నమ్మించి నట్టేట ముంచాడు
ABN, First Publish Date - 2023-08-02T00:23:49+05:30
ఆఫర్ల ఆశ చూపాడు. అధిక వడ్డీ అంటూ నమ్మబలికాడు. కోట్లాది రూపాయలు దండుకున్నాడు. చివరకు బోర్డు తిప్పి పరారయ్యాడు. నిందితుడు వైసీపీ గ్రామస్థాయి యువ నాయకుడు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై ప్రధాన కేంద్రంగా సాట్కో క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ షేర్ మార్కెట్ వ్యాపారంలో ఉంది. ఈ కంపెనీ 2015-16లో రాజమహేంద్రవరంలో ఓ బ్రాంచి ప్రారంభించింది.
షేర్ మార్కెట్ పేరుతో బురిడీ..
రూ.15 కోట్లకు కుచ్చుటోపీ..
123 మంది బాధితుల నుంచి వసూళ్లు
రాజమహేంద్రవరం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఆఫర్ల ఆశ చూపాడు. అధిక వడ్డీ అంటూ నమ్మబలికాడు. కోట్లాది రూపాయలు దండుకున్నాడు. చివరకు బోర్డు తిప్పి పరారయ్యాడు. నిందితుడు వైసీపీ గ్రామస్థాయి యువ నాయకుడు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై ప్రధాన కేంద్రంగా సాట్కో క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్ షేర్ మార్కెట్ వ్యాపారంలో ఉంది. ఈ కంపెనీ 2015-16లో రాజమహేంద్రవరంలో ఓ బ్రాంచి ప్రారంభించింది. అయితే అనుకున్నంతగా వ్యాపారం జరక్కపోవడంతో ఏడాదిలోనే మూసేసింది. ఈ కంపెనీలో కడియం మండలం జేగురుపాడుకు చెందిన ముద్దుకూరి ప్రదీప్‌కుమార్ అలియాస్ బాలు మార్కెటింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. కంపెనీ మూసేశాక 2018లో అనధికారికంగా ముంబై కంపెనీ నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా ఇతడే సాట్కో క్యాపిటల్ మార్కెట్స్ పేరుతో ఓ ఆఫీసు తెరిచాడు. డిపాజిట్లు సేకరించడం మొదలు పెట్టాడు. అనుమానం రాకుండా కొంతకాలం సజావుగా చెల్లింపులు చేశాడు. తర్వాత క్రమం తప్పింది. ఆడిటింగ్, ఇన్‌కంట్యాక్సు అంటూ సాకులు మొదలు పెట్టాడు. 2023 ఏప్రిల్, మే నెలల్లో వడ్డీ చెల్లింపులు మొత్తానికి మానేశాడు. చివరికి ఈ ఏడాది జూన్ మొదటివారంలో బోర్డు తిప్పేశాడు. ఆఫీసుకు శాశ్వతంగా తాళం వేసేశాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు.
ఆఫర్లతో గాలం
రూ.10 లక్షలు డిపాజిట్‌పై 10 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు కడితే కారు వంటి ఆఫర్లతో గాలం వేశాడు. 3 నెలలకు ఒకసారి తీసుకుంటే నూటికి రూ.3 చొప్పున, నెలవారీగా కావాలంటే రూ.2 చొప్పున వడ్డీ ఇస్తామన్నాడు. డిపాజిట్టు సొమ్మును తమ హెడ్ ఆఫీసు (సాట్కో, ముంబై) వాళ్లు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారని.. లాభం వస్తే తాము కొంత తీసుకొని కొంత డిపాజిట్‌దారుడికి ఇస్తామని, నష్టం వస్తే తామే భరిస్తామని, డిపాజిట్ దారుడికి సంబంధం ఉండదని నమ్మబలికాడు. అసలు అలాగే ఉంటుందని ఎప్పుడు వెనక్కి కావాలంటే అప్పుడు ఇచ్చేస్తామన్నాడు. వడ్డీ తీసుకోకపోతే అసలులో జమ చేస్తామని డిపాజిట్‌దారులకు చెప్పాడు. కొంతకాలం చెల్లింపులు బాగుండడంతో డిపాజిట్ దారులు తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లతో డబ్బులు కట్టించారు. ఇల్లు కట్టుకుందామని, కూతురి పెళ్లి చేద్దామని దాచుకున్న డబ్బులు, ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ డిపాజిట్లు చేశామని బాధితులు పేర్కొన్నారు. ఇలా సుమారు రూ.10 కోట్లు నగదు రూపంలో, రూ.5 కోట్లు ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా ప్రదీప్ డబ్బు సేకరించాడు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 123 మంది బాధితుల నుంచి సుమారు రూ.15 కోట్లు వరకూ సేకరించినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరంలోనే దాదాపు 50 మంది వరకూ బాధితులు ఉన్నారని చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో బోర్డు తిప్పేయగా బాధితులు అప్పటి నుంచి ప్రదీప్ కోసం వాకబు చేస్తున్నారు. ఫలితం లేకపోవడంతో ఈ నెల 22న ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రత్యేక పోలీస్ టీం నిందితుడి కోసం గాలిస్తోందని సీఐ పవన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కేసు నీరుగారుస్తారేమో!
జేగురుపాడుకు చెందిన ప్రదీప్ అలియాస్ బాలు వైసీపీ యువ నాయకుడు కావడంతో వైసీపీ ముఖ్యులతో పరిచయాలు లేకుండా ఒక్కడే ఇంత దోపిడీ చేసే అవకాశం ఉండదని బాధితులు అంటున్నారు. వైసీపీ నాయకుడు కావడంలో వైసీపీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి కేసు నీరుగార్చే పని మొదలు పెట్టారని ఆవేదన చెందుతున్నారు.
Updated Date - 2023-08-02T00:23:49+05:30 IST