చిత్రం.. భళారే విచిత్రం
ABN, First Publish Date - 2023-01-21T01:06:23+05:30
సృష్టిలోని చిత్ర విచిత్రాలు... కోట్ల ప్రాణుల తన్మయత్వ రూపాలు... ప్రకృతి రమణీయత... ఇలా ఒకటేమిటి చిత్రకారుల కుంచెల నుంచి ఎన్నెన్నో అద్భుత చిత్రాలు జాలువారాయి. చిత్రం.. భళారే విచిత్రం అన్నట్టుగా వ్యంగ్య, వాచ్య భావాలను రంగుల్లో ముంచి కుంచెలతో కాన్వాసులకెక్కించిన చిత్రాలను కనులారా వీక్షించాల్సిందే. కొవిడ్ నేపథ్యంలో నిలిచిన కోనసీమ చిత్రకళా పరిషత్ 31, 32, 33వ వార్షికోత్సవ వేడుకలను ఒకేసారి ఒకే వేదికపై ఆదివారం నిర్వహించనున్నారు.
అమలాపురంలో రేపు అంతర్జాతీయ చిత్ర కళా ప్రదర్శన
అమలాపురం టౌన్, జనవరి 20: సృష్టిలోని చిత్ర విచిత్రాలు... కోట్ల ప్రాణుల తన్మయత్వ రూపాలు... ప్రకృతి రమణీయత... ఇలా ఒకటేమిటి చిత్రకారుల కుంచెల నుంచి ఎన్నెన్నో అద్భుత చిత్రాలు జాలువారాయి. చిత్రం.. భళారే విచిత్రం అన్నట్టుగా వ్యంగ్య, వాచ్య భావాలను రంగుల్లో ముంచి కుంచెలతో కాన్వాసులకెక్కించిన చిత్రాలను కనులారా వీక్షించాల్సిందే. కొవిడ్ నేపథ్యంలో నిలిచిన కోనసీమ చిత్రకళా పరిషత్ 31, 32, 33వ వార్షికోత్సవ వేడుకలను ఒకేసారి ఒకే వేదికపై ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సంద ర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీసత్యసాయి కల్యాణ మండపం అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనకు వేదిక కానుంది. గల్ఫ్ దేశమైన ఖతర్‌తోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిసా, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 789 మంది చిత్రకారుల చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీరిలో 234 మంది విజేతలుగా నిలిచారు. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో విజేతల వివరాలను వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి శుక్రవారం ప్రకటించారు. మొదటి బహుమతులుగా భారత చిత్రకళారత్న అవార్డుతోపాటు రూ.10వేలు నగదు బహుమతిని ముగ్గురికి అందిస్తారు. రూ.5వేలు వంతున 16 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఆర్ట్ లెజెండ్‌గా 35 మంది, అమ రావతి చిత్రకళారత్న క్యాష్ అవార్డు 25 మందికి, కళారత్న, చిత్రరత్న, స్వర్ణచిత్రరత్న, ప్రముఖ చిత్రకారుల పేరుతో కేసీపీ అవార్డులు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తామన్నారు.
చిత్ర కళా పరిషత్‌కు 32 వసంతాలు..
కోనసీమ చిత్ర కళా పరిషత్‌ను 1989లో ఏర్పాటుచేశాం. 32 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం అంతర్జాతీ య చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేశాం. దీనిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభిస్తారు. ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి లోగోను ఆవిష్కరి స్తారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే బహుమతి ప్రదానోత్సవ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు.
-కొరసాల సీతారామస్వామి, కోనసీమ చిత్ర కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి
Updated Date - 2023-01-21T20:15:04+05:30 IST