అభివృద్ధి చేయలేని పదవులెందుకు..రాజీనామాలు చేసేస్తాం..?
ABN, First Publish Date - 2023-03-28T00:50:39+05:30
పాలకవర్గం ఏర్పడి రెండేళ్లవుతోంది.. వార్డుల్లో ఒక్క రూపాయి అభివృద్ధి పని చేయలేదు.. ప్రజల ముందుకు వెళ్లలేక పోతున్నాం.. రాజీనామాలు తప్ప గత్యంతరం లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికై రెండేళ్లయినా.. రూపాయి పనిచేయించలేదు
అధికార పార్టీలో నాయకత్వలోపం ఉంది..
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర అభ్యంతరం
కొవ్వూరు, మార్చి 27 : పాలకవర్గం ఏర్పడి రెండేళ్లవుతోంది.. వార్డుల్లో ఒక్క రూపాయి అభివృద్ధి పని చేయలేదు.. ప్రజల ముందుకు వెళ్లలేక పోతున్నాం.. రాజీనామాలు తప్ప గత్యంతరం లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.కొవ్వూరు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం చైర్‌పర్సన్ బావన రత్నకుమారి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ కౌన్సిలర్‌గా ఎన్నికై రెండేళ్లయినా వార్డులో ఒక్క రూపాయి అభి వృద్ధి పని చేపట్టలేకపోయామన్నారు. కౌన్సిలర్ అంకోలు లిల్లీ పద్మ మాట్లాడుతూ 12వ వార్డు కిలాని వారి వీధిలో మురుగు పారక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్,కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. గడపగడప కార్యక్రమంలో ప్రజల ముందుకు వెళ్లలేక పోతున్నామన్నారు. అధికార పార్టీలో ఉండి వార్డుల్లో తిరగలేక పోతున్నామని వాపోయారు. బత్తి నాగరాజు మాట్లాడుతూ అధికార పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నారు. అందువల్లనే పనులు కావడంలేదన్నారు.వరిగేటి లలితకుమారి మాట్లాడుతూ మూడో వార్డులో కల్వర్టుల నిర్మాణం చేపట్టాలన్నారు.తోట లక్ష్మిప్రసన్న మాట్లాడుతూ టెండర్లు పూర్తయిన రోడ్ల నిర్మాణాలను ఎప్పుడు ప్రారం భిస్తారని ప్రశ్నించారు.పాలూరి నీలిమ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారు ఎవరికి తెలియడం లేదని.. మునిసిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ ఏర్పాటుచేసి అన్నివార్డులకు సమానంగా కార్మికులను ప్రతిరోజు పంపించాలన్నారు.పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ పట్టణం లో పారిశుధ్యం అధ్వానంగా ఉందన్నారు.ఆయన వార్డులో అభివృద్ధి పనులు చేపట్టమని చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందించారు.కోఆప్షన్ సభ్యుడు ఏలూరి వెంకట్ మాట్లాడుతూ పట్టణంలోని సెంటర్ డివైడర్లపై ఉన్న కియోకార్పస్ మొక్కలను పూర్తిగా తొలగించి కొత్తమొక్కలు వేయాలన్నారు. మునిసిపల్ చైర్‌పర్సన్ బావన రత్నకుమారి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ మునిసిపాలిటీలో నిర్వహించాలని కమిషనర్‌కు సూచించారు.అజెండాలోని 14,15 అంశాలను రద్దుచేసి హెడ్‌వాటర్ వర్క్సులో బోర్లు మరమ్మతులు సమ్మ ర్ యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు.కమిషనర్ బి.శ్రీకాంత్ మాట్లాడుతూ కొం దరు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. అటువంటి వారిని గుర్తించి బ్లాక్‌లిస్టులో పెడతామన్నారు.
డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై గందరగోళం..
కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. విజయవిహార్ నుంచి బస్టాండ్ వరకు రద్దీగా ఉండే ప్రధాన రహదారి 60 అడుగులుగా రూపకల్పన చేసి, ప్రస్తుతం 12 అడుగులు ఉన్న 22వ వార్డు యాగంటి వారి వీధిని 60 అడుగుల రోడ్డుగా ప్రతిపాదించడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. 12 నుంచి 60 అడుగులకు పెంచితే ఇళ్లు పూర్తిగా నష్టపోతారని ఆందోళన చెందుతున్నారన్నారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలపై కౌన్సిల్ తీర్మానం చేసి రుడాకు పంపించాలన్నారు.కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చిన ఏ అంశాలు సరిగా లేవన్నారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ డ్రాఫ్ఠ్ మాస్టర్ ప్లాన్ సరికాదన్నారు.కమిషనర్ బి. శ్రీకాంత్ మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంతో పాటు 8 గ్రామాలు (ఆరికిరేవుల, చాగల్లు, దొమ్మేరు, నందమూరు, పశివేదల, తోగుమ్మి, వాడపల్లి, వేములూరు గ్రామాలను కలిపి 36.63 చదరపు కిలోమీటరలో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారుచేశారన్నారు.దీనిపై ఏప్రిల్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చునన్నారు.వచ్చిన అభ్యంతరాలు రుడా ద్వారా డీటీసీపీకి పంపించడం జరుగుతుందన్నారు. చైర్‌పర్సన్ బావన రత్నకుమారి పాలకవర్గం సూచనల మేరకు మాస్టర్‌ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Updated Date - 2023-03-28T00:50:39+05:30 IST