ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అలా 97 శాతానికి..!

ABN, First Publish Date - 2023-08-22T01:06:52+05:30

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు.. 23 రోజుల్లో ఓటరు జాబితా ఇంటింటి సర్వే 30 శాతమే జరిగింది. సర్వర్‌ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పెద్దపంజాణి మండలం అమ్మరాజుపల్లెలో సర్వే చేస్తున్న బీఎల్వో

తూతూమంత్రంగా ఓటరు జాబితా ఇంటింటి సర్వే

23 రోజులకు 30 శాతం.. 9 రోజుల్లో 67 శాతం పూర్తి

యాప్‌ పనిచేయకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వివరాల నమోదు

47,492 ఓట్ల తొలగింపునకు ప్రతిపాదన

(చిత్తూరు, ఆంధ్రజ్యోతి)

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు.. 23 రోజుల్లో ఓటరు జాబితా ఇంటింటి సర్వే 30 శాతమే జరిగింది. సర్వర్‌ పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఆ తర్వాత నుంచి గడువు ముగిసిన సోమవారం రాత్రి 8 గంటలకు.. తొమ్మిది రోజుల్లో 67 శాతం నమోదు చేశారు. గడువులోగా పూర్తి చేయాలంటూ జిల్లా అధికారులు బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చారు. పగలు సర్వర్‌ పనిచేయకున్నా రాత్రిళ్లు కూడా నమోదు చేశారు. అలా సోమవారం రాత్రి 8 గంటలకు జిల్లాలో ఓటరు జాబితా ఇంటింటి సర్వే 97 శాతం పూర్తి చేశారు. 12 గంటల్లోగా వంద శాతం పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులున్నారు. ఈ క్రమంలో సర్వే తూతూమంత్రంగా సాగిందన్న విమర్శలున్నాయి.

ఓటరు జాబితాపై ఇంటింటి సర్వేని ఆగస్టు 21వ తేది గడువు విధిస్తూ జూలై 21న ప్రారంభించారు. యాప్‌ సరిగా పనిచేయకపోవడంతో ఈ సర్వే కోసం బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వే పూర్తి చేసి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు చెందిన వెబ్‌సైట్లలో ఆ సమాచారం కనిపిస్తుంది. దీంతో ఆయా ఎన్నికల సంఘాలు ఈ సర్వేను ఫాలోఅప్‌ చేస్తున్నాయి. ఎలాగైనా సరే గడువులోగా సర్వేను పూర్తి చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులు బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చారు. పగలు సర్వర్‌ పనిచేయకుండా రాత్రిళ్లు అయినా వివరాలు నమోదు చేయమని అధికారులు చెప్పారు. దీంతో బీఎల్‌వోలు చేసేదేమీలేక చివరి తొమ్మిది రోజుల వ్యవధిలో 67 శాతం నమోదు చేశారు. దీనికోసం కొందరు బీఎల్వోలు రాత్రంతా కూడా వివరాల నమోదులో నిమగ్నమయ్యారు. దీనివల్ల సర్వే తూతూమంత్రంగా సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి.

సర్వే పూర్తికి ఒత్తిళ్లు

బంగారుపాళ్యం తహసీల్దార్‌ బెన్నురాజ్‌, కుప్పం మండల వీఆర్వో జయరామ్‌ ఓటరు జాబితాపై ఇంటింటి సర్వేలో వెనుకబడ్డారని కలెక్టర్‌ షన్మోహన్‌ ఇటీవల సస్పెండ్‌ చేశారు. వీరిపై ఉన్నతాధికారులు గతంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆగ్రహించారు. అలాగే పెద్దపంజాణి మండలం ఇంటింటి సర్వేలో వెనుకబడిందని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తహసీల్దార్‌ లోకేశ్వరరావు మీద జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు మండిపడ్డారు. దీంతో మండలంలోని బీఎల్‌వోలను రెండు రోజుల పాటు తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఉండమని చెప్పి యాప్‌లో వివరాలను నమోదు చేయించారు. ఈ ఉదాహరణలు సర్వే పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది మీద ఉన్న ఒత్తిడికి నిదర్శనాలు.

సర్వే నామమాత్రంగా సాగిందంటున్న విపక్షాలు

సమయం లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడంతో బీఎల్‌వోలు ఇష్టమొచ్చినట్లు సర్వే పూర్తి చేశారన్నది బహిరంగ సత్యం. ఆ క్రమంలోనే 47,492 ఓటర్ల తొలగింపునకు బీఎల్‌వోలు ఫారం-7 కింద దరఖాస్తు చేశారు. సర్వే తూతూమంత్రంగా సాగడంతో పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపునకు ప్రతిపాదనలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్వే చేసేందుకు బీఎల్‌వోలకు మరింత సమయం కేటాయించి మరోసారి సంపూర్ణంగా సర్వే చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి...

ఓటరు జాబితా సర్వే వివరాలను నమోదు చేసే యాప్‌ సర్వర్‌ పనిచేయకపోవడంతో ఇంటింటి సర్వే పూర్తి చేసి ఆ వివరాలను ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. బీఎల్‌వోలతో రాత్రిళ్లు పనిచేయించి ఆ ఆఫ్‌లైన్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించామని అంటున్నారు. అలాగే సుమారు ఐదేళ్ల నుంచి ఓటరు జాబితా పరిశీలన చేయకపోవడంతో మరణాల సంఖ్య అధికంగా ఉందని, అందుకే ఫారం-7 దరఖాస్తుతో మరణించినవారు ఓట్లను తొలగిస్తున్నామని చెబుతున్నారు.

సోమవారం సాయంత్రానికి సర్వే వివరాలిలా

మొత్తం ఓటర్లు: 15,47,636

సర్వేలో బీఎల్‌వోలు వెరిఫై చేసినవి: 14,57,063

సర్వే చేసినప్పుడు గైర్హాజరైనవారు: 6301

అడ్రస్‌ మారిన వారు: 13,989

చనిపోయినవారు: 30,491

కార్డులో ఫొటో సరిగాలేనివారు: 3798

రిపీటెడ్‌ ఓటర్లు: 3012

ఇంకా సర్వే చేయాల్సిన ఓటర్లు: 90,573

Updated Date - 2023-08-22T01:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising