లైఫ్ టాక్స్‌పై ప్రభుత్వం అప్పీల్
ABN, First Publish Date - 2023-08-02T03:58:33+05:30
వాహన ఇన్వాయిస్ ధర ఆధారంగా కాకుండా, ఎక్స్‌షోరూమ్ ధర ఆధారంగా లైఫ్ టాక్స్ విధించడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై మంగళవారం సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
హైకోర్టులో విచారణ ఈ నెల 9కి వాయిదా
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వాహన ఇన్వాయిస్ ధర ఆధారంగా కాకుండా, ఎక్స్‌షోరూమ్ ధర ఆధారంగా లైఫ్ టాక్స్ విధించడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై మంగళవారం సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన కౌంటర్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరీజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. వాహన వాస్తవ ధర ఆధారంగా కాకుండా పన్నులన్నీ జతచేసిన ఎక్స్‌షోరూమ్ ధర ఆధారంగా 14 శాతం లైఫ్ టాక్స్‌ను విధించడాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన తలశిల సౌజన్య, వల్లూరు పవన్‌చంద్ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి... ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఆధారంగా లైఫ్ టాక్స్ విధించడానికి వీల్లేదని తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ మంగళవారం విచారణకు రాగా.. అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాహన ధర అంటే దాన్ని ఖరీదు చేసేందుకు కొనుగోలుదారుడు చెల్లించే మొత్తం అన్నారు. వాహన ధర నిర్వచనాన్ని సింగిల్ జడ్జి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పరస్పర విరుద్ధ అంశాలున్నాయని, దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు.
Updated Date - 2023-08-02T03:58:33+05:30 IST