్‌ జరగ్గా 2,377 ఇళ్ల నిర్మాణాలు గ్రౌండింగ్‌ జరగని పరిస్థితి కొనసాగుతుంది. నిర్మాణం పురోగతిలో ఉన్న ఇళ్లకు బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దశలవారీగా బిల్లులు చెల్లించే విషయంలో హౌసింగ్‌ ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కేటిగిరీ-3 ఇళ్లని దక్కించుకున్న వైసీపీకి చెందిన బడా నేతలు అడ్వాన్స్‌లు డ్రా చేసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. గుంటూరు నగర శివార్లలోని కొర్నెపాడులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఏటుకూరు లేఅవుట్‌లో కేవలం ఒక వరసలో మాత్రమే ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అతి పెద్ద లేఅవుట్‌గా పరిగణిస్తోన్న పేరేచర్ల లేఅవుట్‌లో 14 వేలకు పైగా ఇళ్లను నిర్మించాల్సి ఉండగా అక్కడా ఇదే పరిస్థితి తలెత్తింది. లాం వద్ద కొంత శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

Updated Date - 2023-03-05T23:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising