అద్దెకు దిగి..యజమానిని బంధించి
ABN, First Publish Date - 2023-01-26T00:13:58+05:30
అద్దెకు దిగిన దంపతులు సమయం చూసుకుని వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారితోటలో కొత్తపల్లి సూర్యప్రభావతి అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివాసముంటోంది.
పిఠాపురం, జనవరి 25: అద్దెకు దిగిన దంపతులు సమయం చూసుకుని వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారితోటలో కొత్తపల్లి సూర్యప్రభావతి అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివాసముంటోంది. పక్క పోర్షన్ ఖాళీగా ఉండటంతో సంక్రాంతికి ముందు ఓ దంపతులకు అద్దెకు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారు ఊరెళ్లి వస్తామని చెప్పి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం కుళాయిల ద్వారా నీరు రావడం లేదని ప్రభావతికి చెప్పడంతో ఆమె ఇంటి లోపలకు రాగానే దంపతులు ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, మూతికి టేపు వేసి బంగారు గొలుసు, 8 గాజులు, చేతి ఉంగరం, చెవి దుద్దులు, కాళ్ల పట్టీలు, సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. వెళ్లే ముందు ఆమెను కొట్టారు. ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు వచ్చి కట్లు విప్పారు. బంగారం 200 గ్రాములు ఉంటుందని ప్రభావతి తెలిపారు. ప్రభావతికి సహాయంగా ఉంటున్న మహిళ దోపిడీ జరిగిన సమయంలో బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు. పిఠాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Updated Date - 2023-01-26T00:14:02+05:30 IST