జేఎన్‌టీయూ(కే) మాజీ వీసీ అల్లం అప్పారావు కన్నుమూత
ABN, First Publish Date - 2023-05-22T03:14:04+05:30
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ(కే) మాజీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్లం అప్పారావు కన్నుమూశారు. కొంతకాలం క్రితం ఆయన అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు.
● ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విశిష్ట సేవలు
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ(కే) మాజీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్లం అప్పారావు కన్నుమూశారు. కొంతకాలం క్రితం ఆయన అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున (అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం) వాకింగ్‌కు వెళ్లి వచ్చిన ఆయన గుండెపోటుకు గురై ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆద్యుడిగా ఆయనకు గుర్తింపు పొందారు. అప్పారావు ప్రోత్సాహంతో కోస్తాంధ్ర ప్రాంతంలోని అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లను ఏర్పాటు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఐఐఐటీ హోదా తీసుకువచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. అప్పారావు గైడ్‌గా సుమారు 40 మందికిపైగా పరిశోధనలు చేశారు. 2008లో జేఎన్‌టీయూ(కే) విశ్వవిద్యాలయం ఏర్పాటైన తరువాత తొలి వైస్‌చాన్సలర్‌గా నియమితులైన ఆయన 2011 వరకు సేవలందించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా కూడా పని చేశారు. విజయనగరం జిల్లా ఎల్.కోటలో జన్మించిన అల్లం అప్పారావు విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే సాగింది. ఆయనకు భార్య నాగమణి, కుమారుడు గురు తేజస్వి, కుమార్తె సుస్మిత లక్ష్మి ఉన్నారు. కుమార్తె, కుమారుడు డల్లాస్‌లోనే ఉంటున్నారు. అప్పారావు భౌతికకాయాన్ని అమెరికా నుంచి గురువారం విశాఖకు తీసుకువస్తారని, శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలిపారు.
Updated Date - 2023-05-22T03:14:04+05:30 IST