ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరుపతి,చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా మోత మోగించిన తెలుగుదేశం

ABN, First Publish Date - 2023-10-01T02:00:48+05:30

చంద్రబాబు అరెస్టు తీరుకు నిరసనగా తెలుగుదేశం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు మోత మోగించాయి.

తిరుపతిలో హారన్లు,గంటలతో సుగుణమ్మ తదితరుల నిరసన

తిరుపతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అరెస్టు తీరుకు నిరసనగా తెలుగుదేశం ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాత్రి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు మోత మోగించాయి.వారికి దీటుగా సామాన్య జనం కూడా పెద్దఎత్తున స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఏర్పేడు మండలం మడిబాక గ్రామంలోని రామాలయంలో మహిళలు దీపాలు చేతబట్టుకుని గుడి గంట మోగించారు. తారాజువ్వల వెలుగులు, బాణాసంచా పేలుళ్ళతో అదే మండలంలోని పల్లం గ్రామంలో ఆకాశం దద్ధరిల్లిపోయింది. ఆ మండల కేంద్రం దళితవాడలో చప్పట్ల నడుమ గ్రామస్తులు కంచాలు మోగించారు. డక్కిలి మండలం నరసనాయుడుపల్లిలో కొవ్వొత్తుల వెలుగులో మహిళలు, చిన్నారులు హారన్లు మోగించారు. శ్రీకాళహస్తిలోని ఓ ట్రాక్టర్‌ ట్రాలీ వర్క్‌షాపు వద్ద ఇనుపరేకులపై అభిమానులు మోత మోగించారు. అదే పట్టణంలో గాండ్ల సామాజికవర్గానికి చెందిన అభిమానులు నూనె డబ్బాలు మోగించి తమ అభిమానం చాటుకున్నారు. సత్యవేడులో వినూత్న రీతిలో అభిమానులు సైరన్‌ మోగించారు. వరదయ్యపాలెం మండలం కడూరులో ముస్లిం మైనారిటీలు బిందెలు మోగించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన నివాసంలో కంచం మోగించి నిరసన వ్యక్తం చేయగా తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ నివాసంలో ఆయన సతీమణి చిన్నారులతో కలసి కంచాలు మోగించారు. నగరంలోని తనపల్లి సర్కిల్‌లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద గౌడ్‌ హారన్లు మోగించారు. చంద్రగిరిలో కార్యకర్తలతో కలసి ఇంఛార్జి పులివర్తి నానీ హారన్లు మోగించగా వెంకటగిరిలో బ్యాండు సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ టీడీపీ శ్రేణులు కంచాలు మోగించారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ నివాసం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు డప్పు చప్పుళ్ళ నడుమ హారన్‌, విజిల్‌, కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేటలో టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం సహా కార్యకర్తలు, మహిళలు డ్రమ్ములు, కంచాలు, విజిల్‌ మోగించారు. ఓజిలి పాత పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు డ్రమ్ములు మోగించారు. సూళ్ళూరుపేట, కోట, వరదయ్యపాలెం మండల కేంద్రాల్లో టీడీపీ వర్గీయులు విజిల్స్‌ వేస్తూ ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తన నివాసం వద్ద కార్యకర్తలతో కలసి విజిలేశారు. పట్టణంలోని పూసల వీధిలో కూడా కార్యకర్తలు కంచాల మోతతో సందడి చేశారు. కేవీబీపురం, బీఎన్‌ కండ్రిగ, పుత్తూరు ఎస్బీఐ కాలనీ, పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగలో కంచాలతో పాటు ద్విచక్ర వాహన హారన్లు మోగించారు. కీలపూడిలో మహిళలు కంచాలపై గరిటెలతో కొట్టి శబ్దాలు చేశారు. వడమాలపేట మండలం తట్నేరిలో విజిల్స్‌ మారుమోగగా, వరదయ్యపాలెం మండలం కారేపాకంలో బ్యాండు మోగింది. నగరి ఇంఛార్జి గాలి భానుప్రకాష్‌ బెంగుళూరులో తెలుగు సంఘం ఆధ్వర్యంలో కంచాలు మోగించారు. పాకాల మండలం కావలి వారిపల్లిలో మహిళలు రోడ్డుపైకి వచ్చి కంచాలు మోగించారు. భాకరాపేట గాంధీ కూడలిలో విజిల్స్‌ మోగాయి.

చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకు.. ఐదు నిమిషాల పాటు ప్రజలు మోతమోగించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు, నాయకులతో పాటు సామాన్యులు, చిన్నారులూ రోడ్లపైకి వచ్చారు. పళ్లాలు, డప్పులు, ఈలలు, హారన్లతో శబ్దాలు చేశారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్‌ కటారి హేమలత, జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తదితరులు పెద్దఎత్తున హారన్ల శబ్దాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ యువనేత, జీజేఎమ్‌ చారిటబుల్‌ ట్రస్టు ఛైర్మెన్‌ గురజాల జగన్‌మోహన్‌ లక్ష్మీనగర్‌ కాలనీలోని తన కార్యాలయం వద్ద అభిమానులతో కలిసి విజిల్స్‌ వేసి గంట కొట్టారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ కొంగారెడ్డిపల్లెలో స్థానిక మహిళలతో కలిసి ప్లేట్లు, గిన్నెలతో టేబుల్‌ మీద శబ్దాలు చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో నాయీ బ్రహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ శాంతారామ్‌ ఆధ్వర్యంలో సన్నాయి, డోలు వంటి వాయిదాల్యతో శబ్దాలు చేశారు. పీఎస్‌ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. రామకుప్పం మండలం గుట్టూరు తండాలో గిరిజన మహిళలు రోడ్డు మీదకు వచ్చి ప్లేట్లు, గెరిటెలతో శబ్దాలు చేశారు. పలమనేరులోని పార్టీ కార్యాలయం నుంచి టవర్‌ క్లాక్‌ వరకు విజిల్స్‌, ప్లేట్లతో శబ్దాలు చేయగా, కొలమాసనపల్లెలో క్యాండిల్స్‌తో విజిల్స్‌ వేసి నిరసన తెలిపారు. నగరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మోత మోగిద్దాం కార్యక్రమాన్ని కార్యకర్తలు స్వచ్ఛందంగా చేపట్టారు. రోడ్డుపై, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద, ఇళ్ల వద్ద పలు రకాలు శబ్దాలు చేశారు. పెనుమూరు బస్టాండులో వందల బైక్‌ హారన్లతో మోత మోగించారు. ఎస్‌ఆర్‌పురంలో చిన్నపిల్లలు సైకిల్‌ను ప్రదర్శిస్తూ ప్లేట్లతో శబ్దాలు చేశారు. ఇదిలా ఉండగా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు కండిషన్‌ బెయిల్‌ మీద విడుదల కావడంతో ఈ ప్రాంతంలో ఎవరూ మోత కార్యక్రమంలో పాల్గొనలేదు.

Updated Date - 2023-10-01T02:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising