Lands Settlements: అమ్మ సారూ!
ABN, First Publish Date - 2023-07-24T02:30:51+05:30
రాష్ట్రంలో భారీగా ఇనాం, ఎస్టేట్ భూముల సెటిల్‌మెంట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయిలో ఇనాం డిప్యూటీ తహసిల్దార్(డీటీ) ఈ కేసులను విచారించి నిర్ణయాలు తీసుకుంటారు.
సెటిల్‌మెంట్లకు దిగిన ముఖ్యనేత సలహాదారు
ఆహార్యం, మాటలు చూస్తే పారదర్శకత, విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్‌గా అనిపిస్తారు. గత ప్రభుత్వాల్లో ఆయన ఎలా పనిచేశారో తెలియదుగానీ, జగన్ ప్రభుత్వంలో మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్న భారీ దందాల బాగోతం ఆయనలో తెలియని కొత్త కోణాలను బాహ్య ప్రపంచానికి చూపించింది. ముఖ్యనేతకు ప్రధాన సలహాలు ఇవ్వడం ఆయన పని. ఈ క్రమంలో స్వకార్యాలను కూడా పనిలో పనిగా చక్కబెట్టుకుంటున్నారు. దీనికోసం రెవెన్యూశాఖపై కన్నేశారు. సీసీఎల్‌ఏ పరిధిలోని అప్పీల్స్ కమిషనర్ వద్ద ఉన్న ఇనాం, ఎస్టేట్ భూముల వివాదాలను పరిష్కరించేలా చేస్తానంటూ పెద్ద క్యాష్ కౌంటరే తెరిచారు. కథ అడ్డం తిరిగేసరికి బాధితులుగా మారినవారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
కేసు అనుకూలంగా వస్తుందని భావించి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, తేడా వస్తే మునిగిపోతామని ఆందోళన వ్యక్తంచేసిన రియల్టర్‌పై ముఖ్యనేత సలహాదారు మండిపడ్డారట! అప్పులు, పెట్టుబడులు, డబ్బులు వంటి వివరాలేవీ తన దగ్గర మాట్లాడవద్దని హెచ్చరించినట్లు తెలిసింది.
నాడు అటవీ భూములకు ఎసరు
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో 1800 ఎకరాల అటవీ భూమిని ఇనాం కోటాలో చూపించి పట్టాలు పొందాలనుకున్న ముఠాలకు ముఖ్యనేత సలహాదారు పెద్దదిక్కుగా నిలిచారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ ముఠాలు కోరుకున్నట్లుగా రికార్డులు వచ్చేలా తన పదవి, పరపతులను ఉపయోగించారు. చిత్తూరు జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు 160 ఎకరాలను ఇనాంగా చూపించి, ఓ ముఠా స్వాహాచేయాలని చూసింది. సలహాదారే ఈ ముఠాకు అన్ని విధాలా సహాయం అందించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాది కీలక ఆధారాలతో వెలుగులోకి తీసుకొచ్చింది.
ఒక్కో సిఫారసుకు వివాదభూమిలో 20ు ముడుపు
ఇనాం, ఎస్టేట్ భూములపై కన్నేసి కోట్లలో దందా
రెవెన్యూలో పనిచేయిస్తానంటూ భారీగా బేరాలు
అప్పీల్స్ కమిషనర్ లోతైన పరిశీలనతో చిక్కులు
సంకటంలో పడిన సలహాదారు.. రియల్టర్ల ఒత్తిడి
కొద్దిరోజులు ఆగండి.. కొత్త కమిషనర్ వచ్చాక
సెటిల్ చేయిద్దామంటూ బాధితులకు ‘సలహా’
కాదంటే కసిరికొడుతున్నారని బాధితుల వేదన
ముడుపులు కట్టినవారిలో ఉత్తరాంధ్రవారే ఎక్కువ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో భారీగా ఇనాం, ఎస్టేట్ భూముల సెటిల్‌మెంట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మండల స్థాయిలో ఇనాం డిప్యూటీ తహసిల్దార్(డీటీ) ఈ కేసులను విచారించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇనాం డీటీ తీర్పులతో విబేధించేవారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (జేసీ) వద్ద అప్పీల్ చేస్తారు. జేసీ ఇచ్చే తీర్పులను వ్యతిరేకించే వారు రాష్ట్రస్థాయిలో సెటిల్‌మెంట్ డైరెక్టర్ వద్ద అప్పీల్ చేస్తారు. అయితే, ప్రభుత్వ ప్రయోజనాలు, ప్రజల, విశాల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని సెటిల్‌మెంట్ డైరెక్టర్ పలు భూములపై ఆదేశాలిస్తారు. ఇక్కడా న్యాయం జరగలేదనుకునే వారు చివరగా అప్పీల్స్ కమిషనర్ వద్ద అప్పీల్ చేస్తారు. ఇక్కడ తీసుకునే నిర్ణయం ఫైనల్. ఇక్కడ న్యాయం దొరక్కపోతే హైకోర్టును ఆశ్రయించాల్సిందే. అయితే, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఉన్న అప్పీల్స్ కమిషనర్ వద్ద భారీగా ఇనాం, ఎస్టేట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అయితే, రెండున్నరేళ్ల వరకు ఈ పోస్టును సర్కారు ఖాళీగా ఉంచింది. గత ఏడాది రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనరసింహంను అప్పీల్స్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం వెనుక తన పాత్ర ఉందని ముఖ్యనేత సలహాదారు తనకు తానే ప్రచారం చేసుకున్నారు. కీలకమైన కేసుల పరిష్కారం పేరిట ఈ నియామకం చేయించానని, సెటిల్‌మెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై విబేధించేవారు అప్పీల్ చేసుకోవాలని ఆయన పలువురికి సూచించారు. బాహ్య ప్రపంచం దృష్టిలో ఈయన సౌమ్యుడు, వివాద రహితుడు. కానీ, వాస్తవానికి ఆయన వైసీపీ వీరాభిమాని. ఐఏఎ్‌సగా సర్వీసులో ఉంటూనే ఆయన ఆ పార్టీ సేవలో పరోక్షంగా తరించిపోయారు. రిటైర్ అయ్యాక ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ స్వామి కార్యంలో భాగంగా ప్రతిపక్షాన్ని పోలవరంలో ముంచేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో సొంత లాభం చూసుకోవడమూ మొదలుపెట్టారు. అందులోభాగంగా ల్యాండ్ పార్టీలను పిలిచి కేసులు వేయించారు. వారినుంచి భారీగా ముడుపులు లాగారు. పనిలోపనిగా ఆయన తన సొంత కేసులు కూడా కొన్ని వేయించారు. అప్పీల్ కమిషనర్ వద్ద ఎక్కువ గా ఉమ్మడి విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన ఇనాం, ఎస్టేట్ భూముల కేసులే ఉన్నాయి. కానీ, ఏం లాభం? అప్పీల్స్ కమిషనర్ మాట వినడం లేదు.
దెబ్బ తిన్నామే...
అప్పీల్స్ కమిషనర్ కేసులు స్వీకరించారు కానీ చెప్పినట్లు విచారణ పూర్తిచేయడం లేదు. సానుకూలంగా వ్యవహరించడం లేదు. దీంతో దిక్కుతోచక ల్యాండ్‌పార్టీలు.... సలహాల మునీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఎనిమిది తొమ్మిది నెలలవుతున్నా పనులు కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఆయన ముఖం చాటేస్తున్నారు. కొద్దిరోజులు ఆగండి... ఈ అధికారి సర్వీసు పూర్తయ్యాక మాట వినే అధికారిని తీసుకొచ్చి సెటిల్ చే యిస్తానని చెబుతున్నారట! గత కొద్దిరోజులుగా బాధితులను ఆఫీసు దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదట!
అనర్హులకూ అభయమిచ్చి..
విచారణకు అర్హత లేని కేసులు కూడా కొందరు వేశారు. నేరుగా అప్పీల్స్ చేస్తే పనికాదని సలహాల మునీశ్వరుడి ద్వారా వెళ్లారని తెలిసింది. ఆయన సిఫారసు మేరకే అప్పీల్ కమిషనర్ కార్యాలయంలో వాటిని విచారణకు స్వీకరించారని నమ్ముతున్న బాధితులు కూడా ఉన్నారు. సిఫారసుకు ఆయన వారి నుంచి భూమిని బట్టి ఫీజు వసూలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వంలో అప్పీల్స్ కమిషనర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి, అక్కడ వ్యతిరేక ఆదేశాలు రాకుండా ఉండేందుకు కొందరు ముందుగానే సలహాదారుతో సంప్రదింపులు జరుపుకొన్నారని తెలిసింది. భూమి విలువలో ముందుగానే 15-20 శాతం ఫీజుగా ఇస్తే కేసును స్వీకరించి సత్వరమే విచారణ జరిగేలా చర్యలు ఉంటాయని ఆయన భరోసా ఇవ్వడంతో అనేకమంది ముడుపులు కట్టినట్లు తెలిసింది. ఇలా ఇప్పటి వరకు 26 కేసుల్లో ఆయన సిఫారసులు చేసినట్లు తెలిసింది. నిజానికి నిబంధనల ప్రకారమే అప్పీల్స్ కమిషనర్ అనేక కేసులను విచారణకు స్వీకరించినా, తన సిఫారసుల మేరకే తీసుకున్నారని సలహాదారు ప్రచారం చేసుకున్నారని బాధితులు చె బుతున్నారు.
అప్పు.. పెట్టుబడి.. డబ్బు.. అనొద్దు
బాధితులకు సలహాదారు వార్నింగ్
కేసుల పరిష్కారం కోసం తొందరపడ్డవద్దని, కొద్దిరోజులు వేచిచూడాలని బాధితులకు సదరు సలహాదారు సూచించినట్లు తెలిసింది. ’’మీవే కాదు. నా సొంత కేసులు ఆరింటి ని కూడా పక్కనపెట్టేశారు. ఇప్పుడు ఏం చేసినా తొందరపాటే అవుతుంది. అప్పీల్స్ కమిషనర్ పదవీకాలం ఏడాదే. త్వరలో ఆయన పదవి ముగియగానే మరో తెలిసిన వ్యక్తిని తీసుకొస్తాం. అప్పుడు కేసులన్నీ పరిష్కారం చేయించుకుందాం. అప్పటి వరకు ఆగండి’’ అని ఆయన సూచించినట్లు తెలిసింది. ఇంతలో విశాఖకు చెందిన ఓ రియల్టర్ జోక్యం చేసుకొని కేసు అనుకూలంగా వస్తుందని భావించి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, తేడా వస్తే నిండా ఆరిపోతామని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, అప్పులు, పెట్టుబడులు, డబ్బుల అంశాలేవీ ఇక్కడ మాట్లాడవద్దని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. ’’ నేను చెప్పినట్లుగా విచారణ అర్హత లేకున్నా మీ కేసులు విచారణకు స్వీకరించారా? లేదా?. ఓపికపట్టండి. తొందరపడితే పరిష్కారం దొరకదు. ఇకపై ఇక్కడకు రావొద్దు. కొత్త కమిషనర్ వచ్చాక మాట్లాడదాం’’ అని బయటకు పంపించినట్లు తెలిసింది. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న బాధితుడు ఒకరు ఇదే విషయాన్ని కొన్ని ఆధారాలతో సహా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరాలు అందించారు.
లోతైన విచారణతో ఉక్కిరిబిక్కిరి
కేసులను విచారణకోసం స్వీకరించిన అప్పీల్స్ కమిషనర్, తనదైన శైలిలో లోతైన పరిశీలన మొదలుపెట్టారు. ఇంతకు ముందు రెవెన్యూలో విజిలెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న లక్ష్మీనరసింహానికి భూబాగోతాలపై అవగాహన ఉంది. తన వద్దకు వచ్చిన కేసుల సంగతి తెలుసుకొని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకున్నారు. ఆయితే, సలహాదారు చెప్పినట్లుగా కేసుల విచారణ వేగంగా ముందుకు సాగడం లేదు. వాయిదాలే తప్ప పరిష్కారం దొరకడం లేదు. చివరకు సలహాదారు సొంత కేసులు ఆరింటిని కూడా ఆయన పక్కన పెట్టేసినట్లు తెలిసింది. ఇదే విషయంపై పలు మార్లు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదని తెలిసింది. పైగా సెటిల్‌మెంట్ కేసులను తిరస్కరించినా లేదా వ్యతిరేక ఆదేశాలు ఇస్తే మొదటికే మోసం వస్తుందని అప్పీల్స్ దాఖలు చేసిన వారు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇటీవల మూకుమ్మడిగా ముఖ్యనేత సలహాదారు వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. తమరు చెప్పినట్లుగా ల్యాండ్ కేసుల పరిష్కారం జరగడం లేదని, వాయిదాలు తప్ప ఫలితాలు లేవని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రతీ ఫైలుపై తహసిల్దార్, ఆర్‌డీవో, జేసీ లనుంచి నివేదికలు కోరుతున్నారని, అవన్నీ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని, ఇలాగైతే తమకు అనుకూలంగా తీర్పు ఎలా వస్తుందంటూ బాధితులు ఆక్రోశం వెళ్లగక్కినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Updated Date - 2023-07-24T04:21:34+05:30 IST