నాణ్యత గాలికి!
ABN, First Publish Date - 2023-03-05T01:05:22+05:30
జగనన్న విద్యా కిట్టు.. నాణ్యత తీసికట్టుగా మారింది.. ఊరించి ఊరించి ఉసూరు మనిపించారు..పాపం చిన్నారులు మా జగన్ మామ ఇచ్చాడంటూ జగనన్న విద్యా కానుకను ఎంతో ఆనందంగా తీసుకున్నారు..
ఉసూరుమనిపించిన కానుక
నెలకే చిరిగిన బ్యాగ్‌లు.. బూట్లు
ప్రస్తుతం స్కూళ్లలో కానరాని కానుక
మళ్లీ కొత్త బ్యాగ్‌ల కొనుగోలు
జిల్లాలో 1.29 లక్షల ప్రభుత్వ విద్యార్థులు
విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం
వృథాగా పోయిన కోట్లు
జగనన్న విద్యా కిట్టు.. నాణ్యత తీసికట్టుగా మారింది.. ఊరించి ఊరించి ఉసూరు మనిపించారు..పాపం చిన్నారులు మా జగన్ మామ ఇచ్చాడంటూ జగనన్న విద్యా కానుకను ఎంతో ఆనందంగా తీసుకున్నారు.. తీసుకున్నంత సేపు లేవు.. నాలుగు పుస్తకాలు ఎక్కువ పెడితే బ్యాగ్‌లు చిరిగిపోయాయి.. నడుస్తూ ఉంటే బూట్లు ఊడిపోయాయి. జిల్లాలో విద్యార్థులు అందరి వద్ద నెలకే బ్యాగ్‌లు పాడైపోయాయి.. బూట్లు చిల్లులు పడిపోయాయి.. ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరలో ఉన్నాం.. ఒక్కరి వద్ద ఆ కానుక లేదు.. నాణ్యత లేని వస్తువు లెందుకు.. ఏడాది పొడవునా ఏడవడానికా అంటూ తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జగనన్న విద్యా కానుక మూణ్ణాళ్ల ముచ్చటగా తయారైంది. బ్యాగులు చిరిగిపోయాయి..జిప్‌లు ఊడిపోయియి.షూలు పాడైపోయాయి. ఏ ఒక్క విద్యార్థి దగ్గరా జగనన్న విద్యా కానుక లేదంటే అతిశయోక్తి కాదు.. ఎంతో అట్టహాసంగా పంపిణీ చేసిన జగనన్న విద్యా కానుక కిట్టు నాణ్యతలో తీసికట్టుగా మారింది.మొదట నెల రోజుల్లో చాలా వరకూ పాడైపోగా.. కొత్త ఏడాది ప్రారంభం అయ్యేనాటికి విద్యార్థుల వద్ద ఒక బ్యాగ్ కూడా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా తల్లిదండ్రులు కొనిచ్చిన బ్యాగ్‌లతోనే పాఠశాలకు వస్తున్నారు. బూట్లు పరిస్థితీ అంతే.
చిరిగిన బ్యాగ్‌లు.. పగిలిన బూట్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్‌లు, బూట్లు, సాక్స్, బెల్ట్, పుస్తకాలు, డిక్షనరీలు జగనన్న విద్యా కానుక పేరిట గతేడాది సూళ్లు తీసిన చాన్నాళ్లకు వచ్చిన సంగతి తెలిసిందే. అవి కూడా అందరికీ ఒకేసారి ఇవ్వలేదు. విడతలుగా ఇచ్చారు. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థు లంతా ఈ కానుకకు అర్హులే. జిల్లాలో మొత్తం 670 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 లక్షా 29 వేల మంది విద్యార్ధులు ఉన్నారు. వీరందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు గతేడాది జూలై నుంచి కొంచెం కొంచెంగా ఇచ్చా రు. బ్యాగ్‌లు నాసిరకం ఇచ్చారు. ఎక్కడ కొన్నారో.. ఎవరు కొన్నారో.. దాని ఖరీదు ఎంతో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం పంపితే మేము పంపిణీ చేశామని మాత్రమే విద్యాశాఖ అఽధికారులు చెబుతున్నారు. ఈ కానుకలో పెద్ద అవినీతి జరిగినట్టు చెప్పవచ్చు. బ్యాగులు, బూట్లు ఇచ్చిన కొద్దిరోజులకే పాడైపోయాయి. చాలా మంది విద్యార్థులకు బూట్లు సరిపోలేదు. మొదట్లో కొన్ని పోగా ఫిర్యాదులు వచ్చిన చోట సుమా రు 6 వేల జతల బూట్ల వరకూ అఽధికారులు తిరిగి ఇచ్చారు. వాడడం ప్రారంభిస్తే నెలకే పాడైపోయాయి. బ్యాగ్ కనీసం సంవత్సరం కూడా రాలేదు. కొన్ని బ్యాగ్‌లు నెలరోజులలోనే పోగా, కొన్ని రెండు మూడు నెలల్లో పోయాయని చెబుతున్నారు. దీంతో ఇదేం కానుక. బడాయి ఎక్కు వ సరుకు తక్కువ అన్నట్టు ఉందని గుసగుసలాడుతున్నారు. దీంతో తల్లిదం డ్రులు సొంత డబ్బులతో మళ్లీ బ్యాగులు కొనుగోలు చేయవలసి వచ్చిందని చెబుతున్నారు. జిల్లాలో ఏ పాఠశాలకు వెళ్లి చూసినా జగనన్న విద్యాకానుక బ్యాగ్‌లు కానరావడం లేదు. కొందరు పాడైన బూట్లను వేసుకుని వస్తున్నారు. ఇతర పిల్లలకు కనిపించగా చిల్లులను దాచేసే ప్రయత్నం చేస్తూ, ఎవరైనా చూస్తే సిగ్గుపడుతూ అవమానంగా కూడా చాలా మంది విద్యార్థులు ఫీలవుతున్నారు. స్కూల్‌లో ఎక్కువ మంది విద్యార్ధుల పరిస్థితి ఇదే.
పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారి
ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పలు పాఠశాలలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయాలను అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. బ్యాగ్స్‌లు ఏవని కూడా అడగలేదు. ఎలా చదివారని, వర్కు బుక్‌లు పూర్తయ్యాయాలేదా, నాడు-నేడు పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించడమే కానీ, విద్యాకానుక నాణ్యతలేమి, నాసిరకం తనం గురించి ఏమీ పట్టించుకోకపోవడం గమనార్హం.
Updated Date - 2023-03-05T01:05:22+05:30 IST