చాక్‌పీస్‌లకూ.. డబ్బుల్లేవు..
ABN, First Publish Date - 2023-03-03T00:50:15+05:30
పాఠశాలల్లో ఫ్యాన్ ఆగకూడదు.. నీటి మోటారు సమస్య అంటూ ఫిర్యాదులు రాకూడదు.. ప్రతి నెలా వచ్చే వేలకు వేల విద్యుత్ బిల్లుకు మాత్రం ప్రభుత్వం పైసా విడుదల చేయదు.. కనీసం చాక్‌పీసులు కొనాలన్నా.. కంప్యూటర్ మరమత్తులు చేయాలన్నా ప్రధానోపాధ్యాయులు నిధుల కోసం తడుముకోవాల్సిందే.
గుంటూరు(విద్య), మార్చి2: పాఠశాలల్లో ఫ్యాన్ ఆగకూడదు.. నీటి మోటారు సమస్య అంటూ ఫిర్యాదులు రాకూడదు.. ప్రతి నెలా వచ్చే వేలకు వేల విద్యుత్ బిల్లుకు మాత్రం ప్రభుత్వం పైసా విడుదల చేయదు.. కనీసం చాక్‌పీసులు కొనాలన్నా.. కంప్యూటర్ మరమత్తులు చేయాలన్నా ప్రధానోపాధ్యాయులు నిధుల కోసం తడుముకోవాల్సిందే. విద్యాసంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇంకా 20శాతం మించి నిర్వహణ నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదంటే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోచ్చు. జిల్లాలో 384 ప్రాథమిక పాఠశాలలు, 39 ప్రాథమికోన్నత పాఠశాలలు, 121 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 3.5లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభాస్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఏటా విద్యాసంవత్సరం మొదలైన తరువాత పాఠశాలల నిర్వహణ కోసం కొంతమొత్తం నిధులు విడుదల చేస్తుంది. ఈ విద్యాసంవత్సరం మొదట్లో నిధులు విడుదల చేస్తామని ప్రకటించినా తరువాత వాటి గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం మరో నెలరోజుల్లో విద్యాసంవత్సరం ముగిసే దశకు వచ్చినా ఇప్పటి 20శాతం కూడా నిర్వహణ నిధులు విడుదల చేయలేదని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానోపాధ్యాయులకు నిధుల భారం
పాఠశాలల్లో చాక్‌పీసులు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, మంచినీటికోసం స్కూల్ గ్రాంట్(నిర్వహణ నిధులు) ఉపయోగ పడతాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ మొత్తం విడుదల చేస్తారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు కేవలం 20శాతం నిధులు మాత్రమే విడుదలైనట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు బాగాలేకున్నా, మంచినీటి సమస్య తలెత్తినా, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు రిపేరు వచ్చినా, శానిటేషన్ ఇతర ఖర్చులు హెచ్‌ఎంలు భరాయించాల్సి వస్తోంది. ఒక్కోనెలలో ఈ మొత్తం వేలల్లో ఉండటంతో అనేకమంది ప్రధానోపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు.
ప్రభుత్వ చెల్లింపులు ఇలా...
ప్రభుత్వం నిర్వహణ నిధుల్ని విద్యార్థుల సంఖ్యను బట్టి చెల్లిస్తోంది. ఒక పాఠశాలలో 1 నుంచి 30 మంది విద్యార్థులుంటే రూ.10వేలు, 30 నుంచి 100లోపు ఉంటే రూ.25వేలు, 100 నుంచి 250లోపు ఉంటే రూ.50వేలు, 250 నుంచి 1000లోపు ఉంటే రూ.75వేలు, 1000పైన ఉంటే రూ.లక్ష చెల్లిస్తారు. అయితే ఈ నిధులు కొంతకాలంగా సక్రమంగా చెల్లించడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తరువాత నెలరోజులకు డబ్బులు పీడీ ఖాతాల్లో వేయాల్సి ఉండగా ఆ విషయమే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అప్పులుచేసి లేదా చందాలు వేసుకుని పాఠశాలల్లో చిన్న చిన్న పనులు చేయించాల్సి వస్తోందని హెచ్‌ఎంలు వాపోతున్నారు.
Updated Date - 2023-03-03T00:50:37+05:30 IST