ఆర్టిఫిషియల్ ఇంటిలెజన్స్ సిస్టం ద్వారా ... కృష్ణతో మంచి చిత్రం తీసేందుకు కృషి చేస్తా
ABN, First Publish Date - 2023-08-06T00:44:20+05:30
సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామంలో ఆవిష్కరించిన కాంస్యవిగ్రహంతో ఆయన తిరిగి గ్రామంలో పుట్టినట్టుగా ఉందని ఆయన అభిమానులు గ్రామంలోకి వచ్చినప్పుడు కృష్ణగారి విగ్రహాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.
. (ఫొటో ఫైల్ నెం. 05 టిఎన్‌ఎల్ 21ఎఫ్‌ఎ.జెపిజి)
తెనాలి రూరల్, ఆగస్టు 5: సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామంలో ఆవిష్కరించిన కాంస్యవిగ్రహంతో ఆయన తిరిగి గ్రామంలో పుట్టినట్టుగా ఉందని ఆయన అభిమానులు గ్రామంలోకి వచ్చినప్పుడు కృష్ణగారి విగ్రహాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఘట్టమనేని కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కృష్ణ కాంస్యవిగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణ కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. అగ్నిపర్వతం సినిమాలోని వేషధారణలో ఉన్న కృష్ణ విగ్రహాన్ని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణకుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, కోడలు మృదుల, చిన్న అల్లుడు హీరో సుధీర్‌బాబులు కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, డైరెక్టర్ ఎస్‌వి కృష్ణారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పలువురు ప్రముఖులు కృష్ణ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ఎస్వీకృష్ణారెడ్డి మాట్లాడుతూ సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన గడ్డపై ఆయన అభిమానులు కాంస్యవిగ్రహం ఏర్పాటు చేసి ఆయన స్మృతులను చిరస్థాయిగా నిలిపేలా చేయడం గొప్ప విషయమన్నారు. బుర్రిపాలెంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూస్తుంటే ఆయన సజీవంగా మన ముందు ఉన్నట్లుగా ఉందని అన్నారు. 350కి పైగా సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో నటశేఖరుడిగా ఆయనకు ఆయనే చాటి అన్నట్లుగా నిలిచారన్నారు. కృష్ణ ఏ పాత్రనైనా సునాయాశంగా నటించగలిగేవాడని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలన్న పట్టుదల ఆయనని సూపర్‌స్టార్‌గా కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్యదైవంగా నిలిపిందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలెజన్స్ సిస్టం ద్వారా కృష్ణతో మంచి చిత్రాన్ని తీసి ఆయన అభిమానులకు అందించేలా కృషిచేస్తానన్నారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కృష్ణ సినీ, రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా చివరి వరకూ నిలిచారన్నారు. .హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ సూపర్‌స్టార్ కృష్ణ అని, ఆయన ఆశయాలను, సేవా కార్యక్రమాలను కొనసాగించడంలో కుటుంబమంతా ముందుంటామన్నారు. మహేష్‌బాబును బుర్రిపాలెంలో చూడాలని ఉందని అభిమానులు అడగగా త్వరలోనే బుర్రిపాలెం వస్తానని అందరినీ కలుస్తానని తన మాటగా చెప్పమన్నారని హీరో సుధీర్‌బాబు అభిమానులకు తెలిపారు. కృష్ణ కుమార్తె మంజుల మాట్లాడుతూ తన తండ్రి బుర్రిపాలెం బుల్లోడుగా కోట్లాదిమంది ప్రేక్షకుల ప్రేమను పొందారని నాన్న గారికి తాను పుట్టిన గ్రామం బుర్రిపాలెం అంటే అమితమైన ఇష్టమని పలుమార్లు గ్రామం గురించి చెప్పేవారని తెలిపారు. ఇక్కడే కుటుంబసభ్యులుగా మేము ఏర్పాటు చేయాలనుకున్న కృష్ణ విగ్రహాన్ని అభిమానులే ఏర్పాటు చేసి తమను ఆహ్వానించి తమతోనే ఆవిష్కరింపజేయడం చెప్పలేని ఆనందంగా ఉందని అన్నారు. తమ కుటుంబంపై చూపిస్తున్న అభిమానానికి సదా రుణపడి ఉంటామని చెప్పారు. మరో కుమార్తె పద్మావతి మాట్లాడుతూ కృష్ణ మనుమడు గల్లా అర్జున్‌ను అభిమానులందరూ ఆదరించాలని కోరారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణకు బుర్రిపాలెం గ్రామంపై, గ్రామస్తులపై ఎంతో మమకారం ఉండేదని చెప్పారు. తను పుట్టిన గ్రామాన్ని మరువకూడదని మహేష్‌బాబుతో అనేక సేవాకార్యక్రమాలు చేపట్టేవారని, మహేష్ దత్తతగ్రామంగా ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సభలో సీనియర్ సినీ జర్నలిస్ట్ యు. వినాయకరావు రచించిన మనబుర్రిపాలెం బుల్లోడు సూపర్‌స్టార్ కృష్ణ సజీవ జీవిత చరిత్రపుస్తకాన్ని దేవుడులాంటి మనిషిపేరిట కృష్ణ కుటుంబసభ్యులతో ఆవిష్కరింపజేశారు. తొలిగా జూనియర్ కృష్ణగా పేరుపొందిన కృష్ణ వీరాభిమాని విశాఖపట్నంకు చెందిన చిట్టిబాబు కృష్ణ పాటలకు డ్యాన్స్ వేసి ఆయన అభిమానులను కేరింతలు కొట్టించారు. తెనాలి సూర్యశిల్పశాల శిల్పులు తయారు చేసిన సూపర్‌స్టార్ కృష్ణ మీనియేచర్ విగ్రహాలను కృష్ణ కుటుంబసభ్యులకు బహూకరించారు. విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా వచ్చిన అభిమానులతో బుర్రిపాలెం నిండిపోయింది.
Updated Date - 2023-08-06T00:44:20+05:30 IST