Migration : పండగ పూట.. వలస బాట!
ABN, First Publish Date - 2023-10-23T02:09:43+05:30
కరువు మేఘాలు కమ్మేశాయి. వాన జాడ లేక కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతోంది. కర్నూలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. కష్టజీవులను కదిపితే కన్నీటి సుడులే. రెక్కల కష్టం వృథా కాగా అప్పులు మిగిలాయి. ఊళ్లలో పనులు లేవు.
కన్నీళ్లు.. కడగండ్లు..
ఈ ఏడాది ముందుగానే వలసలు
కర్నూలు జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు
ఇప్పటికే 50 వేలకు పైగా కుటుంబాలు వలస
వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు
పెట్టుబడి పోయి అప్పుల ఊబిలో అన్నదాతలు
తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు
తరలిపోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు
దసరా తర్వాత చాలా గ్రామాలు ఖాళీ
అన్నదాతలను ఆదుకోని ప్రభుత్వం
(కర్నూలు-ఆంధ్రజ్యోతి)
కరువు మేఘాలు కమ్మేశాయి. వాన జాడ లేక కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రైతులు అప్పు చేసి పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతోంది. కర్నూలు జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. కష్టజీవులను కదిపితే కన్నీటి సుడులే. రెక్కల కష్టం వృథా కాగా అప్పులు మిగిలాయి. ఊళ్లలో పనులు లేవు. బతుకు భారమైంది. దీంతో జీవనోపాధి కోసం సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 50 వేల కుటుంబాలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి పత్తి తీసే పనులకు వెళ్లాయి. సాధారణంగా ఖరీఫ్ పంటలు ఇంటికి చేరి సంక్రాంతి పండగయ్యాక వలస వెళ్లేవారు. మళ్లీ ఖరీఫ్ సమయానికి స్వగ్రామాలకు చేరుకునేవారు. ఈ ఏడాది కరువు తీవ్రంగా ఉండటంతో అక్టోబరు నెలలోనే వలస వెళ్తున్నారు. వృద్ధులను ఇళ్ల దగ్గరే వదిలేసి పొట్ట చేత పట్టుకొని పిల్లాజెల్లాతో వలసబాట పడుతున్న దైన్యపరిస్థితి. ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో పిల్లల చదువు కోసం ఓ కుటుంబం ఇంటి దగ్గరే ఉండి మిగిలిన వాళ్లు వలస వెళ్తున్నారు. దీంతో కందనవోలు ముంగిట పల్లెటూర్లు బోసిపోతున్నాయి. కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయినా, స్థానికంగా ఉపాధి లేక వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పత్తి తీసే పనులకు..
మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు ప్రాంతాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం నుంచి దాదాపు 50 వేల కుటుంబాలకు పైగా సరిహద్దులు దాటినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని ప్రాంతాలకు, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లారు. కోసిగి మండలంలో 750 కుటుంబాలు ఉన్న పల్లెపాడు గ్రామంలో ఒకే రోజు రెండు వందలకు పైగా రైతులు, వ్యవసాయ కూలీ కుటుంబాలు మూడు వాహనాల్లో తెలంగాణలోని తాండూరు గ్రామానికి పత్తి తీసే పనులకు వలస వెళ్లారు. ఈ గ్రామంలో వర్షాధారం తప్పా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించే నీటి వనరులు లేవు. ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఊళ్లో పనులు లేకపోవడంతో వలస వెళ్లాల్సిన పరిస్థితి. పల్లెపాడులో ఒక్కటే కాదు.. కోసిగి చిర్తనకల్లు, అర్లబండ, డి.బెళగల్ తదితర గ్రామాల నుంచి తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో వివిధ గ్రామాలకు పత్తి తీసే పనుల కోసం వెళ్లారు. కిలో పత్తి తీస్తే రూ.12-13లు ఇస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి రోజుకు 50-100 కిలోలు తీసినా రూ.600-1,000 వరకు వస్తుందని చెబుతున్నారు. అందులో సగం ఖర్చులకు పోయినా రోజుకు రూ.500 చొప్పున డబ్బులు పొదుపు చేసి అప్పులు తీర్చవచ్చని వలస వెళ్తున్నారు.
దసరా తర్వాత గ్రామాలన్నీ ఖాళీ!
ఆలూరు, ఆదోని, పత్తికొండ ప్రాంతాలకు దసరా పండగ నాడు జరిగే దేవరగట్టు మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్ర (కర్రల సమరం) ఎంతో పవిత్రమైన వేడుక. ఈ వేడుక చూసి తెలంగాణకు వలస వెళ్తామని ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన రైతు గాదిలింగప్ప అన్నారు. ఆయనకు ఐదు ఎకరాల పొలం ఉంది. రూ.2 లక్షలు ఖర్చు చేసి పత్తి సాగు చేస్తే వాన లేక పంట ఎండిపోయిందని వాపోయారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి ముప్పాతిక శాతం రైతులు, వ్యవసాయ కూలీలు కూడా పనులు వెతుక్కుంటూ వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వలసలు ఆపేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
ఒంటరిగా వృద్ధురాలు
ఈమె పేరు తమ్మనిగేని శాంతమ్మ. కర్నూలు జిల్లా మండల కేంద్రం కోసిగి గ్రామం. 70 ఏళ్ల వయసులో ఆమె కూతురు ఈరమ్మ, అల్లుడు నరసింహులు వద్ద ఉంటుంది. ఈరమ్మ, నరసింహులు దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని రూ.2 లక్షలు ఖర్చు చేసి పత్తి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పైరు ఎండిపోయింది. ఎకరాకు ఒక క్వింటా కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పు, కౌలు చెల్లించేందుకు.. అత్తను ఇంటి దగ్గరే వదిలి వారు తమ ముగ్గురు పిల్లలతో తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు పత్తి తీసే పనులకు వలస వెళ్లారు. ఇంటి దగ్గర తెలిసిన వాళ్లు పెట్టింది తింటూ ఆ వృద్ధురాలు జీవనం సాగిస్తుంది.
ఇంటికి కాపాలాగా
చంటి పిల్లాడితో ఇంటివద్దే కూర్చున్న ఈమె పేరు కాళ్ల లక్ష్మి. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం మేకడోణ గ్రామం. కాళ్ల వీరేశ్, రమేశ్, గణేశ్ మగ్గురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం. వీరికి ఎకరన్నర పొలం ఉంది. అప్పు చేసి మిరప సాగు చేశారు. ఊరిలో కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కరువు కమ్ముకోవడంతో మిరప పంట ఎండిపోయింది. బతుకు భారం కావడంతో చంటి పిల్లాడు ఉన్న లక్ష్మి, ఆమె భర్త వీరేశ్‌ను ఇంటి దగ్గర కాపలాగా ఉంచి అమ్మ హనుమంతమ్మతో కలసి రమేశ్, గణేశ్‌లు తెలంగాణలోని మునుగోడుకు పత్తి తీసే పనులకు వలస వెళ్లారు.
పెట్టుబడి మట్టిపాలు
కర్నూలు జిల్లాలో 4.15 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా పత్తి 1.97 లక్షల హెక్టార్లు, వేరుశనగ 37,574 హెక్టార్లు, కంది 35,021 హెక్టార్లు, ఆముదం 19,702 హెక్టార్లలో సాగు చేశారు. రైతులు పెట్టిన మొత్తం రూ.4,650 కోట్లకు పైగా పెట్టుబడి మట్టిపాలవుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి, వేరుశనగ, టమోటా, ఆముదం వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముప్పాతిక శాతం పైర్లు ఎండిపోతున్నాయి. కరువు కష్టాలతో తమకు అప్పులే మిగిలాయని రైతులు ఏకరువు పెడుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఏ రైతును కదిపినా కన్నీటి సుడులే.
Updated Date - 2023-10-23T02:09:43+05:30 IST