Polavaram: కుడికాల్వ మట్టి స్వాహా!
ABN, First Publish Date - 2023-04-26T02:51:41+05:30
రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు, పోలవరం కాల్వల తవ్వకం సమయంలో వచ్చిన మట్టిపై కన్నేశారు.
పోలవరం కాలువపై యథేచ్ఛగా తవ్వకాలు
రూ.300 కోట్ల విలువైన గ్రావెల్,మట్టి దోపిడీ
మంత్రి అంబటి అనుచరుల దందా!
ముగ్గురిపై మహిళా ఇంజనీరు ఫిర్యాదు.. వెంటనే బదిలీ
తవ్వకాలు ఆపాలన్న హైకోర్టు.. అయినా బేఖాతర్
ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీకి హైకోర్టు పిలుపు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు, పోలవరం కాల్వల తవ్వకం సమయంలో వచ్చిన మట్టిపై కన్నేశారు. యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తున్నారు. వీరి మట్టి దోపిడీకి కాల్వ కట్టలు బలహీనమవుతున్నాయి. అయినా, అధికారులెవ్వరూ వీరిని నిలువరించే సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు హైకోర్టుఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీ విలువ రూ.300 కోట్లు పైమాటే..! పోలవరం డ్యామ్ హెడ్ రెగ్యులేర్ నుంచి సుమారు 174 కిలోమీటర్ల పొడవునా పోలవరం కుడి కాల్వ ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఈ కాల్వ ద్వారా సుమారు 100 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదిలోకి మళ్లిస్తారు. కుడి కాల్వ ద్వారా 1,30,000 హెక్టార్లకు సాగునీరు అందించాల్సి ఉంది. కుడి కాల్వ నిర్మాణానికి రూ.3600 కోట్లను ఖర్చు చేశారు.
ఈ కాల్వ తవ్వే సమయంలో సుమారు ఆరు కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్, మట్టి కాల్వ వెంబడి కట్టలపై పోశారు. ప్రస్తుత స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఎ్‌సఆర్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి విలువ రూ.86. గ్రావెల్ విలువ రూ.113. ఈ లెక్కన పోలవరం కుడి కాల్వ పొడవునా ఉన్న మట్టి, గ్రావెల్ విలువ సుమారు రూ.600 కోట్లు. దీంతోపాటు క్యూబిక్ మీటర్‌కు సీనరేజీగా గనులశాఖకు రూ.45 చెల్లించాలి. ఆ లెక్కన ప్రభుత్వానికి రూ.270 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంటే పోలవరం కుడి కాల్వపై ఉన్న మట్టి, గ్రావెల్ మొత్తం విలువ రూ.870 కోట్లు వరకు ఉంటుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలవరం కుడి కాల్వ 118 కిలోమీటరు వద్ద ప్రారంభమై 174 కిలోమీటరు వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే సుమారు 55 కిలోమీటర్ల మేర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుడికాల్వ పరిధి ఉంది. ఈ పరిధిలో సుమారు రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ అందుబాటులో ఉంది. దీని విలువ సుమారు రూ.300 కోట్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో మరో రూ.570 కోట్ల విలువైన మట్టి, గ్రావెల్ ఉంది.
అధికారం మాటున దోపిడీ
బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్, మైలవరం మండలాల పరిధిలో పోలవరం మట్టి, గ్రావెల్‌ను అడ్డగోలుగా తవ్వి తరలించేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనుచరులుగా చెప్పుకొంటున్న ఆర్.రవితేజ, సంగీత్, సునీల్ తదితరులు ఈ మట్టి దోపిడీలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. వీరి దందాకు అడ్డుచెప్పే అధికారులకు బదిలీ బహుమానంగా దక్కుతుందంటే ఈ మాఫియా ఎంత శక్తిమంతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. గత ఏడాది జూన్ 19న నున్న సబ్ డివిజన్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు(ఏఈ) ప్రదీపకుమారి.. పోలవరం కుడికాల్వపై ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి తరలించేస్తున్నారంటూ రవితేజ, సునీల్‌పై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమెను ఆ స్థానం నుంచి బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన అధికారుల జాబితా చాలా పెద్దదే. నిత్యం వెయ్యి లారీలు, టిప్పర్లు పోలవరం మట్టిని తవ్వి తరలించుకుపోతుండటం గమనార్హం. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు రూ.300 కోట్ల విలువైన పోలవరం కుడి కాల్వ మట్టి, గ్రావెల్‌ను తవ్వి తరలించుకుపోయినట్లు సమాచారం.
బలహీనపడుతున్న కట్ట..
పోలవరం కాల్వ తవ్వకం సమయంలో వచ్చిన మట్టిని అధికారులు కొంత విక్రయించారు. మరికొంత మట్టిని కాల్వకు గండ్లు పడిన సమయంలో అత్యవసరంగా వినియోగించుకునేందుకు నిల్వ చేశారు. నిల్వ చేసిన ఈ మట్టిని అడ్డగోలుగా తవ్వేసుకుని పోవడంతో కుడి కాల్వ కట్టలు బలహీనపడతాయి. మరోవైపు వందల కొద్దీ టిప్పర్లు గ్రామాల మీదుగా వెళుతుండటంతో దుమ్ముధూళితో గ్రామాలకు గ్రామాలు మట్టితో కప్పేసినట్టు అయిపోతున్నాయి. ప్రజలు శ్వాసకోశవ్యాధుల బారిన పడుతున్నారు.
కోర్టు ఆదేశాలూ బేఖాతర్
పోలవరం కుడికాల్వపై కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, దీన్ని నిలువరించాలని గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పిల్లి సురేంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తవ్వకాలను ఆపేయాలని ఈ ఏడాది మార్చి ఆరోతేదీన కోర్టు ఆదేశించింది. అయినా, తవ్వకాలు ఆగలేదు. దీంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ఆదేశించినా అక్రమంగా తవ్వకాలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీరు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కేసును జూన్ 22కు వాయిదా వేసింది.
Updated Date - 2023-04-26T02:51:41+05:30 IST