దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు
ABN, First Publish Date - 2023-04-11T00:32:15+05:30
దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), ఏప్రిల్ 10: దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) జి.వెంకటేశ్వరరావు సోమవారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున కొవ్వూరు మండలం వేలుమూరుకు చెందిన అరటిపండ్ల వ్యాపారి పసల రామకృష్ణ ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరంలోని దోబీఘాట్ వద్ద అరటిపండ్ల మార్కెట్‌కు వస్తున్నాడు. గోదావరి గట్టున శివాలయం వద్దకు వచ్చేసరికి రామకృష్ణని కర్రతో తీవ్రంగా కొట్టి రూ.30 వేలు, సెల్‌ఫోన్‌ని దుండగులు దోచుకుపోయారు. కేసు నమోదు చేసి సౌత్‌జోన్ డీఎస్పీ ఎం.శ్రీలత పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని ఉల్లితోటకు చెందిన మాసాబత్తుల కోటేశ్వరరావు, మోరంపూడికి చెందిన సింగం దుర్గాప్రసాద్, ఈతకోట గ్రామానికి చెందిన జనపరెడ్డి శ్రీనులను నిందితులుగా గుర్తించారు. బాధితుడి వద్ద అరటిపండ్ల మార్కెట్‌లో కోటేశ్వరరావు కూలీగా పనిచేస్తాడని అడిషనల్ ఎస్పీ చెప్పారు. రామకృష్ణ అరటిపండ్ల ఖరీదుకు రోజూ డబ్బులతో రావడం గమనించిన కోటేశ్వరరావు దోబీఘాట్ వద్ద ఆవారాగా తిరిగే మిగతా ఇద్దరి సహాయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒక ద్విచక్రవాహనం, నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, రూ.5,270 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టీ.గణేశ్, ఎస్‌ఐలు జీవీవీ సత్యనారాయణ, ఎండీ అష్ఫాక్, కేఎం జోషి, క్రైమ్స్ విభాగం సీఐలు త్రినాథ్, కృపానందం, కానిస్టేబుళ్లలను ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి అభినందించారు.
Updated Date - 2023-04-11T00:32:15+05:30 IST