సుర్రుమంటున్న సూరీడు
ABN, First Publish Date - 2023-04-16T00:51:28+05:30
వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి రొంపిచెర్లలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 15: సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. నిప్పుల కొలిమిలా జిల్లా మారింది. శనివారం వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏప్రిల్ మూడోవారం సూరీడు తన ప్రతాపం చూపుతున్నాడు. మేనెలను తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా వేడి వాతావరణం కొనసాగింది. ఆరుబయటే కాకుండా ఇళ్ళల్లో ఉండేవాళ్లూ వేడికి తట్టుకోలేకపోతున్నారు. వేసవిలో సాధారణంగా ఎండలు ఎక్కువగా ఉంటాయని, అయితే ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల్లో వడగాడ్పులు వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. పలు పట్టణాల్లో ప్రధాన సెంటర్లు, రహదారులు సైతం జనసంచారం లేక వెలవెలపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో రోడ్లు ఆవిర్లు కక్కుతున్నాయి. ఎండ వేడిమి మరో మూడురోజులు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. శనివారం అత్యధికంగా రొంపిచెర్ల మండలంలో 43.3, పుంగనూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Updated Date - 2023-04-16T00:51:28+05:30 IST