సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు
ABN, First Publish Date - 2023-03-02T03:12:10+05:30
వాహనంలో గంజాయి దొరికిందంటూ వైసీపీ రెబల్ నేత సోమిశెట్టి సుబ్బారావును (సుబ్బారావు గుప్తా) ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు.
బండిలో దొరికిందంటూ వైసీపీ రెబల్ నేత అరెస్టు
ఒంగోలు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వాహనంలో గంజాయి దొరికిందంటూ వైసీపీ రెబల్ నేత సోమిశెట్టి సుబ్బారావును (సుబ్బారావు గుప్తా) ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. మోటారు బైకుతో గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. తొలుత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌పై, ఇటీవల రాష్ట్ర సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సుబ్బారావు గుప్తా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై పోలీసుల కథనం ఎలా ఉన్నా.... అనుమానాలు బలంగానే వ్యక్తం అవుతున్నాయి. వైసీపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుబ్బారావు గుప్తా ఏడాదిక్రితం అప్పడు మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆపై ముఖ్యమంత్రి జగన్‌పై కూడా విమర్శలు చేశారు. ఆ సమయంలో ఒంగోలుకు చెందిన కొందరు వైసీపీ నాయకులు ఆయనపై దాడిచేశారు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న సుబ్బారావుగుప్తా మళ్లీ ప్రభుత్వంపై ఇటీవల విమర్శలు గుప్పించటం ప్రారంభించారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, బుధవారం ఉదయం ఒంగోలు పోలీసులు... వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా బైక్‌పై వస్తున్న సుబ్బారావు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి వాహనంతో సహా సుబ్బారావును పట్టుకున్నారు. విచారణలో ఆయన నడుపుతున్న బైక్‌లో ఒక సంచిని గుర్తించారు. ఆ సంచిలో చూడగా ఒక కిలో ఐదు గ్రాముల గంజాయి ఉంది. ఆ సంచిని స్వాధీనం చేసుకుని సుబ్బారావును అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఆయనకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది... అతను ఆ వ్యాపారం చేస్తున్నట్లు గతంలోనే సమాచారం ఉందా అంటూ విలేకరులు ప్రశ్నించగా.. డీఎస్పీ నాగరాజు సూటిగా సమాధానం ఇవ్వలేదు.
Updated Date - 2023-03-02T03:12:10+05:30 IST