2 Thousand Note: 2 వేల నోటు.. వయా వైన్ షాప్
ABN, First Publish Date - 2023-06-13T02:27:51+05:30
రాష్ట్రంలో ఒక్కో మద్యం షాపులో సగటున రోజుకు రూ.2లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం అంటే రూ.లక్ష.. రూ.2 వేల నోట్లే వచ్చాయంటూ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు.
రాష్ట్రంలో అడ్డగోలుగా పెద్ద నోట్ల మార్పిడి!
నేతల సొమ్ము మార్చే కేంద్రాలుగా సర్కారీ దుకాణాలు
ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా భారీ దందా
మందుబాబుల నుంచి తీసుకునేవి తక్కువ
బ్యాంకుల్లో జమ చేస్తున్న 2 వేల నోట్లు ఎక్కువ
నేతల ఇళ్ల కలుగుల్లోంచి బయటికొస్తున్న నోట్లు
రోజుకు అమ్మే 80 కోట్లలో సగం 2 వేల నోట్లే!
తెలంగాణ నేతల నోట్లూ కొన్నిచోట్ల మార్పిడి
ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న రూ.2 వేల నోటు బయటికొస్తోంది. ఇంతకాలం ఉన్నాయా? లేవా? అన్నట్టుగా ఉన్న రూ.2వేల నోట్లు ఇప్పుడు కట్టలు తెంచుకుని మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఇళ్ల కలుగుల్లోనుంచి వస్తున్న ఆ నోట్లకు సర్కారీ మద్యం షాపులు రాజముద్ర వేస్తున్నాయి. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20 వేల పరిమితి ఉంది. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వం మద్యం షాపులను ఏకంగా రూ.2 వేల నోటు మార్పిడి కేంద్రాలుగా మార్చేశారు. ఉదయం లక్ష విలువైన రూ.2 వేల నోట్లు మద్యంషాపుల్లో ఇచ్చి, సాయంత్రానికి అదే రూ.లక్షను 500 నోట్ల రూపంలో తీసుకుంటున్నారు.
ఆర్బీఐ ప్రకటన తర్వాత.. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకూ రూ.91 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు జమయితే, వాటిలో రూ.41 కోట్లు మద్యం షాపుల నుంచి వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లాలో రూ.120 కోట్లలో రూ.65 కోట్లు మద్యం నగదే. నెల్లూరు జిల్లాలోని ఓ బ్రాంచ్‌లోకి రూ.30 లక్షలు మద్యం షాపుల నుంచి వస్తుంటే...వాటిలో రూ.20 లక్షలు రూ.2 వేల నోట్ల డినామినేషన్లే ఉన్నాయి.
(అమరావతి, ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒక్కో మద్యం షాపులో సగటున రోజుకు రూ.2లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం అంటే రూ.లక్ష.. రూ.2 వేల నోట్లే వచ్చాయంటూ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20 వేల పరిమితి ఉంది. అదే మద్యం షాపు ద్వారా అయితే అపరిమితంగా నోట్లు మార్చుకోవచ్చు. మద్యంషాపుల నుంచి వచ్చే నోట్లను బ్యాంకులు తిరస్కరించలేవు. కానీ గత కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల నుంచి వస్తున్న నోట్లను చూస్తుంటే బ్యాంక్ మేనేజర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల పెద్ద నోట్లు వద్దని చెబుతున్నట్లు తెలిసింది.
షాపులే మార్పిడి కేంద్రాలు...
గత రెండు మూడేళ్ల నుంచి రూ.2వేల నోట్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. బ్యాంకులకు వెళ్లిన నోట్లను ఆర్‌బీఐ తీసుకుని, వాటి స్థానంలో ఇతర చిన్న నోట్లు ముద్రించింది. దీంతో దాదాపుగా రూ.2వేల నోట్లు లేవనే అందరూ భావించారు. గత నెల 19న ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగానే అనూహ్యంగా ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన గులాబీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20వేల పరిమితి ఉంది. ఒకేసారి రూ.50వేలు దాటి జమచేస్తే పాన్ నంబరు ఇవ్వాలి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రాజకీయ నేతలు... మద్యం షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని 2934 మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ పనిచేసే సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లు అంతా అధికార పార్టీకి సన్నిహితులే. రాష్ట్రంలో రోజుకు రూ.80కోట్ల మద్యం వ్యాపారం సాగుతుంటే అందులో దాదాపు రూ.60కోట్లు ఈ షాపుల్లోనే జరుగుతోంది. ఇప్పుడు ఆ నగదులో ఎక్కువగా గులాబీ నోట్లే కనిపిస్తున్నాయి.
ఎలా చేస్తున్నారు?
ప్రభుత్వ మద్యం షాపుల్లో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల అమ్మకాలుంటాయి. అందులో రూ.2వేల నోట్లను చేర్చేందుకు పలు మార్గాలను ఎంపిక చేసుకున్నారు. తొలుత కొందరు నాయకులు వారి డ్రైవర్లు, అటెండర్లకు పెద్ద నోట్లు ఇచ్చి మద్యం కొనుగోళ్ల ద్వారా మార్పించే ప్రయత్నాలు చేశారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత....ఇలా చేస్తే సెప్టెంబరు నాటికి మొత్తం నోట్లు మార్చడం సాధ్యపడదని తేలిపోయింది. దీంతో ఒకేసారి నోట్లు మార్చుకునేలా షాపుల్లోని సూపర్‌వైజర్లతో డీల్ మాట్లాడారు. ఎలాగూ మనోళ్లే కావడం, మరీ కాదంటే ఎంతోకొంత కమీషన్ ఇచ్చి అయినా నోట్లు మార్చేలా సెట్ చేశారు. వాస్తవానికి షాపుల్లో సామాన్య వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తే తీసుకోవడం లేదు. కనీసం రూ.వెయ్యికి పైగా కొనుగోలు చేస్తేనే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో మందు తాగేవాళ్లలో ఎవరూ రూ.వెయ్యి కొనుగోళ్లు చేయరు. అలాంటప్పుడు ఇన్ని పెద్ద నోట్లు షాపులకు ఎలా వస్తున్నాయి? అంటే డీల్ సెట్ చేసుకున్న వారు రోజూ ఉదయం సూపర్‌వైజర్లకు మార్చాల్సిన నోట్లు ఇస్తారు. అనంతరం ఆ మేరకు వ్యాపారం జరిగాక ఫోన్ చేయగానే నేతల మనుషులు వచ్చి వాటిని తీసుకెళ్తారు. మరికొన్ని చోట్ల రోజంతా వ్యాపారం సాగుతుంది. తర్వాత రోజు ఉదయం ఆ నగదును బ్యాంక్‌లో జమ చేసే సమయంలో చిన్న నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లు పెడుతున్నారు. మరికొందరు చోటా నేతలు బెల్టు షాపుల కోసం పెద్దఎత్తున కొనుగోలు చేసే మద్యాన్ని పూర్తిగా రూ.2వేల నోట్లతోనే కొంటున్నారు.
పెట్రోల్ బంకుల్లోనూ...
మద్యం షాపుల్లో అమ్మే రూ.60 కోట్లలో దాదాపుగా రూ.40 కోట్లు పెద్దనోట్లేనని తెలిసింది. ఇవి కాకుండా కొందరు పెట్రోల్ బంకులను నోట్ల మార్పిడికి కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. రూ.10కోట్ల మేర మార్చేస్తున్నారు. వెరసి..ఒక్క రోజులోనే .50కోట్లు విలువైన పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకుంటున్నారు. ఇలా నెలలో 1500కోట్ల వరకు మార్చేఅవకాశం ఉంది.
మాదేముంది చిరుద్యోగులం....
మద్యంషాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్లు ఎక్కడా నోరు మెదపడం లేదు. మార్చిన నోట్లకు సూపర్‌వైజర్లకు కమీషన్ అందుతోంది.ఒకవేళ కమీషన్ అందకపోయునా చేసేదేం లేదు. దీనిపై పలువురు సూపర్‌వైజర్లను ప్రశ్నించగా ‘మాదేముంది. చిన్న ఉద్యోగులం. ఎవరెలా చేయమంటే అలా చేయాలి. లేదంటే మా ఉద్యోగానికే ఎసరు’ అని సమాధానమిస్తున్నారు. కానీ ఈ దందాలో సూపర్‌వైజర్లే కీలకం. కాగా, తెలంగాణకు నేతలకు చెందిన రూ.2వేల నోట్లు సైతం రాష్ట్రంలోని కొన్ని చోట్ల మార్పిడి అవుతున్నట్టు సమాచారం.
Updated Date - 2023-06-13T02:27:51+05:30 IST