Break Police Act Section 30: చీకటి జీవోకు బ్రేక్
ABN, First Publish Date - 2023-01-13T03:14:49+05:30
జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
1861 నుంచీ పోలీసు చట్టం అమల్లో ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా జీవో నంబర్ వన్ తరహా ఉత్తర్వులిస్తే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా? గత 75 ఏళ్లుగా రోడ్లపై ఎవరూ సమావేశాలు నిర్వహించలేదా?
ఈ వ్యాజ్యం విచారణకు రాకుండా అడ్డుకునేందుకు తెరచాటున ఏం జరిగిందో మాకు తెలుసు. బెంచ్ పై నుంచి ఆ విషయాలు ప్రస్తావించేలా చేయొద్దు.
ఈ కేసు విచారణకు వచ్చేందుకు వెకేషన్ అధికారి మొదట ఆమోదించారు. తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని తిరస్కరించారు. థర్డ్ పార్టీ.. హైకోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలను ప్రభావితం చేస్తోంది. ఏ కేసును ఏ ధర్మాసనం విచారించాలో నిర్ణయిస్తోంది.
- హైకోర్టు ధర్మాసనం
గత 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి జీవో తేలేదు: హైకోర్టు
23 వరకు సస్పెన్షన్
1861 నుంచీ పోలీసు యాక్టు ఉనికిలో ఉంది
బ్రిటిష్ వాళ్లు ఈ తరహా ఆదేశాలిస్తే స్వాతంత్రోద్యమం జరిగేదా?
ఇన్నేళ్లుగా రోడ్లపై ఎవరూ సమావేశాలు జరపలేదా?
ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
అపరిపక్వ దశలో వ్యాజ్యం వేశారు
వెకేషన్ బెంచ్ విచారించకూడదు: ఏజీ
విచారణకు అనుమతించాలా లేదా అన్నది న్యాయస్థానం విచక్షణాధికారం: కోర్టు
ఈ పిటిషన్ విచారణకు రాకుండా.. తెరచాటున ఏం జరిగిందో మాకు తెలుసు
థర్డ్ పార్టీ రిజిస్ట్రీని ప్రభావితం చేస్తోంది!
మా ముందు వాదనలు వినిపించడం ఇష్టం లేకపోతే చెప్పాలి
రికార్డు చేసి వేరే బెంచ్‌కు పంపుతాం
ధర్మాసనం స్పష్టీకరణ
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 1 పోలీసు యాక్టు సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గత 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి జీవోను తీసుకురాలేదని వ్యాఖ్యానించింది. 1861 నుంచి పోలీసు చట్టం అమల్లో ఉందని గుర్తు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇవే మాదిరి ఉత్తర్వులిస్తే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా అని ప్రశ్నించింది. గత 75 ఏళ్లుగా రహదారులపై ఎవరూ సమావేశాలు నిర్వహించలేదా అని నిలదీసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్, అడ్వకేట్ జనరల్ (ఏజీ) లేవనెత్తిన ఇతర అంశాల లోతుల్లోకి ఈ దశలో వెళ్లడం లేదని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ వేశాక వాటిని పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, రోడ్‌షోల నిర్వహణపై నిషేధం విధిస్తూ రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2న తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తూ వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంలోని 19(1)(ఎ)(బి) అధికరణకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ గురువారం సంక్రాంతి సెలవుల ప్రత్యేక బెంచ్‌ను అభ్యర్ధించారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
సెక్షన్ 30 నిబంధనలకు విరుద్ధం..
రహదారులు, మార్జిన్లలో బహిరంగ సమావేశాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని అశ్వనీకుమార్ తెలిపారు. పోలీసు యాక్టు సెక్షన్ 30ని అనుసరించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపాలిటీ, పంచాయతీ రోడ్లపై బహిరంగ సభల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని అధికారులను ఆదేశించిందని.. ఈ ఉత్తర్వుల ద్వారా పరోక్షంగా సభలు, రోడ్‌షోల నిర్వహణను నిషేధిస్తోందని అన్నారు. ‘సభలు, రోడ్‌షోల నిర్వహణకు అసలు ఎలాంటి అనుమతీ అవసరం లేదు. సెక్షన్ 30 అమల్లో ఉండగా.. సమావేశాల నిర్వహణకు అనుమతి కోరితే.. పోలీసులు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా షరతులతో కూడిన అనుమతులివ్వాలి. సెక్షన్ 30(2).. ఊరేగింపుల విషయంలో నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది తప్పితే.. దానిని ఉపయోగించుకుని రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవడానికి వీల్లేదు. సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జీవోలో పేర్కొనడం సెక్షన్ 30 నిబంధనలకు విరుద్ధం. అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రోడ్లపై సమావేశాలకు అనుమతించాలని జీవోలో పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయని పార్టీలే నిరూపించుకోవాలనడం 19(1)(ఎ)(బి) అధికరణ కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమే. స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలను నిలువరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సైతం సెక్షన్ 144 మాత్రమే వినియోగించింది, సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జీవో 1 అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’ అని కోరారు.
నిషేధం విధించలేదు: ఏజీ
ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. పిల్ విచారణార్హతపై ప్రాథమికంగా అభ్యంతరాలు లేవనెత్తారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఏమిటో పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన వెకేషన్ నోటిఫికేషన్ ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రత్యేక బెంచ్ విచారణ జరపడానికి వీల్లేదని తెలిపారు. ఈ వాదనలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వ్యాజ్యాన్ని విచారణకు అనుమతించాలా లేదా అనేది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. ఈ వ్యాజ్యం విచారణకు రాకుండా అడ్డుకునేందుకు తెరచాటున ఏం జరిగిందో తమకు తెలుసని.. కేసు విచారణకు వచ్చేందుకు వెకేషన్ అధికారి మొదట ఆమోదించారని.. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని విచారించడానికి వీల్లేదని తిరస్కరించారని గుర్తుచేసింది. థర్డ్ పార్టీ.. హైకోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలను ప్రభావితం చేస్తోందని.. ఏ కేసును ఏ ధర్మాసనం విచారించాలో నిర్ణయిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని హెచ్చరించింది. ప్రజాప్రయోజనం ముడిపడి ఉన్న ఈ వ్యాజ్యాన్ని విచారించవద్దన్నది మీ అభిప్రాయమా అని ఏజీని ప్రశ్నించింది.
ఉత్తర్వులు.. ప్రభుత్వ పాలసీయా?
కందుకూరులాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఏజీ ఈ సందర్భంగా తెలిపారు. ‘తనకున్న చట్టబద్ధమైన అధికారాలతో పోలీసులకు కొన్ని సూచనలు చేసింది. దానిని పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారు. పాదయాత్రలు, రోడ్‌షోలు, ర్యాలీలపై ఎలాంటి నిషేధం విధించలేదు. రహదారులపై బహిరంగ సభ నిర్వహించాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని మాత్రమే జీవోలో ఉంది’ అని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పరిపాలనాపరంగా జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ పాలసీగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు ఏజీ సమయం కోరగా ధర్మాసనం అంగీకరించింది. జీవో నంబర్ 1 పోలీసు యాక్టు సెక్షన్ 30కి విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దానిని 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
భోగి మంటల్లో వేయండి: ముప్పాళ్ల
చీకటి జీవో నంబరు 1ని ఈ నెల 14న భోగి మంటల్లో దహనం చేయాలని అప్రజాస్వామిక జీవో నంబరు1 రద్దు పోరాట ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. విజయవాడలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జీవో రద్దు కోసం చేయాల్సిన పోరాటంపై కార్యాచరణ రూపొందించామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 23 వరకూ జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ముందుగా నిర్ణయించిన విధంగా భోగి మంటల్లో జీవో ప్రతులు దహనం చేస్తామన్నారు.
Updated Date - 2023-01-13T03:59:17+05:30 IST