చామంతి ఏమిటే ఈ వింత!
ABN, First Publish Date - 2023-02-13T00:33:57+05:30
చూస్తే చాలు చామంతి ఏమిటే ఈ వింత అనకమానరు.. ఒక్కటా రెండా ఎన్నెన్నో అందాలు.. రంగు రంగుల పుష్పాలు.. శీతగాలికి అలా వచ్చి ఆ గాలి ఆగిన వెంటనే మాయమై పోతాయి.
కడియం నర్సరీ రైతాంగం అద్భుత సృష్టి
కడియం, ఫిబ్రవరి 12 : చూస్తే చాలు చామంతి ఏమిటే ఈ వింత అనకమానరు.. ఒక్కటా రెండా ఎన్నెన్నో అందాలు.. రంగు రంగుల పుష్పాలు.. శీతగాలికి అలా వచ్చి ఆ గాలి ఆగిన వెంటనే మాయమై పోతాయి. ప్రస్తుతం శీతాకాలం చివరలో ఉన్నా కడియం నర్సరీల్లో సీజనల్ పుష్పాలు అబ్బురపరుస్తు న్నాయి. శీతగాలి ఎంత ఎక్కువగ వీస్తే అంత చక్కగా విచ్చుకుని ఈ పూలు సుందరంగా కనిపిస్తాయి. ఏ నర్సరీ చూసినా సీజనల్ పుష్పాలతో కళకళలాడుతున్నాయి. అదరహో అనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా ఈ సీజనల్ పుష్పాలు విరబూస్తాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల్లో ప్రత్యేక భూమిక పోషిస్తాయి. వీటిని బెంగుళూరు, పూనే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అక్టోబర్ మాసం ప్రారంభం నుంచి నవంబరు నాటికి మొక్కలను తయారు చేసి అమ్మకాలకు సిద్ధంగా ఉంచుతారు. మాఘమాసం (ఫిబ్రవరి) వరకు అంటే సుమారుగా శీతగాలి పోయి వేడి గాలి ప్రారంభయ్యే వరకు ఈ పువ్వులు ఉంటాయి. పుష్పాల్లో చైనా పింక్, కారోనియా, బంతి, చామంతి, పిటోనియా, బిగోనియా, దయాంతస్, జినియా, జర్బేరియా, వింకారోజ్, ఫెంటాస్, జర్బేరియా, కొలియన్ కలర్స్, సాల్వియా సిల్వర్ కోకాస్ వంటి వందలాది రకాల మొక్కలు కడియం నర్సరీల్లో కొలువుతీరాయి. కడియం నర్సరీ రైతులు గతంలో వీటిని వేర్వేరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే వారు.. ఈ ఏడాది మాత్రం సొంతంగా తయారుచేసి విజయం సాధించారు. రకారకాల మొక్కలను బ్రీడ్ చేసి కొత్త రకాలను సృష్టిస్తున్నారు. రైతులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు.
Updated Date - 2023-02-13T00:33:59+05:30 IST