వణికిస్తున్న ఘాటీ ప్రయాణం
ABN, First Publish Date - 2023-06-26T01:20:58+05:30
మోతుగూడెం, మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్‌లో ప్రయాణం కత్తిమీద సాములా మారింది. ఏ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం ఘాట్ రోడ్‌లో భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి.
కొన్నిచోట్ల మలుపుల్లో ఇరుక్కుపోతున్న భారీ వాహనాలు
గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మోతుగూడెం, జూన్ 25: మోతుగూడెం, మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్‌లో ప్రయాణం కత్తిమీద సాములా మారింది. ఏ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం ఘాట్ రోడ్‌లో భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. అంతర్రాష్ట్ర రహదారి కావడంతో రాత్రింబవళ్లు భారీ వాహనాలు తిరుగుతూనే ఉంటున్నాయి. ఈ రహదారి మీదుగా జిల్లాలోని విలీన మండలాలతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయి. మారేడుమిల్లి, పొల్లూరు జలపాతం ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది. దీనితో పాటు భారీ లోడుతో వస్తున్న లారీలు తరుచూ మలుపులో ఎటూ తిరగలేని పరిస్థితుల్లో నిలిచిపోతున్నాయి. ఫలితంగా రోజులు తరబడి ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో గురువారం ఒక లారీ అలానే నిలిచిపోయింది. అతి కష్టం మీద దాన్ని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే శుక్రవారం ట్రాలీ లారీ-బస్సు ఇరుక్కుపోవడంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. శనివారం కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వాలి సుగ్రీవ మలుపు వద్ద..
ఘాట్ రోడ్‌లో వాలమూరు సమీపంలో వాలి సుగ్రీవ మలుపుల వద్ద తరుచూ వాహనాలు మొరాయించడం పరిపాటిగా మారింది. ఈ మలుపులు దగ్గరగా ఉండటంతో పాటు ఒక ప్రమాదకరమైన లోయ, మరోవైపు కొండ ఉండటంతో వాహనాలకు తిరిగే ఆస్కారం ఉండటం లేదు. ఆయా మలుపులో కొండను కొద్దిగా ఖాళీ చేసి అక్కడ గోతులను రాళ్లతో పూడ్చి కాంక్రీట్ చేయడం ద్వారా వాహనాలు రాకపోకలకు మార్గం సుగమం చేయవచ్చు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారు.
Updated Date - 2023-06-26T01:21:04+05:30 IST