ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Global Summit Vizag: అంకెల రంకెలే!

ABN, First Publish Date - 2023-03-05T02:55:04+05:30

ఒక కంపెనీ చేతిలో ఉన్నదే లక్ష రూపాయలు! మొత్తం ఆస్తులన్నీ విలువ కట్టినా అంతే! మరి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెట్టుబడులపై పొంతన లేని లెక్కలు

ఆరు నెలల కిందట ఒకలెక్క... ఇప్పుడు మరో లెక్క

వేలకు వేల కోట్లు పెరిగిన అంచనాతో ఎంవోయూలు

గొప్పలకుపోయి అపహాస్యం పాలైన సర్కారు

ఎన్టీపీసీ పెట్టుబడులపై సర్వత్రా విస్మయం

స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం లేనే లేదు

సంస్థ నుంచి అధికారిక ప్రకటనా వెలువడలేదు

జగన్‌ సీఎం అయ్యాక కడప జిల్లాకు చెందిన

‘ఇండోసోల్‌, షిరిడి సాయి’లకు భారీగా ప్రాధాన్యం

ఎడాపెడా అనుమతులు, భూముల కేటాయింపులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఒక కంపెనీ చేతిలో ఉన్నదే లక్ష రూపాయలు! మొత్తం ఆస్తులన్నీ విలువ కట్టినా అంతే! మరి... ఆ కంపెనీ కోటి రూపాయలు పెట్టుబడి పెడతానంటే నమ్మొచ్చా? అంత డబ్బు ఎలా వస్తుంది? ఏ బ్యాంకైనా ఏం చూసి అప్పు ఇస్తుంది?

జగన్‌ సర్కారు ఇవేమీ పట్టించుకోదు! అంకెల రంకెల కోసం. గొప్ప కోసం ‘పెట్టుబడుల’పై కాకిలెక్కలు చెప్పి, రాష్ట్ర ప్రజలను మాయ చేస్తోంది. శుక్ర, శనివారాల్లో విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో కుదిరాయంటున్న రూ.13లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాల్లో ఎన్ని పక్కాగా ఉన్నాయి? ఎన్ని కంపెనీలు వాస్తవికమైన ప్రతిపాదనలు ఇచ్చాయి? వాటిలో ఎన్ని అమలులోకి వస్తాయి? దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. పెట్టుబడులపై జగన్‌ సర్కారు మరీ అడ్డగోలుగా చేసిన ప్రకటనలతో అభాసుపాలైందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఇండోసోల్‌కు అంత సీనా?

ఇండోసోల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌... 2008 ఏప్రిల్‌ 9వ తేదీన బెంగళూరులో ప్రైవేటు కంపెనీగా రిజిస్టర్‌ అయింది. ఇది అన్‌లిస్టెడ్‌ కంపెనీగా కొనసాగుతోంది. దీనిని స్థాపించింది పులివెందులకు చెందిన వాళ్లే. 2019 దాకా ఎవరికీ తెలియని ఈ కంపెనీకి జగన్‌ సీఎం కాగానే మహర్దశ పట్టింది. ఇంధన రంగంలో ఈ కంపెనీకి ప్రాధాన్యం పెరిగిపోయింది. లక్ష రూపాయల మూలధనంతో స్థాపించిన ఈ సంస్థ... ఏకంగా రూ.76033 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు విశాఖలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అన్‌లిస్టెడ్‌ కంపెనీగా ఉన్న ఇండోసోల్‌కు నిధుల సమీకరణ సాధ్యమేనా? ఇండోసోల్‌కు ఇప్పటికే ప్రభుత్వం కడప జిల్లా పైడిపాలెం తూర్పులో 1200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టును స్థాపించేందుకుగాను 450 ఎకరాలను కేటాయించింది. పైడిపాలెం నార్త్‌లో మరో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంటును నెలకొల్పేందుకు మరో 400 ఎకరాలను అప్పగించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో 3500 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంటుకు 21,860 ఎకరాలు.. మైలవరంలో 3474 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

‘షిరిడీ సాయి’కే ఎరుక...

జగన్‌ సీఎం అయ్యాక ట్రాన్స్‌ఫార్మర్లను ఒక పట్టుపడుతున్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ నేపథ్యమూ ఆసక్తికరమే. ఈ సంస్థ నుంచి ప్రభుత్వం అవసరానికి మించి ట్రాన్స్‌ఫార్మర్లను కొంటోంది. ఈ సంస్థకు పులివెందులకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. తెరవెనుక చక్రం తిప్పేది మాత్రం జగన్‌ బంధువు, కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనే ప్రచారం జరుగుతోంది. దేశంలోని ఇతర సంస్థల కంటే రెట్టింపు ధరలకు షిరిడీ సాయి నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు కొంటున్నారు. ఈ కంపెనీలో ఇప్పటికి వెయ్యి మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. సంస్థ వెబ్‌సైట్‌ ప్రకారం వార్షిక టర్నోవర్‌ రూ.1360 కోట్లు. కానీ.. విశాఖ పెట్టుబడుల సదస్సులో ఒక్కసారిగా రూ.8855 కోట్ల పెట్టుబడితో ఏకంగా 5750 మందికి ఉద్యోగాలు కల్పించేస్తామంటూ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీకి ఇప్పటికే సోమశిల రిజర్వాయరు వద్ద 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంటు కోసం ప్రభుత్వం 450 ఎకరాల భూమిని కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం రిజర్వాయరుపై 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్కేంద్రం నిర్మాణం కోసం 736 ఎకరాలను ప్రభుత్వం కేటాయించేసింది. ఇప్పుడు కొత్తగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ సర్కారు కలరింగ్‌ ఇచ్చింది.

గ్రీన్‌ కోదీ అదే లెక్క...

గ్రీన్‌కో నంద్యాల జిల్లా పాణ్యంలో రూ.19,600 కోట్ల పెట్టుబడితో 1680 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేస్తుందని ఆరు నెలల కిందట జగన్‌ చెప్పారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.47700 కోట్లకు పెంచేసి, పది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అరబిందో రియాలిటీ పెట్టుబడి కూడా ఆరు నెలల్లో రూ.6215 కోట్ల నుంచి రూ.10365 కోట్లకు ఎగబాకింది.

ఇవన్నీ వచ్చేవేనా?

సిరాంటికా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1350 కోట్లు. ఇప్పుడు ఏపీలో రూ.8వేల కోట్ల పెట్టుబడి పెడతానంటోంది!

ఏబీసీ కంపెనీ పెట్టుబడి మూల ధనం రూ.150 కోట్లు. కానీ... ఏకంగా లక్షన్నర కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

2016లో స్థాపించిన హంచ్‌ వెంచర్స్‌ ఇన్వె్‌స్టమెంట్‌ .. పెయిడ్‌ క్యాపిటల్‌ రూ.50 కోట్లు. కానీ.. ఈ సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఏకంగా రూ.50వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆరు నెలల కిందట కోటిన్నర పెట్టుబడితో ఏర్పాటైన ‘ఓ2’ ఏకంగా పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న వర్షిణీ సంస్థ పెయిడప్‌ క్యాపిటల్‌ కోటీ పది లక్షల రూపాయలే. ఎలక్ర్టిసిటీ, గ్యాస్‌, వాటర్‌ ఉత్పత్తుల సంస్థగా నమోదైన ఈ కంపెనీ.. పెట్టుబడుల సదస్సులో ఏకంగా రూ.4500 కోట్ల పెట్టుబడిని పెడతామని తెలిపింది.

వైసీపీ నేత చలమలశెట్టి అనిల్‌కు చెందిన ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ 150 కోట్ల పెట్టుబడి సామర్థ్యం కలిగిన సంస్థ. రూ.15000 కోట్ల పెట్టుబడికి సంబంధించిన ఎంవోయూ కుదుర్చుకుంది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్యామ్‌ మెటల్స్‌ మొత్తం విలువ రూ.7050 కోట్లు. ఇప్పుడు ఏపీలో కొత్తగా రూ.7700 కోట్ల పెట్టుబడి పెడతానంటోంది.

‘బ్రూక్‌ఫీల్డ్‌’ ఒక అసె్‌సమేనేజ్‌మెంట్‌ కంపెనీ. అంటే జనం నుంచి డబ్బులు సేకరించి పెట్టుబడులు పెడుతుంది. లాభాలు పంచుతుంది. ఈ సంస్థ హైదరాబాద్‌కు చెందిన ‘యాక్సి్‌స’ను సొంతం చేసుకుంది. ఇప్పుడు... ‘బ్రూక్‌ఫీల్డ్‌’ ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌ చేస్తున్న పెట్టుబడి మొత్తం రూ.8.16 లక్షల కోట్లు. ఇప్పుడు... యాక్సిస్‌ బ్రూక్‌ఫీల్డ్‌ ఒక్క ఏపీలోనే కొత్తగా 1.20 లక్షల కోట్ల పెట్టుబడి పెడతానంటోంది. అంత మొత్తాన్ని కొత్తగా జనం నుంచి సమీకరించగలదా?

వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికా రూ.12,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. నిజానికి... వేదాంతనూ కష్టాలు చుట్టుముట్టాయి. కొత్తగా అప్పులు పుట్టక, ఉన్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక సంస్థ సతమతమవుతోంది. వేదాంత బాండ్స్‌ విలువ కూడా తగ్గింది. ఇప్పుడు ఈసంస్థ కొత్త పెట్టుబడులు పెట్టడం అనుమానాస్పదమే!

ఎన్టీపీసీ భారీ ప్రహసనం

పెట్టుబడుల సదస్సులో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... ఎన్టీపీసీ ఒప్పందమే! గత ఏడాది అక్టోబరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రూ.95వేల కోట్లతో విశాఖపట్నం పూడిమడకలో 500 మెగావాట్ల టీపీడీ హైడ్రోజన్‌ ప్లాంటును, 1200 మెగావాట్ల టీపీడీ ఈ-ఇథనాల్‌ ప్లాంటును, 1300 మెగావాట్ల టీపీడీ అమ్మోనియా, ఒక గిగాబైట్‌ విండ్‌ ఎనర్జీ, 460 మెగావాట్ల హైడ్రోజన్‌ ఆధారిత ప్లాంటును ఏర్పాటు చేస్తామని ఎన్టీపీసీ ప్రతిపాదించింది. ఇందులో ఉపాధి అవకాశాల గురించి ప్రస్తావించలేదు. ఎన్టీపీసీ మొత్తం పెట్టుబడులు రూ.20వేల కోట్లు. ఉన్న ఉద్యోగులు 20వేల మంది. కానీ... ఏపీలో ఏకంగా రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులోనూ... 77వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒక్క రాష్ట్రంలోనే ఈ స్థాయి పెట్టుబడులు పెట్టడం సాధ్యమా? దీనికి కేంద్రం ఆమోదం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. పైగా... అక్టోబరులో నిర్వహించిన సమావేశంలో 95వేల కోట్లు అని చెప్పిన పెట్టుబడి ఇప్పుడు రూ.2.35 లక్షల కోట్లకు పెరగడం మరో విచిత్రం.

ఎక్స్ఛేంజీలకు చెప్పారా?

షేర్‌ మార్కెట్‌లో ఉన్న కంపెనీలు తమ భవిష్యత్‌ పెట్టుబడి ప్రణాళికలపై ప్రకటన చేసే ముందే స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే... ఈ ప్రకటనలు వాటి స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటినే.. ఫార్వర్డ్‌ లుకింగ్‌ స్టేట్‌మెంట్స్‌ అంటారు. ఇలా ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చిన తర్వాత చేసే ప్రకటనల విషయంలో వాటికి జవాబుదారీతనం ఉంటుంది. విశ్వసనీయత కూడా లభిస్తుంది. కానీ... పెట్టుబడిదారుల సదస్సులో ఎంవోయూలు కుదుర్చుకున్న ఎన్టీపీసీ, శ్యామ్‌ మెటల్స్‌ వంటి లిస్టెడ్‌ కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు లేదు. ఎన్టీపీసీ ఏకంగా రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ... దీనిపై ఎన్టీపీసీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

నిబంధనలు ఇలా.. సర్కారు ఇలా..

రూ.13 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలలో 8.35 లక్షల కోట్ల ఒప్పందాలు ఇంధన రంగానికి సంబంధించినవే. ఇందులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులూ ఉన్నాయి. కేంద్ర ఇంధన సంస్థ (సీఈఏ) మార్గదర్శకాల ప్రకారం.. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్లాంట్లను ఏకపక్షంగా కేటాయించేందుకు వీల్లేదు. బిడ్‌లు ఆహ్వానించాలి. వాటి ఆధారంగా కేటాయింపులు జరగాలి. వాటిని సీఈఏ ఆమోదించాలి. ఆ తర్వాతే పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ.. ఈ మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చేసి నేరుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను కేంద్ర ఇంధన సంస్థ పరిశీలన కోసం పంపేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన జగన్‌ సర్కారు వాటికే విశాఖలో కొత్త పెట్టుబడుల కలరింగ్‌ ఇచ్చింది.

అదానీతో అయ్యే పనేనా?

అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.15376 కోట్ల పెట్టుబడితో 3700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంటును స్థాపిస్తుందని గత ఏడాది అక్టోబరులో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఇది కాస్తా ఇప్పుడు రూ.21,260 కోట్లకు చేరింది. ప్రస్తుతం అదానీ సంక్షోభంలో ఉన్నందున ఆరు వేల కోట్లు మాత్రమే పెంచారని, లేదంటే దీనిని మరో లక్ష కోట్లుగా చూపించే వారనే జోకులు వినిపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కొత్తగా నిధుల సమీకరణ కష్టంగా మారింది. విశాఖలో డేటా సెంటర్‌కే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు రూ.21,260 కోట్లు కొత్త పెట్టుబడి సాధ్యమేనా అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రె‘న్యూ’ ఎంత?

సౌర విద్యుత్తు రంగంలో తనదైన ముద్రవేసుకున్న రెన్యూ పవర్‌కు రూ.9000 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(మొత్తం ఆస్తుల విలువ ఉంది). అంతకు పది రెట్లు... రూ.97వేల కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. గత అక్టోబరులో ఇంధనరంగంపై జగన్‌ నిర్వహించిన సమీక్షలో విశాఖ లేదా కాకినాడలో 200 కేపీటీఏ గ్రీన్‌ హైడ్రోజన్‌, 1000కేపీటీఏ గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్లను స్థాపిస్తామని, .20వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ సంస్థ వెల్లడించింది. 6నెలల్లోనే అది రూ.97వేల కోట్లకు చేరడం గమనార్హం.

Updated Date - 2023-03-05T04:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising