కరప గురుకుల పాఠశాలలో తిష్టవేసిన సమస్యలెన్నో..
ABN, First Publish Date - 2023-01-04T01:51:49+05:30
కరపలోని మహత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో సమస్యలు తిష్టవేశా యి.
కరప, జనవరి 3: కరపలోని మహత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో సమస్యలు తిష్టవేశా యి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఉన్న మూడంతస్తుల భవనంలో ఈ గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. కానీ గదులు సరిపోక, కనీస వసతులు లేక ఇక్కడ చదువుతున్న 265 మంది వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం తరగతులు నిర్వహిస్తున్న గదులనే రాత్రికి డార్మెటరీ కింద ఉపయోగిస్తూ అందులోనే పడుకుంటున్నారు. టాయ్‌లెట్లు సరిపడా లేక, నిర్వహణ సక్రమంగా చేయక తరగతి గదుల వరకు దుర్గంధం వ్యాపిస్తోంది. డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఆరుబయట నేలపై ఎండలో కూర్చుని నిత్యం భోజనాలు చేయాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. చుట్టూ ప్రహరీగోడ ఉన్నా బయట వ్యక్తులు గేట్లను తొలగించుకుని గురుకుల పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశిస్తు న్నారు. ఇటు గదులు సరిపోక ఇబ్బంది పడుతుంటే గ్రౌండ్‌ఫ్లోర్‌లోని హాల్‌లో పీహెచ్‌సీ అధికారులు కొవిడ్ సమయంలో వినియోగించిన ఫ్రిజ్‌లు, ఇతర ఫర్నిచర్‌ను ఉంచారు. అలాగే పలువురు విద్యార్థులు చర్మ వ్యాధులు, జ్వరాలతో బాధపడుతున్నారు. మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం నాసిరకంగా ఉండి అన్నం చిమిడిపోతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అని సాధారణ బి య్యాన్ని పంపించినట్టు సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయడానికి మంగళవారం విచ్చేసిన డివిజనల్ వైద్యాధికారి రమావత్ శ్రీనివాసనాయక్ ఈ సమస్యలను చూసి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పి.యజ్ఞ మాట్లాడుతూ ఇక్కడి సమస్యలను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.
Updated Date - 2023-01-04T01:51:50+05:30 IST