జీవోలు చీకట్లోకి.. ఫేక్‌లు వెలుగులోకి
ABN, First Publish Date - 2023-01-29T02:43:46+05:30
ఫేక్ నోట్లు చూశాం! ఫేక్ బిల్లులు చూశాం! ఫేక్ జీవోలు ఎప్పుడైనా చూశామా? ఇప్పుడు అవి కూడా మొదలయ్యాయి.
నకిలీ జీవో వ్యవహారంపై పోలీసులకు అధికారుల ఫిర్యాదు
జీవోఐఆర్ మూసివేతతో తిప్పలు
పదవీ విరమణ పెంపుపై జీవో హల్‌చల్
అసలు జీవోనే అనుకున్న ఉద్యోగులు
నిర్ధారించుకునే మార్గంలేక గందరగోళం
చివరికి ‘ఫేక్’ అంటూ ప్రభుత్వ ప్రకటన
93 శాతం జీవోలు రహస్యమే
ఫేక్ ఏదో, అసలు ఏదో గుర్తించేదెలా?
పారదర్శకతకు పాతరేసిన సర్కారు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఫేక్ నోట్లు చూశాం! ఫేక్ బిల్లులు చూశాం! ఫేక్ జీవోలు ఎప్పుడైనా చూశామా? ఇప్పుడు అవి కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలకు పెంచారంటూ.. ‘జీవో ఎంఎస్ నంబర్ 15’ శనివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఉద్యోగుల గ్రూపుల్లో ఈ జీవో చక్కర్లు కొట్టింది. టీవీ చానళ్లు కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. కొందరు జిల్లా స్థాయి అధికారులు... ఈ జీవోను చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. నెలాఖరులో జరగాల్సిన రిటైర్‌మెంట్ ప్రక్రియలను నిలిపివేయాలని సిబ్బందికి సూచించారు. చివరికి... ‘అది ఫేక్ జీవో. రిటైర్‌మెంట్ వయసును 63 సంవత్సరాలకు పెంచుతూ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదు’ అని ప్రభుత్వం ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే... ప్రభుత్వం స్వయంగా చెబితే తప్ప ఏది అసలో, ఏది నకిలీయో తెలిసే అవకాశమే లేదు. జీవోలు అధికారికంగా అప్‌లోడ్ చేసే వెబ్‌సైట్ (జీవోఐఆర్)ను జగన్ సర్కారు మూసివేయడమే దీనికి కారణం. దీంతో... నకిలీ జీవోలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసే వేర్వేరు అసలు జీవోలు మాత్రం చీకట్లోనే ఉంటున్నాయి.
జీవోఐఆర్ ఉంటే...
జీవోఐఆర్ వెబ్‌సైట్ మూసేయడం వల్ల చెలామణిలోకి వస్తున్న జీవోలు నిజమైనవా, నకిలీవా అని నిర్ధారించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. శనివారం ప్రచారంలోకి వచ్చిన జీవో నిజమో కాదో నిర్ధారించుకునేందుకు జీవోలు ఇచ్చే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులే నానా తంటాలు పడాల్సి వచ్చింది. సచివాలయ స్థాయి ఉద్యోగులు కాబట్టి... అది ఫేక్ అని తెలుసుకోగలిగారు. మరి... సామాన్యుల పరిస్థితి ఏమిటి? నష్టపరిహారాలు, భూకేటాయింపులు, భూవివాదాలు, బిల్లుల చెల్లింపులు, పెరోల్ జీవోలు, ఖైదీల విడుదల జీవోలను వ్యక్తిగతంగా ఇస్తారు. పీడీ యాక్ట్ జీవోలను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఇస్తుంది. ఈ వ్యక్తిగత జీవోల స్థానంలో కూడా ఫేక్ జీవోలు రావనే నమ్మకమేముంది. ‘ఫలానా ఖైదీకి పెరోల్ మంజూరు...’ అని ఉత్తుత్తి జీవో జారీ చేసి, జైలు అధికారులకు సమర్పించి ఎంచక్కా విడుదల కావొచ్చు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు కలిగించే జీవోల్లో అంకెలు మార్చి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ‘వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని అమలు చేయండి’ అని ఒక కలెక్టర్ దగ్గరికో, సంబంధిత అధికారి దగ్గరికో వెళ్తే అది నిజమైనదా, నకిలీదా అని సదరు అధికారి ఎలా నిర్ధారించుకుంటారు? నకిలీ జీవో అయితే జాగ్రత్త పడాలి, నిజమైన జీవో అయితే త్వరగా అమలు చేసి ఆ వ్యక్తికి ప్రయోజనం కలిగించాలి. కానీ... ఈ రెండూ జరగడానికి ఆ అధికారి మళ్లీ సచివాలయ స్థాయిలో ఆరా తీయక తప్పదు. అదే జీవోఐఆర్ అందుబాటులో ఉంటే... అధికారులు ఆ వెబ్‌సైట్ ద్వారా అది అసలుదో, నకిలీదో నిర్ధారించుకునే అవకాశముంటుంది.
జీవోఐఆర్ ఎందుకు మూసేశారు?
ఉత్తర్వులు విడుదలైన క్షణంలోనే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, సామాన్యులకు కూడా తెలిసేలా 2008లో జీవోఐఆర్ వెబ్‌సైటు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మూడు ప్రభుత్వాలు మారాయి. కానీ, ఎవరికీ లేని ఇబ్బంది వైసీపీ సర్కార్‌కే వచ్చింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జీవోలతో చీకటి ఆటలు ఆడటం మొదలైంది. మొదట్లో అర్ధరాత్రి జీవోలు వచ్చేవి. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా బ్లాంక్ జీవోలు వచ్చేవి. అసంబద్ధ నిర్ణయాల వెనకున్న అసలు వాస్తవాలపై ఎప్పటికప్పుడు మీడియాలో చర్చ జరగడం, సోషల్ మీడియాలో ట్రోలింగులు, కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు రావడం, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడం ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో బ్లాంక్ జీవోలు మొదలుపెట్టారు. దీని వల్ల జీవో నంబరు కనిపిస్తున్నప్పటికీ జీవోలో ఏముందో తెలియదు. ఆ రహస్య విషయాలు మరో మార్గంలో మీడియాలో ప్రత్యక్షం కావడం, చర్చలు, ట్రోలింగులు, కోర్టుల్లో కేసులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో లాభం లేదనుకున్న జగన్ సర్కార్ గత ఏడాది ఆగస్టు 15వ తేదీన జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను మూసేసి పారదర్శకతను పాతేసింది.
93 శాతం జీవోలు రహస్యమే...
జీవోఐఆర్ వెబ్‌సైట్ మూసివేతపై ఏడాదిన్నరకు పైగా కోర్టులో కేసు నడుస్తోంది. జీవోఐఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ జీవోలను ఏపీ ఈ-గజెట్‌లో ప్రచురిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, మొత్తం జీవోల్లో కేవలం 7.3 శాతం జీవోలను మాత్రమే ఈ - గజెట్‌లో ప్రచురిస్తున్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే ప్రభుత్వం పేర్కొంది. అంటే... 93 శాతం జీవోలు రహస్యమే!
నకిలీ జీవో వ్యవహారంపై కేసు
తుళ్లూరు పీఎస్‌లో ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి ఫిర్యాదు
గుంటూరు, జనవరి 28: పదవీ విరమణ నకిలీ జీవో వ్యవహారంపై ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నార్త్ డీఎస్పీ పోతురాజు మాట్లాడుతూ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచారంటూ నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నారు. అది ఎంతవరకు వాస్తవమనే విషయాన్ని ధ్రువీకరించుకోకుండా కొన్ని చానళ్లు వార్తలు ప్రసారం చేశాయన్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో అలజడి రేగిందని, చానళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ జీవోను సృష్టించింది ఎవరు? సోషల్ మీడియాలో పోస్టు చేసిందెవరు? అనేది గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఐటీ కోర్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
Updated Date - 2023-01-29T02:44:02+05:30 IST