పీఎం సడక్ నిధులు.. మళ్లించేశారు
ABN, First Publish Date - 2023-02-25T01:07:54+05:30
గ్రామాలను కలుపుతూ ఉన్న రహదారులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనా పథకం నిధులను మళ్లించేశారు. కేంద్రం విడుదల చేసే ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంతో పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. పనులు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, శంకుస్థాపన శిలాఫలకాలు మాత్రం మిగిలాయి.
పనుల నిర్వహణకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
శంకుస్థాపనలతో సరి
వెక్కిరిస్తున్న శిలాఫలకాలు, బోర్డులు
ఏడాదిన్నర గడిచినా అదే పరిస్థితి
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 24: గ్రామాలను కలుపుతూ ఉన్న రహదారులను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనా పథకం నిధులను మళ్లించేశారు. కేంద్రం విడుదల చేసే ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంతో పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. పనులు ఒక్క అడుగు ముందుకు పడకపోయినా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, శంకుస్థాపన శిలాఫలకాలు మాత్రం మిగిలాయి.
బిల్లుల చెల్లింపులో జాప్యంతో..
గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తూ ప్రతిఏటా పీఎం గ్రామీణ సడక్ యోజనా పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం రూ.3కోట్ల నుంచి రూ.10కోట్లు విలువైన పనులకు కేటాయింపులు జరుగుతాయి. ఈ పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పనులు చేపట్టడంతోపాటు ఐదేళ్లపాటు ఆయా రహదారుల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టరుదే. ఇందు నిమిత్తం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. సాధారణంగా ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి కనబరుస్తారు. కేంద్ర నిధులు కావడం, పనులు చేసిన వెంటనే బిల్లుల చెల్లింపు జరగడంతో పనులు చేసేందుకు పోటీపడతారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారయింది. తొలుత బిల్లుల చెల్లింపు సక్రమంగానే జరిగినా తదనంతరం పరిస్థితి మారింది. పీఎం సడక్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వినియోగించుకుని బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో ప నుల నిర్వహణకు టెం డర్లు వేసిన కాంట్రాక్ట ర్లు పనులు చేపట్టేందు కు ముందుకు రావడం లేదు. కాకినాడ జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పు జిల్లాలోను ఇదే పరిస్థితి నెలకొంది. 2021-22, 2022-23 సంవత్సరాల్లో మంజూరైన పనులు ముందుకు కదలడం లేదు.
పనులు చేయకపోయినా బోర్డులు
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనా పథకం ద్వారా చేపట్టే పనుల్లో పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. చేపట్టే పని, అందుకు అయ్యే వ్యయం, పనులు ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తవుతుంది, ఎన్నేళ్లు నిర్వహణ చూస్తారు, కాంట్రాక్టరు పేరు తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తూ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పలుచోట్ల పనులు చేయకుండానే బోర్డులు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన శిలాఫలకాలు, బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు-దుర్గాడ-కత్తిపూడి మధ్య గల రహదారిని తారు, సిమెంటు రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు, డ్రెయిన్ నిర్మాణానికి రూ.3.75కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు 2021, ఆగస్టు 2021లో కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శంకుస్థాపన చేశా రు. ఇది జరిగి 19 నెలలు గడిచాయి. పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. అక్కడ మాత్రం 2022, మే 18వతేదీ నాటికి పనులు పూర్తి చేశామంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన జరిగి బోర్డులు ఏర్పాటు చేయడంతో పనులు జరిగిపోతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యంతో టెండరు వేసిన కాంట్రాక్టరు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం మానివేశారు. ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవడంతో ఇప్పుడు తీరిగ్గా టెండర్లు రద్దు చేశామని, మళ్లీ పిలుస్తామని చెబుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించడంవల్ల పనులు చేసినా బిల్లులు వస్తాయో రావో అన్న సందిగ్ధతతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాచారం. అటువంటప్పుడు పనుల నిర్వహణ బోర్డులు ఏర్పాటు చేయడం విమర్శలకు గురవుతోంది.
మిగిలిన పనులదీ అదే దారి
పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు పిలిచిన టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. జిల్లా అంతా ఇదే పరిస్థితి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలో రూ.7కోట్ల విలువైన మరమ్మతుల పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్కరూ టెండరు దాఖలు చేయలేదు. ఇదే కాకుండా ఇతర పనుల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఏ పని చేయాలన్నా ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి వెంటనే బిల్లులు చెల్లిస్తేనే తాము ముందుకు రాగలమని కాంట్రాక్టర్లు చెబుతుండడంతో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నిర్వహించే పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.
Updated Date - 2023-02-25T01:07:56+05:30 IST