APSRTC: అయ్యో ఆర్టీసీ
ABN, First Publish Date - 2023-06-20T04:01:17+05:30
ప్రగతి రథచక్రాలు రాష్ట్రంలో పతనం దిశగా పయనిస్తున్నాయి. ప్రతి పల్లెకూ వెళ్లే బస్సు క్రమంగా పేదోడికి దూరం అవుతోంది..
జగన్ బాదుడుతో ఆర్టీసీ బస్సెక్కని జనం
నాలుగేళ్లలో సగానికి తగ్గిన ప్రయాణికులు
2019లో రోజుకు 63 లక్షల మంది.. ఇప్పుడు 37 లక్షలే
నాలుగేళ్ల వైసీపీ పాలనలో 3 సార్లు చార్జీల పెంపు
డీజిల్‌పై సెస్.. టికెట్ ధర పెంపు.. డబుల్ వాయింపు
డొక్కు బస్సుల స్థానంలో కొత్తది ఒక్కటీ కొనని వైనం
కేంద్రం స్ర్కాప్ పాలసీతో 980 బస్సులు షెడ్డుకు
రూట్లు, బస్సులు, సిబ్బంది ఏటేటా తగ్గింపు
ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు రాత్రింబవళ్లు, 365 రోజులూ అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సు ఇప్పుడు వృద్ధాప్యంతో రిటైర్‌మెంటుకు చేరువవుతోంది. జగన్ సర్కారు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు దూరమయ్యే రోజు దగ్గరపడుతోంది. సమయానికి గమ్యానికి చేర్చకపోయినా, సురక్షితంగా ప్రయాణికుడిని తీసుకెళతాయనే మంచిపేరు మాత్రం ఆర్టీసీకి ఉంది. కానీ, ఆర్టీసీ ప్రయాణమంటేనే, అటు చార్జీలమోత, ఇటు డొక్కు బస్సు సేవలు గుర్తొచ్చి... వెన్నులో వణుకు పుట్టే స్థాయికి తెచ్చారు.
నాడు 63 లక్షలు
నేడు 37 లక్షలు
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రగతి రథచక్రాలు రాష్ట్రంలో పతనం దిశగా పయనిస్తున్నాయి. ప్రతి పల్లెకూ వెళ్లే బస్సు క్రమంగా పేదోడికి దూరం అవుతోంది.. 2019లో టీడీపీ హయాంలో రోజుకు సగటున 63 లక్షల నుంచి 64 మందిని ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలకు చేర్చేవి. నేడు జగన్ ప్రభుత్వంలో రోజుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య 37.33 లక్షలకు పడిపోయింది. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులిచ్చి శక్తినివ్వాల్సిన ప్రభుత్వమే ఆర్టీసీ ఊపిరి తీస్తోంది. ఫలితంగా ప్రయాణికులు దూరమై.. రూట్లు తగ్గిపోయి.. సిబ్బంది నియామకాల్లేక ‘పల్లె వెలుగు’ అంధకారం వైపు వెళుతోంది.. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ ఏపీఎ్‌సఆర్టీసీ. సరిగ్గా 90సంవత్సరాల క్రితం సామాన్యుడి ప్రయాణ అవసరాలు తీర్చేందుకు రోడ్డెక్కిన ఎర్రబస్సు... కోట్లాది మంది ప్రయాణికుల ఆదరణ చూరగొంది. ఉమ్మడిరాష్ట్రంలో ప్రతి రోజూ కోటి మందికి పైగా గమ్యానికి చేర్చిన బస్సు, క్రమంగా షెడ్డుకు చేరుకుంటోంది.
నాడు రయ్యి రయ్యిన..
న తర్వాత టీడీపీ హయాంలో రాష్ట్రంలో రోజుకు 63లక్షల నుంచి 64లక్షల మందిని పదమూడు జిల్లాల్లోని 128 బస్ డిపోల ద్వారా గమ్యస్థానానికి చేర్చాయి. ఏటా కొన్ని బస్సులు పాతపడిపోవడం, వాటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు సమకూర్చడంతో సంస్థ కష్టపడుతూనే ప్రజలకు ప్రయాణ అవసరాలు తీర్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు నడుం భిగించిన చంద్రబాబు ప్రభుత్వం....ఏటా 200కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించి కొత్త బస్సుల కొనుగోలుకు ఇచ్చేది. అవసరం మేరకు ‘అమరావతి’ పేరుతో హై ఎండ్ బస్సులు మొదలుకొని పల్లె ప్రజల కోసం ‘తెలుగు వెలుగు’లు కూడా కొత్తవి వచ్చి రోడ్డెక్కేవి. దీంతో ప్రయాణికుల అభిమానాన్ని పెంచుకొంటూ మరోవైపు ప్రయాణ చార్జీల భారం వేయకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం జాగ్రత్త పడేది. డీజిల్ ధరల భారాన్ని తట్టుకోవడానికి ఆర్టీసీ స్థలాలను లీజుకివ్వడం, కార్గో సొంతంగా చేసుకోవడం లాంటి వాటితో నెట్టుకొచ్చేది. మరో వైపు రోడ్ల నిర్వహణ అంటేనే తమ బ్రాండ్ అనేలా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి కప్పుడు రోడ్లపై కనీస గుంతలు కూడా కనిపించకుండా కొత్తవి వేసేది. ఇలాంటి అనుకూల పరిస్థితుల నుంచి దాదాపు నిర్వీర్యం అయ్యే స్థితికి చేరుకోవడానికి ఆర్టీసీకి కేవలం నాలుగేళ్లు పట్టిందంటే నమ్మలేం! కానీ,నిజం
కుడిఎడమల దగా...
తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి బలోపేతం చేస్తానని మాటిచ్చిన జగన్... ముఖ్యమంత్రి అయ్యాక మాటమార్చి మడమ తిప్పేశారు. కేవలం సిబ్బందిని మాత్రమే విలీనం చేస్తామంటూ 2020 జనవరిలో పెనం మీది నుంచి పొయ్యిలోకి తోసినట్లుగా అప్పటికే వారికి ఉన్న సౌకర్యాలన్నీ తీసేసి పీటీడీలోకి మార్చారు. కార్పొరేషన్‌గానే ఉంచేసిన ఆర్టీసీకి ఏమైనా నిధులిచ్చి బలోపేతం చేశారా.... ఒక్కటంటే ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో ఎలకి్ట్రక్ బస్సులు కొన్ని వచ్చినా అవి తిరుమల, తిరుపతికే పరిమితం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చి కొత్త బస్సు కొనక పోవడంతో రోజూ 300కిలోమీటర్లు పైబడి తిరిగే బస్సులు 12లక్షల నుంచి 15లక్షల కిలోమీటర్లు తిరిగి డొక్కు అయిపోయాయి. ఎక్కడి కక్కడ చక్రాలు ఊడిపోవడం, అధ్వానపు రోడ్లపై ఆగిపోవడం, రోడ్డు పక్కన పంటకాల్వల్లోకి దూసుకుపోవడం, ఇంజిన్‌లో మంటలు రావడం....ఒకటా రెండా చెబుతూపోతే అన్నీ అగచాట్లేశ్రీ ప్రయాణికుల సంఖ్య 37.33 లక్షలమంది ప్రయాణికులకు పడిపోయింది.
సొంత బస్సులు తగ్గిపోతూ...
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీఎ్‌సఆర్టీసీలో 12వేలకు పైగా బస్సులు ఉండేవి. వాటి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో 11వేలకు పడిపోయింది. అందులోనూ అద్దె బస్సులు 2,678 ఉండగా, మొత్తం షెడ్యూల్ బస్సులు 10,250కు మించి లేవు. మూడు నెలల క్రితం 1,500 డీజిల్ బస్సులు, వెయ్యి ఎలకి్ట్రక్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సిగ్నలిచ్చిందంటూ ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. దానికి అతీగతీ లేకపోగా, మరిన్ని అద్దె బస్సుల కోసం ఈ నెల 16న నాలుగు జోన్ల నుంచి ప్రతిపాదనలు వెలువడ్డాయి. ఉత్తరాంధ్రకు 82; ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు 150; గుంటూరు నుంచి నెల్లూరు మధ్యలోని డిపోలకు 112; రాయలసీమ జిల్లాలకు 254 కలిపి మొత్తం 598బస్సులు అద్దెకు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలాఉండగా కేంద్రం స్ర్కాప్ పాలసీతో ఏకంగా 980 బస్సులు షెడ్డుకు చేర్చక తప్పలేదు.
రూట్లు.. ఆక్యుపెన్సీ.. సిబ్బంది..
వైసీపీ అధికారంలోకి రాక ముందు రాష్ట్ర వ్యాప్తంగా 3,514రూట్లలో తిరిగి ప్రజల ప్రయాణ అవసరాలను ఆర్టీసీ బస్సులు తీర్చాయి. కానీ, గత నాలుగేళ్లలో సుమారు 300రూట్లకు బైబై చెప్పేశాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో 157.63కోట్ల కిలోమీటర్లు తిరిగిన ఎర్ర బస్సులు నాలుగో ఏడాదికి వచ్చేసరికి 147.02 కోట్ల కిలోమీటర్లకు పరిమితం అయ్యాయి. ఆదాయం తెచ్చే రూట్లలో తెలంగాణ. ఏపీ మధ్య రోజుకు 2.60 లక్షల కిలోమీటర్ల నుంచి 1.60 లక్షలకు పడిపోయినా పాలకుల్లో చలనం లేదు. ఆక్యుపెన్సీ రేషియో విషయానికొస్తే, 2019 ఏప్రిల్‌లో 77.75శాతం ఉండగా, ఈ ఏడాది అది 62శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన నాటికి ఏపీఎ్‌సఆర్టీసీలో 60వేల మంది సిబ్బంది ఉండగా, ప్రస్తుతం 49,400కు తగ్గిపోయారు. పదవీవిరమణ చేసినవారి స్థానంలో నియామకాల్లేక పోగా, గత ప్రభుత్వం నియమించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని సైతం కరోనా సమయంలో తీసేసి, ఆ తర్వాత పట్టించుకోలేదు.
Updated Date - 2023-06-20T05:41:42+05:30 IST