ESI scam : ఈఎస్‌ఐలో మందులమాయ
ABN, First Publish Date - 2023-06-01T04:49:09+05:30
ఈఎస్‌ఐలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్థానిక కొనుగోళ్లలో గోల్‌మాల్‌కు పాల్పడిన దందాను చూశాం. ఇప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణమే ఈఎస్‌ఐలో బద్దలయింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల మందులను ఏకంగా బయట మార్కెట్‌లో అమ్మేసుకున్నారు. దీనికోసం పక్కా స్కెచ్ ..
రూ.60 కోట్ల ఔషధాల స్కాం
ఈఎస్‌ఐ కోసం తక్కువ ధరకు మందులు
కొని.. మార్కెట్‌లో ఎక్కువకు అమ్మకం
పక్కాగా స్కెచ్.. పకడ్బందీగా అమలు
ఎమర్జెన్సీ మందులు లోకల్‌గా కొనే వీలు
ఇదే ఆసరాగా రెచ్చిపోయిన అధికారులు
ఏకంగా రూ.3 కోట్ల వరకు ఆర్డర్లు
దానికిముందే ఆయా కంపెనీలతో బేరాలు
ధర మార్కెట్ కంటే 80% తగ్గించేలా డీల్
ప్రైవేట్ గోదాముకు.. అటుగా మార్కెట్‌లోకి
రాజమహేంద్రి సూపరింటెండెంట్
పేరుతో రూ.3 కోట్ల పీవోలు
ఆదోని, విశాఖ సీడీఎస్‌ల్లోనూ ఇదే దందా!
ఈఎస్‌ఐ స్కామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒక కుంభకోణం మరవకముందే మరొకటి బద్దలవుతూనేఉంది. ఈఎస్‌ఐ పేరుతో మందులు కొనుగోలు చేసి....వాటిని బయట మార్కెట్‌లో కోట్లకు అమ్ముకున్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు కేంద్రం నుంచి వచ్చే మందులపై ఽనాట్ ఫర్ సేల్ అని ఉంటుంది. ధర ఉండదు. కానీ, ‘ఎమర్జెన్సీ’ పేరిట రాష్ట్రంలోని మూడు సెంట్రల్ డ్రగ్ స్టోరులు... ఎంఆర్‌పీ రేట్లు మందులపై కనిపించాలంటూ కంపెనీలకు షరతు పెట్టి.. వాటిని టోకుగా బయట మార్కెట్‌కు తరలించేశారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దందా విలువ 60 కోట్లు. ఈ దందాలతో కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యం ఈఎస్‌ఐల్లో పక్కదారి పడుతోంది. అధికారులు మారుతున్నారేగానీ వ్యవస్థలో మాత్రం మార్పు లేదు. ఈఎస్‌ఐకి ఎవరొచ్చినా కార్మికుల ఆరోగ్యం కంటే జేబులు నింపుకొనే పనే ఎక్కువగా చేస్తున్నారు. ఇందుకు తాజా స్కామే నిదర్శనం.
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ఈఎస్‌ఐలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. స్థానిక కొనుగోళ్లలో గోల్‌మాల్‌కు పాల్పడిన దందాను చూశాం. ఇప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణమే ఈఎస్‌ఐలో బద్దలయింది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల మందులను ఏకంగా బయట మార్కెట్‌లో అమ్మేసుకున్నారు. దీనికోసం పక్కా స్కెచ్ రచించి, పకడ్బందీగా అమలుచేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సీడీఎస్‌ల్లో (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్) ఇదే విధమైన దందాలకు పాల్పడ్డారు. సుమారు రూ.60 కోట్ల విలువైన మందులను బయట సంస్థలకు అమ్మేశారు. అది ఎలాగంటే...
ఈఎస్‌ఐ నిబంధనల ప్రకారం ఆస్పత్రులకు అవసరమైన మందులను కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థల దగ్గర నుంచే కొనుగోలు చేయాలి. కంపెనీల ఎంపిక విషయంలో కేంద్రం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల ఈఎస్‌ఐ సంస్థలు ఆ కంపెనీల దగ్గర నుంచి కొనుగోలు చేసుకోవాలన్న నిబంధన ఉంది. ఇది కాకుండా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు అత్యవసర మందులను, సర్జకల్ ఐటమ్స్‌ను కొనుగోలు చేసుకునేందుకు కొంత వెసులుబాటు ఇచ్చారు. అది కూడా మూడు నెలల వ్యవధిలో లక్ష రూపాయలకు మించి కొనుగోలు చేయడానికి లేదు. ఎవరి దగ్గర పడితే వారి వద్ద వాటిని కొనుగోలు చేయకూడదు. లోకల్ పర్చేజ్ కింద టెండర్లు పిలిచి, ఒక ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి. టెండర్ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీద్వారా ఎమర్జెన్సీ మందులు, సర్జకల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలి. అయితే, లోకల్ పర్చేజ్ అనే నిబంధనను వాడుకుని ఈఎస్‌ఐ అధికారులు భారీ స్కామ్‌కు పాల్పడ్డారు.
కంపెనీలతో బేరాలు..
సాధారణంగా బయట మార్కెట్‌లో ఉన్న మందుల ధరలతో పోల్చితే ఈఎస్‌ఐకు కంపెనీలు సరఫరా చేసే మందుల ధరలు చాలా చౌక. ఉదాహరణకు బయట మార్కెట్‌లో ర్యాబిపెరోజోన్ అనే మందు రూ.8 ఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీ.. ఈఎస్‌ఐకు కేవలం 97 పైసలకే దానిని సరఫరా చేస్తోంది. అన్ని రాష్ట్రాల ఈఎస్‌ఐ డైరెక్టరేట్లు అదే రేటుకు కొనాలి. అయితే, లోకల్ పర్చేజ్ విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఎమర్జెన్సీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటును తమ జేబులు నింపుకోవడానికి ఈఎస్‌ఐ అధికారులు వాడుకున్నారు. ఇందులోభాగంగా ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో మందుల తయారీ కంపెనీ ప్రతినిధులతో ప్రైవేటు సమావేశం జరిపారు. ఈ సమావేశంలోనే భారీ స్కామ్‌కు బీజం పడింది. ‘‘మేం మీనుంచి లోకల్ పర్చేజ్ కింద భారీ మొత్తంలో మందులు కొంటాం. బయటమార్కెట్ కంటే మాకు ఎంత తక్కువకు మందులు సరఫరా చేస్తారు?’’ అంటూ వారు కంపెనీలతో బేరసారాలు జరిపారు. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి బయట మార్కెట్ కంటే 80శాతం తక్కువకు సరఫరా చేయడానికి ఆంగీకరించాయి. అంటే బయట మార్కెట్‌లో రూ.10ఉన్న టాబ్లెట్ ఈఎస్‌ఐ లోకల్ పర్చేజ్‌కు మాత్రం రూ.2కే సరఫరా చేస్తాయన్నమాట. ఇలా మన రాష్ట్రంలోని ఐదు సెంట్రల్ డ్రగ్ స్టోరులైన రాజమహేంద్రి, విశాఖ, విజయవాడ, అదోనీ, తిరుపతి ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు.
రాజమండ్రి నుంచి పీవోలు...
హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈఎస్‌ఐ ఉన్నతాధికారులు అమలుచేయడం మొదలుపెట్టారు. రాజమహేంద్రవరం పరిధిలో లోకల్ పర్చేజ్ ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో పాల్గొనేందుకు ఒక డమ్మీ ఏజెన్సీని అధికారులు ముందే సృష్టించారు. రాజమండ్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో ఓ డమ్మీ ఏజెన్సీ ద్వారా బిడ్ దాఖలు చేయించారు. సాధారణంగా అదే ఎల్1 సంస్థగా నిలిచింది. ఆ ఏజెన్సీకి ఒకేసారి, ఒకే రోజు రూ.3 కోట్లు విలువైన మందుల కొనుగోలకు పీవో (పర్చేజ్ అర్డర్) సిద్ధం చేశారు. నిబంధనలకు ఇది విరుద్ధం. ఎందుకుంటే లోకల్ పర్చేజ్ కింద మూడు నెలలకు కలిపి లక్ష రూపాయల విలువైన మందులే కొనాలి. కానీ అధికారులు ఈ నిబంధనలు గాలికి వదిలేసి ఒకేరోజు కోట్లలో పీవోలు సిద్ధం చేయడం గమనార్హం.
హైదరాబాద్ కేంద్రంగా...
పీవో విలువ రూ.1లక్ష అయినా.. రూ.3 కోట్లు అయినా సూపరింటెండెంట్లు మాత్రమే ఎల్1గా వచ్చిన ఏజెన్సీకి పీవో ఇవ్వాలి. కానీ ఉన్నతాధికారులు.... సూపరింటెండెంట్‌కు సంబంధం లేకుండా పీవోలను నేరుగా ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌కు తెప్పించుకున్నారు. హైదరాబాద్‌లో వారు ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలను వాటిని ఇచ్చేసి, వెంటనే మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. సాధారణంగా కంపెనీలకు పీవోలను మెయిల్ ద్వారా పంపించాలి. లేదా పోస్టు ద్వారా పంపించాలి. కానీ ఉన్నతాధికారులు నేరుగా కంపెనీ ప్రతినిధుల చేతుల్లో పెట్టారు.
ప్రైవేటు గోదాముకు సరఫరా..
రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ పేరుతో ఇచ్చిన పీవోల ఆధారంగా కంపెనీలు మందులను సరఫరా చేశాయి. కాబట్టి, మందులు కూడా అక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోరుకు సరఫరా చేయాలి. కానీ ఉన్నతాధికారులు వాటిని ఒక ప్రైవేటు గోదాముకు తరలించారు. అక్కడినుంచి బయట మార్కెట్‌లో వాటిని అమ్మడం మొదలుపెట్టారు. అదేగనుక. రాజమహేంద్రి డ్రగ్ స్టోరుకు పంపితే అంతా రికార్డు అవుతుంది. బయటకు తరలించడం కుదరదు. అందువల్లే ప్రైవేటు గోదాములో మందులు నిల్వ చేశారు. రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన మందులకు బయట అమ్ముకుని ఒక్క రాజమహేంద్రిలోనే రూ.20 కోట్ల వరకు జేబులో వేసుకున్నారు.విశాఖ, అదోనీ డ్రగ్ స్టోరుల్లోనూ ఇలాగే వ్యవహరించినట్టు సమాచారం. ఇలా దాదాపు రూ.60 కోట్లు స్కామ్ చేసినట్లు తెలుస్తోంది.
ఎలా అమ్మారంటే..
ఈఎస్‌ఐలకు కేంద్రం సరఫరాచేసే మందులు బయట అమ్మడానికి వీల్లేదు. నాట్ ఫర్ సేల్ అని వాటిపై రాసి ఉంటుంది. కానీ, లోకల్ పర్చేజ్‌కు వెళ్లినప్పుడు ఈఎస్‌ఐ అధికారులు తిమ్మినిబమ్మిని చేసేశారు. మందులపై ఎంఆర్‌పీ ధర క్లియర్‌గా ఉండాలని కంపెనీలకు ఇచ్చిన పీవోల్లోనే స్పష్టంగా పొందుపరచడం గమనార్హం.
ఇలా బయటపడింది...
అంతా అయిపోయింది... బయట మార్కెట్‌లో అమ్మిన మందులకు సంబంధించిన మొత్తం సొమ్ము ఉన్నతాధికారుల చేతికి వచ్చేసింది. తమకు సహకరించినవారికి, కలిసొచ్చినవారికి భారీ మొత్తంలో ముడుపులు కూడా సమర్పించేసుకున్నారు. అంతా సాఫీగా అయిపోయినట్టు రిలాక్స్ అయ్యారు. కానీ, ఎంత పెద్ద వారైనా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తారు. ఈఎస్‌ఐ ఉన్నతాధికారుల విషయంలోనూ ఇదే జరిగింది. రాజమహేంద్రి సూపరింటెండెంట్‌లో పీవోలు సిద్ధం చేయించడం, వాటిని డైరెక్టరేట్‌కు పంపించడం... డైరెక్టరేట్ అధికారులు మందుల తయారీ కంపెనీ ప్రతినిధులకు నేరుగా పీవోలు అందించడం, కంపెనీలు సరఫరా చేయడం., వాటిని బయటి మార్కెట్‌లో అమ్మడం వరకూ బాగానే జరిగింది. కానీ మందులు సరఫరా చేసిన కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులను డైరెక్టరేట్ అధికారులు ఒక ప్రైవేటు ఏజెన్సీ ఖాతా ద్వారా చెల్లించారు. రాజమహేంద్రిలో టెండర్లు పిలిచినప్పుడు అధికారులు సృష్టించిన డమ్మీ ఏజెన్సీ ఇది.
ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందులు సరఫరా చేసిన కంపెనీల్లో ఒకటి ఈమధ్య ఆడిట్ చేయించుకుంది. ఆ ఆడిట్‌లో పీవో కాపీ రాజమహేంద్రి సూపరింటెండెంట్ పేరుతో ఉండగా, చెల్లించిన బిల్లులు మాత్రం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా చెల్లించినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. అయితే, విషయం బయటకు పొక్కకుండా ఈఎస్‌ఐ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.
Updated Date - 2023-06-01T05:43:52+05:30 IST